Comedy actor
-
హీరోగా చంద్రబాబు మనవడు
దివంగత హాస్య నటుడు చంద్రబాబును తమిళ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. కాగా ఆయన వారసత్వాన్ని ఆయన మనవడు సారత్ తన భుజాలపైన వేసుకున్నారు. తెర్కత్తివీరన్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, కథానాయకుడు అన్నీ తానే కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు ఏ దర్శకుడి వద్ద పని చేయలేదు. చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కథానాయకుడికి స్నేహితులుగా మురుగా అశోక్, నాడోడిగళ్ భరణి, మారి వినోద్ నటించగా హీరో తండ్రిగా వేల రామ్మూర్తి నటించారు. అదే విధంగా మధుసూదనన్, కబీర్ తుహాన్ సింగ్, పవన్, ఆర్ఎన్ఆర్ మనోహర్, నమో నారాయణ, రాజసింహన్, ఆర్యన్, రేణుక, ఉమా పద్మనాభన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, ఎన్. షణ్ముఖ సుందరం చాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు సారత్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది తూత్తుకుడి నేపథ్యంలో యథార్థ సంఘటనలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. హీరో నలుగురు మిత్రులు ఐదుగురు పిల్లల మధ్య పగ, ప్రతీకారం ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. ఐదు పాటలు ఎనిమిది ఫైట్లు అంటూ పక్కా కమర్షియల్ ఫార్మెట్లో తెరకెక్కించిన చిత్రం తెర్కత్తి వీరన్ తెలిపారు. చిత్రంలో కడవలమ్మ అనే ఇంట్రో సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవా పాడారని చెప్పారు. ఈ పాటలో శ్రీకాంత్ దేవా తనతో కలిసి నటించడం మరో విశేషం అని పేర్కొన్నారు. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
హాస్య నటుడి పరిస్థితి విషమం.. సాయం కోసం వేడుకోలు
హాస్య నటుడు బోండామణికి రెండు మూత్ర పిండాలు దెబ్బతినడంతో చెన్నై, ఓమందూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడు బెంజిమన్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. శ్రీలంకకు చెందిన బోండామణి వయసు (59). చాలా కాలం క్రితమే బతుకుతెరువు కోసం చెన్నైకు చేరుకున్నారు. అలా 1991లో కె.భాగ్యరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన పవుణు పవుణుదాన్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. తరువాత కొన్ని చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేశారు. సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా వంటి పలు చిత్రాలలో మంచి గుర్తింపు పొందారు. 2019లో నటించిన తనిమై ఈయన చివరి చిత్రం కగా ఈ ఏడాది మే నెలలో గుండె సంబంధిత సమస్యతో ఓమందూర్ ఆసుపత్రిలో చేరి మూడు నెలలకు పైగా అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం రెండు మూత్రపిడాలు దెబ్బతినడంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. నటుడు బెంజిమెన్ విడుదల చేసిన వీడియోలో నటుడు బోండామణికి రెండు మూత్ర పిండాలు దెబ్బతినడంతో ప్రాణాలతో పోరాడుతున్నారని, వైద్య ఖర్చుల కోసం చేతనైనా సాయం అందించాలని కోరారు. కాగా సమాచారం మేరకు ఆయనకు ప్రభుత్వం తరపున రక్తాన్ని ఎక్కిస్తున్నట్లు తెలిసింది. చదవండి: (చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ డైరెక్టర్) -
ఫ్రెడ్ విలియార్డ్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఫ్రెడ్ విలియార్డ్ ఇటీవల మరణించారు. 86 ఏళ్ల ఫ్రెడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమార్తె ట్వీటర్ ద్వారా ప్రకటించారు. ‘రాత్రి నిద్రలోనే మా నాన్నగారు ప్రశాంతంగా కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులోనూ ఆయన చాలా చలాకీగా ఉన్నారు. ఆయన్ని మేమంతా మిస్ అవుతాం’’ అని పేర్కొన్నారు హాప్ విలియార్డ్. ఫ్రెడ్ మంచి కామెడీ యాక్టర్ గా పేరు పొందారు. ‘ఎవ్రీబడీ లవ్స్ రేమండ్, మోడ్రన్ ఫ్యామిలీ’’ వంటి టీవీ షోల ద్వారా పాపులారిటీ పొందారు ఫ్రెడ్. ‘వాల్ – ఈ, యాంకర్ మేన్, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ బ్లాక్’’ వంటి సినిమాల్లో నటించారాయన. ఫ్రెడ్ మరణం పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. -
‘మగాడు ఇలా చేయాలంటే కత్తిమీద సామే’
సాక్షి, యడ్లపాడు/గుంటూరు: చిన్ననాటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం.. ఆ ఇష్టమే అతని ఆశయసాధన దిశగా అడుగులు వేయించింది. ఎందరో కళాకారులను అక్కున చేర్చుకునే కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసింది. బుల్లితెర, వెండితెర నటుడిగా మారేలా చేసింది. అతడే హాస్యనటుడు హర్షిత. ఇది ఇండస్ట్రీలో పిలుచుకునే అతని ముద్దుపేరు. అసలు పేరు గౌస్‌బాష. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి మాబుసుభాని, మహబ్బీ దంపతుల పెద్ద కుమారుడు. స్త్రీ, పురుష పాత్రల్లో వేషం ఏదైనా నటన అదరహో అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌కు.. మొదటినుంచి గౌస్‌బాష సినిమాలను ఎక్కువగా చూసేవాడు. కళపై మక్కువో.. నటుడు కావాలన్న కోరిక తెలియదు కాని ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పడింది. తల్లిదండ్రులు చూపిన విద్యమార్గం కంటే తాను ఎంచుకున్న రంగంపైనే అభిలాష ఎక్కువగా పెంచుకున్నాడు. ఇంటర్, ఏసీ మెకానికల్ ఐటీఐను అతికష్టం మీద పూర్తి చేశాడు. ఆరో తరగతి నుంచే కళారంగం అంటే ఇష్టత ఏర్పడిందని తాను కళాకారుడిగానే జీవితంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నానని కుటుంబసభ్యులకు చెప్పాడు. పగటి కలలు కనకు అంటూ కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఊళ్లో ఇది విన్నవారు కామెడీ చేస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ఆ మాటలు విన్న అతనిలో తన ఆశయం సాధించాలన్న కసి మరింతగా పెరిగింది. జాబ్ నిమిత్తమంటూ ఊరు విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు. నిరాశ ఎదురైనా పట్టు వీడలేదు తనకు ఎంతటి పట్టుదల ఉన్నా, తనలో ఎంతటి ప్రతిభ ఉన్నా గుర్తించే వ్యక్తి అవకాశం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు గడిచాయి. ఒక్క అవకాశమూ తలుపు తట్టలేదు. జరిగిందేదో జరిగింది. ఇంటికి వచ్చేయమంటూ కుటుంబసభ్యులు, మిత్రులు సలహా ఇచ్చారు. అయినా లక్ష్యం సాధించే వరకు ఊరికి తన ముఖం చూపించకూడదనుకున్నాడు. 2018లో చివరిలో ఇండిపెండెంట్ పేరుతో రూపొందించే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం లభించింది. అందులో తన నటనా కౌసల్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అది బాగా వైరల్ కావడంతో ఆ ఫొటోలు చూసి బుల్లితెరలో నటించే అవకాశం లభించింది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు... జెమినీలో జూలకటక, స్టూడియోవన్లో లాఫింగ్ అడ్డా, ఈటీవీ జబర్దస్త్, 108 తెలంగాణ చానల్లో గబ్బర్‌సింగ్ టెలీ కామెడీ షోలలో నటిస్తున్నాడు. దర్శకుడు మూర్తి.. బాషాను పిలిచి ముత్యాలముగ్గులో నటించే అవకాశం ఇచ్చి సీరియల్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కాలేజీ పోరగాళ్లు, మళ్లీమళ్లీ చూశా, పుణ్యదంపతులు సినిమాల్లోనూ నటించాడు. వీటితోపాటు తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన షార్ట్ఫిల్మ్స్లో 20కు పైగా నటించాడు. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్ కవర్సాంగ్స్లోనూ నటిస్తున్నాడు. యూట్యూబ్ చానెల్స్ వారం వారం ప్రసారం చేసే యాదయ్య, యాదమ్మ ముచ్చట్లు, వారం వారం నీ కవితతో వంటి ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లోనూ రాణిస్తున్నారు. స్త్రీ వేషధారణకు మంచి గుర్తింపు స్త్రీ వేషధారణలో హర్షిత పేరుతో చేస్తున్న కామెడీ పోగ్రామ్స్ గౌస్‌బాషాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఆడవారి హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ విషయం కాదు. అందుకు ఆహార్యం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ అభినయం ఉండాలి. మాటాల్లో మృధుత్వం పలకాలి. సిగ్గు, బిడియం తొణికిసలాడాలి. అన్నింటికి మించి నడకలో వయ్యారాలు పోవాలి. వీటన్నింటి ఓ మగాడు చేయాలంటే కత్తిమీద సామువంటిదే. అదికూడా టెలీషోలో చేయడమంటే చాలా కష్టం. కళల పట్ల ఆసక్తి..కళాకారుడిగా నిరూపించుకోవాలన్న కసి ఉన్నప్పుడే అవి సాధ్యపడతాయని గౌస్‌బాషా నిరూపించాడు. పలు చానల్లో కామెడీ షోలలో హర్షిత పేరుతో స్త్రీ పాత్రలు పోషిస్తున్నాడు. -
నాటక రంగాన్ని బతికించాలి
బుచ్చిరెడ్డిపాళెం: కనుమరుగవుతున్న నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మా నందం పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో 33వ జాతీయస్థాయి నాటక పోటీలను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు పౌరాణిక నాటకాలు ప్రాముఖ్యంగా ఉన్నాయని, నేడు సందేశాత్మక నాటికలు ఉన్నాయని తెలిపారు. అవన్నీ మనిషి జీవితంలోని యధార్థ సంఘటనలను కళ్లకు కట్టేలా ఉంటాయన్నారు. అలాం టి నాటక రంగాన్ని కాపాడుతూ, 33 ఏళ్ల పాటు కళాసాగర్ నిర్విరామంగా నాటిక పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. హాస్యం బాధలో నుంచి పుడుతుందన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో సినీరంగంలో దాదాపు 33 ఏళ్ల పాటు 1100 పైగా చిత్రాల్లో నటించానన్నారు. ఇన్నేళ్లు తనను ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా బ్రహ్మానం దం అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నాడని ఇటీవల సోషల్ మీడియాలోవచ్చిన వార్తలు తనకు నవ్వు తెప్పిం చాయన్నారు. పదికోట్ల మంది తెలుగు ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు తన ను ఏ జబ్బులు ఏమీ చేయలేవన్నారు. ప్రేక్షకుల చప్పట్లే తనకు శ్రీరామరక్షని తెలిపారు. అనంతరం నాటక పోటీలను ప్రారంభించా రు. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వ వ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, కళాసాగర్ అధ్యక్షుడు దొడ్ల రమణయ్యయాదవ్, నేతలు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, షేక్ అల్లాబక్షు, కలువ బాలశంకర్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి పాల్గొన్నారు. నా కర్తవ్యం నెరవేర్చా ‘‘పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనందుకు నా కర్తవ్యం నేను నెరవేర్చా’’నని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు బ్యాంకు ఆవరణలో గురువారం ప్రారంభమైన కళాసాగర్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రపై ఉందన్నారు. అందుకే ప్రత్యేక హోదా కా వాలని కోరుతూ ఎంపీ పదవికి రాజీనా మా చేశానని వెల్లడించారు. కాగా 2019 ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకుంటామన్నారు. -
నవ్వించడం ఓ వరం
సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్‌శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ టీం లీడర్ ఆనంద్‌లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. నెగిటివ్ రోల్స్ ఇష్టం : సుమన్‌శెట్టి నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్‌శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్‌పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ పూర్ణామార్కెట్ అని పేర్కొన్నారు. -
ఆత్మరక్షణ విద్యలు ఇతివృత్తంగా ‘ఎళుమిన్’
తమిళసినిమా: హాస్యనటుడు వివేక్‌కు కథానాయకుడిగా రాణించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా నాన్దా బాలా అనే ఒక్క చిత్రం మాత్రమే తెరపైకి వచ్చినా, అదీ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ఎళుమిన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివేక్‌కు భార్యగా నటి దేవయాని నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, శ్రీజిత్, వినీత్, సుఖేశ్, కీర్తిక, దీపిక, అళగం పెరుమాళ్, ప్రేమ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీపీ.విజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైఎం మీడియాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, సంగీతాన్ని గణేశ్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు వీపీ.విజీ తెలుపుతూ ఆత్మరక్షణ విద్యలపై ఆసక్తి కలిగిన ఐదుగురు చిన్నారులు ఆ విద్యల్లో ఘనత సాధించడమే ఎళుమిన్ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. విశ్వనాథన్ అనే వ్యక్తి కొడుకు అర్జున్ మరో ఐదుగురు పిల్లలు మంచి స్నేహితులని, ఈ పిల్లలు ఆత్మరక్షణ విద్యలు కుంగ్‌ఫూ, కరాటే, బాక్సింగ్, కర్రసాముల్లో శిక్షణ పొందుతారన్నారు. అయితే ఆర్థిక స్తోమత లేని ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రుల నుంచే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి సమయంలో అర్జున్ తల్లిదండ్రులు వారికి అండగా నిలుస్తారని తెలిపారు. ఇందులో విశ్వనాథన్గా నటుడు వివేక్, ఆయన భార్యగా దేవయాని నటిస్తున్నారని చెప్పారు. ఈ ఐదుగురు పిల్లలు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, పరిస్థితుల ప్రభావాలను అధిగమించి వారి లక్ష్యాన్ని ఎలా సాధించారన్నదే ఎళుమిన్ చిత్ర కథ అని తెలిపారు. ఇందులో రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో కూడా చిన్నారులు అద్భుతంగా నటించారని చెప్పారు. వీరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందారని దర్శకుడు తెలిపారు. -
విజయ్ సూసైడ్: పరారీలోనే వనితారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: సినీ హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావల్సిందిగా విజయ్‌సాయి భార్య వనితారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్‌లకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే, ఈ నోటీసులను బేఖాతరు చేస్తూ వనితారెడ్డి, శ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మహిళతో విజయ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను వనితారెడ్డి ఇప్పటికే మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని ఆమె వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది. 'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఆడపిల్లను ఎలా బతుకుతాను. నాకు ఒక బిడ్డ ఉంది.. నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి? మా అత్తమామ నన్ను ఏదైనా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? నా భర్త ఎలాంటి వాడో అన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాను. అన్ని రూమర్లకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు వారు తమ కొడుకు చనిపోయాడని ఆలోచిస్తున్నారు గానీ మనవరాలు భవిష్యత్ ఏమిటని ఎవరూ ఆలోచించడం లేదు. కార్లు, బంగ్లాలు, ఉన్నాయని నేను కోర్టులో కేసులు వేశానంటున్నారు.. నేను ఎలాంటి కేసులు వేశానో చూస్తే మీకే తెలుస్తుంది. నా బిడ్డకు తండ్రిని లేకుండా చేశారు. తండ్రిలేని బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. నేను ఎక్కడికీ పారిపోలేదు' అని వనిత పలు విషయాలు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన ప్రకారం ఆమె కాకినాడలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు. -
విజయ్ కేసులో కొత్త సంచలనం
సాక్షి, హైదరాబాద్ : ఆత్మహత్యకు పాల్పడిన కమెడియన్ విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది. ఇంకా సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారంటే.. 'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఆడపిల్లను ఎలా బతుకుతాను. నాకు ఒక బిడ్డ ఉంది.. నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి? మా అత్తమామ నన్ను ఏదైనా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? నా భర్త ఎలాంటి వాడో అన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాను. అన్ని రూమర్లకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు వారు తమ కొడుకు చనిపోయాడని ఆలోచిస్తున్నారు గానీ మనవరాలు భవిష్యత్ ఏమిటని ఎవరూ ఆలోచించడం లేదు. కార్లు, బంగ్లాలు, ఉన్నాయని నేను కోర్టులో కేసులు వేశానంటున్నారు.. నేను ఎలాంటి కేసులు వేశానో చూస్తే మీకే తెలుస్తుంది. నా బిడ్డకు తండ్రిని లేకుండా చేశారు. తండ్రిలేని బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. నేను ఎక్కడికీ పారిపోలేదు' అని వనిత పలు విషయాలు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన ప్రకారం ఆమె కాకినాడలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు. -
విజయ్ కేసులో కొత్త సంచలనం
-
నవ్వుల రేడు రేలంగి
హావభావాలతో నిండైన హాస్యం హాస్యంలో తొలి పద్మశ్రీ అందుకున్న మహానటుడు నేడు ఆయన 41వ వర్ధంతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : హాస్యంతో గిలిగింతలు పెట్టించాడు. నడక, హావ భావాలతో కడుపుబ్బా నవ్విం చాడు. ఆబాలగోబాలాన్ని అలరిం చిన నవ్వులరేడు ‘రేలంగి’ గురించి తెలియని వారు ఉండరు. హాస్యం లో తొలి పద్మశ్రీ అందుకున్న మహా నటుడు రేలంగి వెంకట్రామయ్య వర్థంతి. జిల్లాలోని రావులపాలెంలో 1909 ఆగస్టు 8న 1909లో రేలంగి వెంకటస్వామి, అచ్చాయమ్మ దంపతులకు జన్మించా రు. తండ్రి వద్దే సంగీతం, హరికథలు నేర్చుకున్నారు. 15వ ఏట ‘బృహన్నల’ నాటకంలో స్త్రీ పాత్ర ద్వారా నటనకు శ్రీకారం చుట్టారు. 1937లో విడుదలైన భక్తప్రహ్లాద సినిమా చూసి తాను ఇక సినిమాల్లోనే నటించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో రేలంగి అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా 1935లో కోల్కత్తా వెళుతున్న శ్రీకృష్ణతులాభారం చిత్ర యూని ట్లో కలిసిపోయాడు. ఆ యూనిట్లో నెలకు రూ.30 జీతానికి పనిచేసేవారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 12 ఏళ్లు దాటిపోయినా చిన్నచితకా వేషాలు తప్ప సరైన గుర్తింపు రాలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డారు. అదే సమయంలో హెచ్.ఎం.రెడ్డి నిర్మిస్తు న్న గుణసుందరి కథ చిత్రంలో మంచి పాత్ర లభించింది. అక్కడ నుంచి ఆయన దశ మారిపోయిం ది. తర్వాత మాయాబజార్, ప్రేమించిచూడు, సత్యహరిశ్చంద్ర, వెలుగునీడ లు, లవకుశ, జగదేకవీరుని కథ చిత్రాల్లో తనదైన హాస్యంతో వరుస విజయాలతో రేలంగి దూసుకుపోయారు. 1960లో ఆయ న సమాజం అనే చిత్రాన్ని నిర్మిం చారు. భాగస్వామిగా మిస్సమ్మ చిత్రాన్ని నిర్మించారు. ఆయన 1975 నవంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూశారు. వితరణ శీలి తొలినాళ్లలో తినేందుకు తిండి కూడా ఉండేది కాదు. మద్రాసులో వేరుశనగ గింజలు తిని కడుపునింపుకొనేవారు. తర్వాత వరుస హిట్లతో చిత్ర పరిశ్రమలో కీలక వ్యక్తిగా మారిపోయారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన లోటు ఎవరూ భర్తీ చేయలేరు. – అడబాల మరిడయ్య, సినీ విశ్లేషకుడు -
పాక్ నుంచైనా పోటీ చేస్తా: వేణుమాధవ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సూపర్ పార్టీ అని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అభివర్ణించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో తనను బాగా ఆకర్షించిందన్నారు. పవన్ ఆశయాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వేణుమాధవ్ భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆశయాలు నచ్చడం వల్లే తాను టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు వేణుమాధవ్ వెల్లడించారు. తనకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అభిమానులు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడి నుంచైనా కూడా పోటీ చేస్తానన్నారు. చివరికి పాకిస్థాన్‌లో అభిమానులుంటే అక్కడి నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమని చమత్కరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో తనకు అనుబంధం ఉన్న విషయాన్ని ఈ సందర్బంగా వేణుమాధవ్ గుర్తు చేశారు. నల్గొండ జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు అనుమతించాలని చంద్రబాబును వేణుమాధవ్ కోరారు.