ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరి దుర్మరణం
ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలోని జేబాబాగ్ మంగళవారం భారీ పేలుడు శబ్ధంతో ఉలిక్కిపడింది. ఏసీ మిషన్‌ను మరమ్మతు చేసిన అనంతరం కంప్రెషర్‌లోకి గ్యాస్ రీ-ఫిల్లింగ్ చేస్తుండగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. తీవ్రత దాటికి మృతదేహాలు దుకాణం బయటకు ఎగిరిపడ్డాయి. షాప్ యజమాని క్షతగాత్రుడు కాగా.. అతడి స్నేహితుడు తృ టిలో తప్పించుకున్నారు. దాదాపు కిలోమీటరు మేర భారీ శబ్ధం వినిపించడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇన్స్పెక్టర్ జె.నర్సయ్య, స్థానికుల కథనం ప్రకారం.. కిషన్‌బాగ్‌లో నివసించే ఫయాజ్ జేబాబాగ్‌లో రెండేళ్లుగా ఎంఎన్సీ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పేరిట ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు దుకాణం నిర్వహిస్తున్నారు.
ఇతడి వద్ద మొఘల్ కా నాలా రింగ్‌రోడ్, జిర్రాలకు చెందిన యాసిన్ (18), రిజ్వాన్ (24) టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏసీ మిషన్‌ను బాగు చేసిన వీరు దాని కంప్రెషర్‌లోకి గ్యాస్‌ను రీ-ఫిల్లింగ్ చేస్తున్నారు. సాంకేతికంగా ఏర్పడిన సమస్యతో ఇది ఒక్కసారిగా పేలిపోయింది. దీని దాటికి ఇద్దరూ ఎగిరి దుకాణం ఎదుట ఉన్న రోడ్డుపై పడి మృతి చెందారు. ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుతో భయానకంగా తయారైంది. ఈ ఘటన జరిగిన సమయంలో షాప్ యజమాని ఫయాజ్, అతడి స్నేహితుడు ఆరీఫ్ అక్కడే ఉన్నారు. ఫయాజ్ గాయపడగా, ఆరీఫ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
పేలుడు తీవ్రతకు ఏసీ మిషన్ విడి భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. వంద అడుగుల దూరంలో ఉన్న షట్టర్‌కు గుచ్చుకున్నాయి. దుకాణం బోర్డు, ముందు నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఇళ్లల్లో వంటసామగ్రి ఎగిరి కింద పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పది నిమిషాల ముందు స్థానిక అమ్మవారి ఆలయం నుంచి భారీ ఎత్తున ఫలహారపు బండి బాజాభజంత్రీలతో ఊరేగిస్తూ తీసుకెళ్లారు. అప్పటికే ఊరేగింపు ఆలస్యమవుతుందంటూ ఆసిఫ్‌నగర్ ఎస్సై ఉపేందర్ నిర్వాహకులను తొందరపెట్టారు. కాస్త ఆలస్యమై ఉంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సరైన ప్రమాణాలు పాటించని ఆరోపణలపై ఫయాజ్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ నర్సయ్య తెలిపారు.
కంప్రెషర్ పేలింది: ఫోరెన్సిక్ నిపుణుడు వెంకన్న
కంప్రెషర్ పేలడంతో వల్లే ప్రమాదం జరిగిందని నగర క్లూస్‌టీమ్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న తెలిపారు. ఘటన స్థలాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ‘రిఫ్రిజిరేటర్, ఏసీ వంటి పరికరాల్లో ఉండే కంప్రెషర్‌లో క్లోరోఫ్లోరోకార్బన్ సమ్మిళితమైన వాయునును నింపుతారు. అవి పని చేయడానికి ఇది ఎంతో కీలకం. ఏసీ మిషన్ కంప్రెషర్‌లో ప్రియాన్ గ్యాస్ ఉంటుంది. దుకాణదారులు దీన్ని పెద్ద సిలిండర్ల (18 కిలోలు)లో కొనుగోలు చేస్తారు.
దాన్నుంచి చిన్న సిలిండర్లలోకి (5 కిలోలు) మార్చి ఆపై కంప్రెషర్‌లోకి నింపుతారు. ఈ పరిమాణాన్ని కొలవడానికి ప్రత్యేక గేజ్‌లు వినియోగిస్తారు. యాసిన్, రిజ్వాన్ ఏసీ మిషన్ మరమ్మతుల తరవాత గ్యాస్ రీ-ఫిల్లింగ్‌కు ఉపక్రమించారు. వీటి కంప్రెషర్ సామర్థ్యం 2 నుంచి 4 కిలోల వరకు మాత్రమే ఉంటుంది. గేజ్ సరిగ్గా పని చేయని కారణంగా పరిమితికి మించి నింపడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు జరిగిన దిశలో ఉండటంతో కార్మికులు చనిపోయారు’ అని ‘సాక్షి’కి వివరించారు.