
విజయ్ వేరే మహిళతో చనువుగా ఉన్న ఫొటో విడుదల చేసి సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న వనిత
సాక్షి, హైదరాబాద్: సినీ హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావల్సిందిగా విజయ్‌సాయి భార్య వనితారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్‌లకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే, ఈ నోటీసులను బేఖాతరు చేస్తూ వనితారెడ్డి, శ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఓ మహిళతో విజయ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను వనితారెడ్డి ఇప్పటికే మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని ఆమె వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది.
'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఆడపిల్లను ఎలా బతుకుతాను. నాకు ఒక బిడ్డ ఉంది.. నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి? మా అత్తమామ నన్ను ఏదైనా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? నా భర్త ఎలాంటి వాడో అన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాను. అన్ని రూమర్లకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు వారు తమ కొడుకు చనిపోయాడని ఆలోచిస్తున్నారు గానీ మనవరాలు భవిష్యత్ ఏమిటని ఎవరూ ఆలోచించడం లేదు. కార్లు, బంగ్లాలు, ఉన్నాయని నేను కోర్టులో కేసులు వేశానంటున్నారు.. నేను ఎలాంటి కేసులు వేశానో చూస్తే మీకే తెలుస్తుంది. నా బిడ్డకు తండ్రిని లేకుండా చేశారు. తండ్రిలేని బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. నేను ఎక్కడికీ పారిపోలేదు' అని వనిత పలు విషయాలు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన ప్రకారం ఆమె కాకినాడలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment