Commercial loans
-
హెచ్డీఎఫ్సీ రుణాల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. -
భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 456 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మార్చి స్థాయితో పోల్చిచూస్తే ఈ పరిమాణం 3.1 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది. మొత్తం రుణాన్ని పలు విభాగాల్లో చూస్తే, దీర్ఘకాలిక రుణం మార్చితో పోల్చితే 4.7% పెరిగి, 369.5 బిలియన్ డాలర్లుగా ఉంది. స్వల్పకాలిక రుణ భారం 3.2% తగ్గి, 86.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లు ఎగయడం విదేశీ రుణ పరిమాణం పెరుగుదలకు కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం విదేశీ రుణంలో వాణిజ్య రుణాల పరిమాణం అత్యధికంగా 35.4%గా ఉంది. తరువాత ఎన్ఆర్ఐ డిపాజిట్లు 23.8%గా ఉన్నాయి. ఇతర రుణాలు 11.7%గా ఉన్నాయి. కాగా దేశాభివృద్ధికి సంబంధించి కేంద్రం విదేశీ కరెన్సీలో జారీ చేసే బాండ్లకు సంబంధించిన ‘సావరిన్ ఎక్స్టర్నల్ డెట్’ సెప్టెంబర్‌లో 88.4 బిలియన్ డాలర్లులుగా ఉంది. మార్చి 2014లో ఈ మొత్తం 81.5 బిలియన్ డాలర్లు.