వచ్చే 24 గంటల్లో మోస్తరు వర్షాలు
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఏర్పడ్డ రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో తెలిపింది.
ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో అమలాపురం, నందవరంలలో 4 సెం.మీలు, గూడూరులో 3, సూళ్లూరుపేట, సింహాద్రిపురం, మంత్రాలయల్లో రెండేసి సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.