ఇన్చార్జి కమిషనర్గానా... వామ్మో.. మేం చేయలేం!
సాక్షి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలంటేనే అధికారులు జంకుతున్నారు. ఈ కార్యాలయంలో కొందరు కిందిస్థాయి సిబ్బంది దీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోవడం.. వారు పాలనకు సహకరించకపోవడంతోపాటు అనవసర వ్యవహారాల్లో తల దూర్చడం తదితర కారణాలతో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక్క అధికారిపైనే బాధ్యతంతా పడుతోంది. అందుకే.. ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలంటేనే ‘వామ్మో.. మేం చేయలేం’ అంటూ అధికారులు సెలవుపై వెళ్తున్నారు. కమిషనర్ శ్రీనివాస్ సెలవుపై వెళ్లారు. ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతులు చేపట్టిన ఎంఈ శంకర్‌లాల్ కూడా వారం రోజులు తిరగకముందే నెల రోజులు సెలవు పెట్టారు. ఇప్పుడు ఈ బాధ్యతలను నెత్తికెత్తుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
సంక్షేమ పథకాలను అర్హులకే అందించేందుకు, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నగర పాలక అభివృద్ధికి కీలమైన ‘మన డివిజన్-మన ప్రణాళిక’ను కూడా కార్పొరేషన్ అధికారులు రూ.1500 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల సమగ్ర సర్వేలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.
కలెక్టర్ అక్షింతలు కూడా వేశారు. సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఓ అంచనా లేకుండా అధికారులు ముందుకెళ్లడం, అసలు దీనిపై అవగాహన లేనట్టుగా ఉండడంతో నగరంలో సర్వే పూర్తిస్థాయిలో కాలేదు. నగర ప్రజలు తమ ఇళ్లకు సర్వే బృందం రాలేదని కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు కలెక్టర్ రంగంలోకి దిగి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో సర్వేను పూర్తిచేయించారు.
గతంలో పలు ఆరోపణల్లో చిక్కుకున్న కమిషనర్ బి.శ్రీనివాస్.. సర్వే పూర్తయిన వెంటనే సెలవు పెట్టి వెళ్లారు ఆ తర్వాత ఇన్చార్జి బాధ్యతలను ఎంఈ శంకర్‌లాల్‌కు అప్పగిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులు తిరగముందే ఆయన కూడా (ఈ నెల 9 నుంచి) నెల రోజులు సెలవు పెట్టారు. ఇన్చార్జి కమిషనర్‌గా వరంగల్‌లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వరరావుకు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు.
సిబ్బంది సహకరించనందునే..
ప్రధానంగా కార్పొరేషన్ కార్యాలయంలో దీర్ఘకాలికంగా తిష్టవేసిన కొందరు అధికారులు, సిబ్బంది పాలన వ్యవహారాల్లో ఉన్నతాధికారులకు సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. నగరంలో మంచినీటి సరఫరా, ఇతర పాలన వ్యవహారాల్లో సిబ్బంది వ్యవహారు తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. వీరి కారణంగా ఇటు కలెక్టర్, అటు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి కమిషనర్‌కు,ఇన్చార్జి కమిషషనర్కు మొట్టికాయలు పడుతున్నాయి. ఈ కారణంగానే.. ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలంటేనే భయపడాల్సిన పరిస్థితేర్పడింది.
కలెక్టర్ చొరవతోనే గాడిలోకి..
పాలకవర్గం లేకపోవడంతో ఇక తమను ప్రశ్నించేవారే లేరన్న ధోరణితో నగర పాలక సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు విధులకు కూడా సక్రమంగా రావడం లేదు. కార్యాలయానికి ఎప్పుడు వస్తారో.., అసలు వస్తారో... రారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ కార్యాలయ సిబ్బంది పనితీరును గాడిలో పెట్టాలంటే ప్రత్యేకాధికారయిన కలెక్టర్ చొరవ చూపాల్సిందే.