రైల్వే పనులకు పోటాపోటీగా టెండర్లు
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని యర్రగుంట్ల– నోస్సం మధ్య కొత్త రైలు మార్గంలో వంతెన నిర్మాణ పనులకు గాను సోమవారం నిర్వహించిన టెండర్లలో తెలుగుదేశం నేతలు, ఫ్యాక్షనిస్టులు తమ హవాను కొనసాగించారు. ముందుగానే గుంతకల్లు పట్టణానికి చేరుకున్న నాయకులు, ఫ్యాక్షనిస్టులు పలు లాడ్జీల్లో మకాం వేసి కాంట్రాక్టర్ల మధ్య సిండికేట్ చేయడానికి ప్రయత్నించారు.
ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఈ పనులకు కాంట్రాక్టర్ల మధ్య సిండికేట్ కావడానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సురేష్ చౌదరి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి తనయుడు, తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ చైర్మన్ హనుమంతరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ల మధ్య జరిపిన చర్చలు విఫలం కావడంతో పోటాపోటీగా షెడ్యూళ్ల దాఖలు అయ్యాయి.
యర్రగుంట్ల–నోస్సం మధ్య నూతన రైలు మార్గంలో దాదాపు 10 చోట్ల ఆర్ఓబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి) పనులకు రూ.37,13 కోట్లతో టెండర్లు పిలువగా 09 షెడ్యూళ్లు దాఖలు చేశారు. డీఆర్ఎం కార్యాలయం వద్ద గుంపులుగా ఉన్న వారిని గుంతకల్లు వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు సిబ్బందితో చెదరగొట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా చేశారు.