ఇడ్లీ - దోశ ఒక తులనాత్మక పరిశీలన - అవగాహన!
హ్యూమర్
‘‘ఇడ్లీ, దోశలలో ఏది ఉత్తమమైంది స్వామీ’’ అని అడిగా మా గురువు గారిని.
‘‘నాయనా తుచ్ఛులైన వారు ఏది ఉత్తమమైనదీ అని అడుగుతారు. నువ్వు వెలిబుచ్చే ఇలాంటి పనికిమాలిన సందేహాలతో పొద్దుపుచ్చుతారు. కానీ తెలివైన వాళ్లు ఏది దొరికితే అది తినేస్తారు. అంతే తప్ప ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడగరు నాయనా’’ అని సెలవిచ్చారు స్వామీజీ.
అయినా నేను పట్టు వీడలేదు.
‘‘ఒకసారి ప్రశ్న కోసం పట్టుపట్టాక వదలకూడదని మీరే అన్నారు కదా స్వామీ. నా ప్రశ్న తర్క, మీమాంస శాస్త్రానికి సంబంధించిందని మీరెందుకు అనుకోకూడదు?’’ నేను మళ్లీ రెట్టించాను.
‘‘సరే విను. చిన్న గిన్నెతో పిండిని పెనం మీద వేశాక దోశ కావడానికి ఆ చిన్న గిన్నెతోనే దానిపై ఒత్తిడి పెడతారు. అది పెనం మీద పరుచుకునేలా విస్తరించడానికి దాని తలమీద రుద్దేస్తారు. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్లను రుబ్బుతుండటం సరికాదని నువ్వు నీ స్పీచుల్లో చెబుతుంటావు చూడు. వాళ్ల లాగే దోశ మీద కూడా అలా రుద్దడం సరికాదు నాయనా. అలా రుద్దినప్పుడు ఏమవుతుందో తెల్సా?’’ అడిగారు స్వామీజీ
‘‘ఏమవుతుంది స్వామీ...?’’ అడిగాను నేను.
‘‘దోశల్లా కార్పొరేట్ పిల్లల్లా ఎదగకుండా ఉండిపోతారు. కానీ ఇడ్లీ అలా కాదు. మెదడు వికాసం జరిగినట్లే ఇడ్లీ కూడా పొంగుతుంది.
పిండి రేణువుకూ, పిండి రేణువుకూ మధ్య ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దోశ ముక్కలను ఎప్పుడైనా సాంబారులో వేశావా? ఏదో దోశతో పాటు స్పూనుతో తాగడానికి సాంబారు సరిపోతుంది గానీ... దోశముక్కలు సాంబారు అంత తేలిగ్గా పీల్చవు. అచ్చం నీ ఉపన్యాసాల్లో మన కార్పొరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లాగే. వారూ అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాలను గానీ... లోకజ్ఞానాన్నిగానీ అబ్జార్బ్ చేసుకోలేరు...’’ అంటుండగానే నేను మధ్యలోనే అడ్డుపడ్డాను.
‘‘అంటే... ఇడ్లీ పీల్చుకుంటుందా స్వామీ’’
‘‘తప్పకుండా నాయనా... మంచి నిపుణులైన వంట చేసేవాళ్లు పిండి కలిపారనుకో. ఆ రవ్వా... ఆ మినప్పప్పు సమపాళ్లలో కలిశాయనుకో. ఇడ్లీలోని పిండికి మధ్య ఎంతెంతో పఫ్పీ స్పేస్ ఉంటుంది. ఆ మధ్యనున్న స్థలంలో సాంబారు దూరిపోతుంది. సాంబారులో నానిన ఆ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నాయనా’’ చెబుతున్నారు స్వామీజీ.
‘‘నిజమే కదా స్వామీ’’ బదులిచ్చాను నేను.
‘‘అంతేకాదు నాయనా... జనం పెరిగారు. జనాభా పెరిగింది. వాళ్లకు తగ్గట్లుగా ఇళ్లు కూడా కావాలి కదా’’ అన్నారు స్వామీజీ.
‘‘అవును కదా. మరి దానికీ ఇడ్లీకీ సంబంధమేమిటి స్వామీ?’’ అడిగాను.
‘‘అదే నాయనా నాలాంటి జ్ఞానులకూ, నీకూ తేడా. ఇడ్లీ పాత్రలో గతంలో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. పాత్రపెద్దదవుతూ ఉండేదీ... దానిలోని పిండి పోసే చిప్పలు పెరిగేవి. కానీ... డూప్లెక్సు భవనంలా ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండేవి. కానీ ఇప్పుడు మాడ్రన్ ఇడ్లీ పాత్రను ఎప్పుడైనా హోటల్లో చూడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఒకదానిపైన ఒకటి ఉంటాయి.
ర్యాకులనూ, డెస్కులనూ బయటకు లాగినట్లుగా వాటిని లాగుతుంటారు’’ అని జవాబిచ్చారు స్వామీ.
‘‘అవును స్వామీ... ఇడ్లీ పాత్రకూ, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లకూ అంత దగ్గరి సంబంధం ఉంటుందనుకోలేదు’’ అన్నాన్నేను.
‘‘అంతేకాదు... దోశ కంటే ఇడ్లీ ఎన్ని రకాలుగా ఉత్తమమో చెబుతాను ఆగు. ఉదాహరణకు మసాలా దోశ తిన్నావనుకో. అందులో మసాలా పేరిట ఉండే పదార్థం నీకు సరిపడకపోవచ్చు. కడుపులో మంట పుట్టించవచ్చు. దోశకు అది తెచ్చిపెట్టుకున్న టేస్టు. కానీ ఇడ్లీలో అలా కాదు నాయనా... మసాలాలూ, గిసాలాలూ ఏవీ లేకుండా... కేవలం ఇడ్లీ వల్లనే ఇడ్లీకి రుచి వస్తుంది. ఏదీ తెచ్చిపెట్టుకోనిదో, ఏది స్వాభావికమైనదో ఆ టేస్టు గొప్పది నాయనా’’ అన్నారు స్వామీజీ.
‘‘అయినా అరిషడ్వర్గాలనూ జయించిన మీలాంటి స్వామీజీలు రుచుల గురించి ఇంత విపులమైన వర్ణనలేమిటి స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగా.
‘‘పిచ్చివాడా... ఇడ్లీ అంటే ఏమిటి? సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం నాయనా. సాంబారు ఇడ్లీలోకి ఎలా ఇంకిపోతుందో తెలుసా? అచ్చం జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లే! మాలాంటి జ్ఞానులకు ఇవన్నీ తెలుసు. కానీ తిండిబోతులైన నీలాంటి తుచ్ఛులకు అర్థమయ్యేలా చెప్పడమెలా? అయినా నువ్వే చెప్పావు కదా. తర్క మీమాంస శాస్త్రాలు నీబోటి సామాన్యులకు కూడా అర్థం కావడం కోసమే నాయనా ఈ ఉదాహరణలు’’ అని సెలవిచ్చారు స్వామీజీ.
నాకు జ్ఞానోదయమైంది. అనంతాకాశం అనే సాంబారు ప్లేటులో అర్ధచంద్రుడు ఇడ్లీలా దర్శనమిచ్చాడు!
- యాసీన్