జోన్లకు స్వస్తి
హెచ్ఎండీఏ సంచలనాత్మక నిర్ణయం
జోనల్ ఆఫీసులు తార్నాకకు తరలింపు
ఇక కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు
సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కొత్త కమిషనర్
సిటీబ్యూరో: ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవలందించేందుకు 2009లో హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ‘జోనల్ వ్యవస్థ’ను పూర్తిగా రద్దు చేస్తూ హెచ్ఎండీఏ కొత్త కమిషనర్ శాలిని మిశ్రా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చెల్ జోనల్ కార్యాలయాలను సత్వరం తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి తరలించాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణకు దూరంగా ఉన్న జోనల్ కార్యాలయాల్లో మితిమీరిన అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన కమిషనర్ తొలుత వాటిని సంస్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడి అధికారులకు ఎలాంటి ప్రత్యేక అధికారాలూ లేనందున కేవలం దరఖాస్తులు స్వీకరించి... వాటిని కేంద్ర కార్యాలయంలోని యూనిట్-6కు పంపుతున్న విషయాన్ని కమిషనర్ గమనించారు. అనుమతులన్నీ తార్నాకలోనే ఇస్తున్నందున జోనల్ కార్యాలయాలు అవసరంలేదన్న అభిప్రాయానికి వచ్చారు. పైగా శంకర్పల్లి, శంషాబాద్ కార్యాలయాల్లో అక్రమాలు బయట పడకుండా గతంలో ఫైళ్లు తగులబెట్టిన ఉదంతాలను తెలుసుకున్న కమిషనర్ ఏకంగా జోనల్ వ్యవస్థకే స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే సంస్థలో తిష్టవేసిన 77మంది డెప్యుటేషన్ అధికారులను మాతృసంస్థలకు తిప్పి పంపడంతో పాటు 200మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోనల్ కార్యాలయాలను రద్దు చేయడం హెచ్ఎండీఏలో చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను ఒడ్డున పడేసేందుకు అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నాలుగు జోనల్ కార్యాలయాలకు నెలకు సుమారు రూ.4 లక్షల చొప్పున ఏడాదికి దాదాపు రూ.50ల క్షల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవ్వడంతో 2013 అక్టోబర్ నుంచి వీటికి అద్దె చెల్లించక పోవడంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. ఆదాయం రాకపోగా... ఖర్చులు పెరుగుతుండటంతో జోనల్ వ్యవస్థకు పూర్తిగా చరమగీతం పాడుతూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జోనల్ కార్యాలయాలను యథాతథంగా తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఈ నెల 4 నుంచే జోనల్ కార్యాలయాలు తార్నాకలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు.
లక్ష్యానికి తూట్లు
హెచ్ఎండీఏలో అధికారులు మారిన ప్రతిసారీ వారికి నచ్చిన విధానాలను ప్రవేశపెడుతుండటంతో అసలు లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ అనుమతుల కోసం సుదూరం నుంచి నగరానికి వస్తున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2009లో అప్పటి అధికారులు జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 4 వేల చ.మీ. విస్తీర్ణంలో నిర్మించే భవనాల అనుమతుల కు శివారు ప్రజలు తార్నాక రాకుండా జోనల్ అధికారులే వాటిని పరిశీలించి అనుమతులిచ్చేలా అధికారాలిచ్చారు. సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్లు, లేదా 18 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు సంబంధించిన దరఖాస్తులు జోనల్ కార్యాలయంలోనే పరిష్కరించేవారు. 18 మీటర్లకు పైగా ఎత్తు ఉండే భవనాలకు, గ్రూపు హౌసింగ్ స్కీమ్‌లు, లేఅవుట్లు, గ్రీన్ ఛానల్స్‌కు సంబంధించి మెంబర్ ప్లానర్ స్థాయిలో తార్నాక కేంద్ర కార్యాలయంలో అనుమతి ఇస్తారు. ముఖ్యంగా నోఅబ్జక్షన్ సర్టిఫికెట్లు, సినిమా, కాంప్లెక్స్, పెట్రోల్ పంపులు, పెట్రోలియం ఉత్పత్తులు నిల్వ ఉంచే నిర్మాణాలు, ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్స్ కోసం కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. వీటికి కమిషనర్ అప్రూవల్‌తోనే అనుమతి ఇస్తారు. జోనల్ కార్యాలయాలను తొలగింపుతో శివారు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఒక రోజు పనికి నాలు గు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికేంద్రీకరణ తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యానికి కొత్త కమిషనర్ తూట్లు పొడిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.