న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి.
అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్‌మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment