Congress Chintan Shivir
-
అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: రాష్ట్రం ప్రస్తుతం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పులను సాకుగా చూపి హామీలను విస్మరించమని, ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దిగువ మానేరు జలా శయం నుంచి ఆయకట్టుకు ఆదివారం సాయంత్రం కాకతీయకాలువ ద్వారా నీటిని కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యాసంగి పంటలకు ఎల్ఎండీ నుంచి సూర్యాపేట వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఎల్ఎండీ, మిడ్ మానేరులో తాగునీటి కోసం 15టీఎంసీలు నిల్వ చేసి మిగతా 29 టీఎంసీలు ఆయకట్టుకు విడుదల చేస్తామని వెల్లడించారు. రైతులు నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో అభయహస్తం దరఖాస్తులపై సమీక్ష చేశారు. అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు. ప్రజలు గత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని మార్చి తాము చెబితే వినాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మంత్రి అన్నారు. తప్పకుండా ప్రజల సూచనలు, సలహాలు, ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు ఆరుకోట్ల ఉచిత బస్సు టిక్కెట్లు మహిళలు వినియోగించుకున్నారని తెలిపా రు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, తహసీల్దార్ కనుకయ్య, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, ఎస్ఎల్గౌడ్, శ్రీగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిగురుమామిడిలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్‌కుమార్ కూతురు సిరివైష్ణవ్య చేత కేక్‌కట్ చేయించారు. బొకేలు వద్దు.. నోట్‌బుక్స్‌తో రండి! నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు తనవద్దకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలతో కాకుండా నోట్‌బుక్స్, పుస్తకాలు తీసుకురావాలని సూచించారు. అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, వాటిని విద్యార్థులకు, చిన్నారులకు చేరవేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ఇళ్లపట్టాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అ ప్రక్రియ రద్దు చేశామని తెలిపారు. అర్హుల జాబితాను పారదర్శకంగా తయారు చేసి ఇస్తే, వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బాధ్యతతో 2024కు స్వాగతం.. కాంగ్రెస్ పార్టీకి 2023 శుభ సంవత్సరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీసిన వైనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కోరుకొన్న ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. స్వేచ్చగా జీవించే విధంగా, తమ సమస్యలు చెప్పుకొనే విధంగా, తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ దిశగా ప్రజలు రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చారని అన్నారు. 2024 సంవత్సరం తమకు బాధ్యతతో కూడిన సంవత్సరమని, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే సంవత్సరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ‘పీకే’ ఆసక్తికర వ్యాఖ్యలు
సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల చింతన్ శిబిర్ నిర్వహించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా మూడు రోజుల పాటు ఈ భేటి జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాహుల్ గాంధీ పాదయాత్రతో సహా ఎన్నికలపై ఫోకస్పెట్టింది. కాగా, కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. పీకే.. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అదో విఫల చింతన్ శిబిర్ అంటూ సటైర్లు వేశారు. ఈ శిబిర్ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులు సంభవించవు. ఎప్పటిలాగే అదే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి చెందే వరకూ కాంగ్రెస్‌లో ఈ యథాతథ స్థితి ఇలాగే వుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు హ్యాండ్ ఇచ్చారు. గుజరాత్ పీసీసీ చీఫ్ హార్ధిక్ పటేల్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాకర్ సహా మరికొందరు నేతలు హస్తం పార్టీని వీడారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP! — Prashant Kishor (@PrashantKishor) May 20, 2022 ఇది కూడా చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! -
Sakshi Cartoon: చింతించాల్సిన ఇంకో విషయం సార్..!
చింతించాల్సిన ఇంకో విషయం సార్..సునీల్ జాఖడ్ పార్టీకి రాజీనామా చేశారు! -
Congress chintan shivir: ప్రజలతో బంధం తెగింది
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: దేశ ప్రజలతో కాంగ్రెస్ బంధం తెగిపోయిందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొని బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అక్టోబర్‌లో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. చింతన్ శిబిర్‌లో ముగింపు సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్ఘాటించారు. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు. ‘‘నేను మీ కుటుంబం, మీరు నా కుటుంబం. ఇది ఒక కుటుంబం. నా పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపైనే. అది దేశానికి ముప్పుగా మారింది. మనం కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు, దేశంలో అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం’’ అని చెప్పారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ వంటి శక్తులకు తాను భయపడనని పేర్కొన్నారు. ‘‘నేను జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. భరతమాత నుంచి ఒక పైసా కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్ రానున్నది చాలా కఠినమైన పోరాటమని రాహుల్ చెప్పారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని తెలిపారు. భారతదేశ సంస్థాగత నిర్మాణాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు పని చేయడం మానేసిన రోజు మనమంతా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి పోరాడటం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ బాధ్యత అని వివరించారు. నాయకుల దృష్టి అంతా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంపైనే ఉండాలన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెమట చిందించాల్సిందేనని.. ఇది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించేలా పని చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు. మన దగ్గరి కంటే ప్రత్యర్థుల వద్దే ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందుకే వారిలాగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగతంగా యువత, సీనియర్లతో కూడిన మిశ్రమ నాయకత్వం ఉండాలని చెప్పారు. -
కన్యాకుమారి నుంచి కశ్మీర్.. భారత్ జోడో యాత్ర
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్రి సోనియా గాంధీ ‘భారత్ జోడో’ నినాదం ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్ శిబిర్‌లో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘2024’ దృష్టితో సంస్కరణలు పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్ శిబిర్‌లో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. ‘‘2024 ఎన్నికలపై దృష్టి పెడుతూ పలు సంస్కరణలు అమలు చేయనున్నాం. అందుకు రెండు మూడు రోజుల్లో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకొనే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. అడ్వైజరీ కమిటీ భేటీలే కాకుండా సీడబ్ల్యూసీ సమావేశాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె వివరించారు. మేనిఫెస్టోలో ఈవీఎంల రద్దు: చవాన్ ఈవీఎంల విశ్వసనీయత, పనితీరుపై పార్టీల్లో, ప్రజల్లో అనుమానాలున్నందున వాటిని పక్కనపెట్టి, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తేవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇస్తామన్నారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో జరిగే అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేపర్ బ్యాలెట్ల అంశాన్ని చింతన్ శిబిర్‌లో లేవనెత్తానని అన్నారు. చాలామంది నేతలు తన వాదనకు మద్దతు పలికారని వెల్లడించారు. ఈవీఎంలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినా ఫలితం ఉండదని, అందుకే తమ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నెగ్గడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమని వివరించారు. తమ విజయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ పదేపదే కోరుతోంది. సవాళ్లను అధిగమిస్తాం ‘‘చింతన్ శిబిర్ చాలా ఉపయోగకరంగా, ఫలవంతంగా సాగింది. నా పెద్ద కుటుంబం (కాంగ్రెస్)తో గడిపే అవకాశం కలిగింది’’ అని సోనియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్‌కు కొత్త శుభోదయం రానుంది. అదే మన అంకితభావం. అదే నూతన సంకల్పం’’ అన్నారు. భారత్ జోడోయాత్రలో తన లాంటి సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడకుండా పాల్గొనే మార్గాలు వెతకాలంటూ చమత్కరించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, లుప్తమైపోతున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకే ఈ యాత్ర అన్నారు. నిరుద్యోగం, ధరల భారం అంశాలను జన జాగరణ్ అభియాన్–2లో లేవనెత్తుతామన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలలో ఈ పరిస్థితి లేదు.. -
50 ఏళ్లలోపు వారికే... సగం టికెట్లు
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు కల్పించడం, కింది స్థాయి నుంచి బలోపేతం కావడం, ప్రజలకు దగ్గరవడమే లక్ష్యంగా ‘చింతన్ శిబిర్’ పలు తీర్మానాలు చేసింది. యువ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటు, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్ల లోపు నేతలకే కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ సగం వారికే కట్టబెడతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన పదవులకు పార్టీపరంగా రిటైర్మెంట్ వయసును ఖరారు చేస్తారు. వీటన్నింటినీ 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం ముగిసిన మూడు రోజుల కాంగ్రెస్ ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ నిర్ణయించింది. పార్టీ ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన మార్పుచేర్పులు తదితరాలపై అంశాలవారీగా ఏర్పాటైన రాజకీయ, సామాజిక న్యాయ–సాధికారత, ఆర్థిక, సంస్థాగత వ్యవహారాల, వ్యవసాయ, యువజన ప్యానళ్లు రెండు రోజులుగా చర్చించి పలు ప్రతిపాదనలతో అధినేత్రి సోనియాకు నివేదికలు సమర్పించాయి. ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూలంకషంగా చర్చించి వాటికి ఆమోదముద్ర వేసింది. ఒక వ్యక్తికి పార్టీలో ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్ వంటి పలు తీర్మానాలతో ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ప్రవేశపెట్టిన ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదించిన తీర్మానాలు... నమో యువత... ► 2024 నుంచి లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, మండలి ఎన్నికల్లో 50 శాతం టికెట్లు 50 ఏళ్ల లోపువారికే. ప్రభుత్వ పదవుల్లోనూ సగం వారికే. చట్టసభల్లో రిటైర్మెంట్ వయసు ఖరారు. ► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ 50 శాతం పదవులు 50 ఏళ్లలోపు వారికే ► యువతకు ఉద్యోగాల డిమాండ్‌తో ఆగస్టు 15 నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘ఉపాధి దో’ పాదయత్ర. సంస్థాగత, సామాజిక అజెండాలు ► ఇకపై పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్. కుటుంబంలో రెండో సభ్యుడు రాజకీయంగా చురుగ్గా ఉంటే ఐదేళ్ల సంస్థాగత అనుభవం తర్వాతే టికెట్‌కు అర్హత. ► పార్టీ పదవిలో ఎవరూ ఐదేళ్ల కంటే ఉండొద్దు. ► పబ్లిక్ ఇన్సైట్, ఎన్నికల నిర్వహణ విభాగాలు, నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. ► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం. ► అధ్యక్షునికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ సభ్యలతో అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల గొంతుక విన్పించేందుకు సామాజిక న్యాయ సలహా మండలి. ► కులాలవారీ జనగణనకు జాతీయ స్థాయి పోరు ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి. ► రైతులకు ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధరతో పాటు 50 శాతం అదనంగా చెల్లించాలి. ► జాతీయ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. ► రైతుల రుణ ఉపశమన కమిషన్ తేవాలి. ► పేద విద్యార్థులకు కాలేజీలు, వర్సిటీల్లో ఉచిత విద్య అందించాలి. ► పేదరికం, ఆర్థిక అసమానతలను రూపుమాపే ఆర్థిక విధానాల రూపకల్పనకు కాంగ్రెస్ కట్టుబడింది. సమయానుకూలంగా పొత్తులు డిక్లరేషన్‌లో కాంగ్రెస్.. బీజేపీపై నిప్పులు బీజేపీది కుహనా జాతీయవాదమంటూ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ దుయ్యబట్టింది. తమదే సిసలైన జాతీయవాదమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ‘ఆర్ఎస్ఎస్ అజెండాతో రాజ్యాంగంపై మోదీ సర్కారు దాడి చేస్తోంది. మత విభజనను వ్యాప్తి చేస్తోంది. రాష్ట్రాల అధికార పరిధిని ఆక్రమిస్తోంది. గవర్నర్ పదవినీ దుర్వినియోగం చేస్తోంది. ప్రమాదకర ఆర్థిక విధానాలకు తెర తీసింది’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దేశ ప్రయోజనాల కోసం భావ సారూప్య పార్టీలతో సమయానుకూల పొత్తులకు కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మాణిక్ సాహా -
చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత గుడ్‌బై
చండీగఢ్: చింతన్ శిబిర్ పేరుతో మేధో మథనం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, దివంగత నేత బలరాం జాఖడ్ కుమారుడు, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ షోకాజ్ నోటీసివ్వడం, పదవుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి లోనై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్ లక్. అండ్ గుడ్‌బై కాంగ్రెస్’’ అని శనివారం ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించారు. చింతన్ శిబిర్‌ను ప్రహసనంగా అభివర్ణించారు. దానికి బదులు కాంగ్రెస్ ‘చింతా’ శిబిర్ నిర్వహించాలన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో మంచి నాయకుడు రాహుల్ గాంధీయేనన్నారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. జాఖఢ్ వంటి నాయకున్ని వదులుకోవద్దని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. -
Congress Chintan Shivir: సోషల్ ఇంజనీరింగ్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అంతర్గత ప్రక్షాళన దిశగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కాంగ్రెస్ లోతుగా మల్లగుల్లాలు పడుతోంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లో శనివారం రెండో రోజు పార్టీ మథనం సుదీర్ఘంగా కొనసాగింది. అంశాలవారీగా అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు రోజంతా చర్చలు జరిపాయి. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్ ఇంజనీరింగ్‌కు తెర తీయడమే మార్గమని సామాజిక, న్యాయ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం పార్టీ విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం కేటాయించాలని దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఒక నేతను రాజ్యసభకు గరిష్టంగా రెండుసార్లు మాత్రమే నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా అసమ్మతి గళం విన్పిస్తున్న సీనియర్ నేతల ప్రధాన డిమాండ్ అయిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీని రద్దుకు, దాని స్థానంలో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు కూడా అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతుండటం మరో కీలక పరిణామం. సామాజిక న్యాయంపై మథనం కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయ కమిటీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. పార్టీలో బూత్ స్థాయి నుంచి డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ, సీడబ్ల్యూసీ దాకా అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రస్తుతమున్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్‌కు పట్టుబట్టడంతో పాటు ఆ కేటగిరీకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నైష్పత్తికంగా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కులాలవారీ జనగణన జరపాలని కూడా కోరాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కమిటీ చర్చల వివరాలు, సిఫార్సులను కన్వీనర్ సల్మాన్ ఖుర్షీద్, సభ్యుడు కొప్పుల రాజు శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు. సామాజిక న్యాయ వ్యవహారాలపై రూపొందించాల్సిన విధానాలను సూచించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల నమ్మకాన్ని చూరగొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీ చీఫ్‌కు మండలి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటిదాకా సరైన ప్రాతినిధ్యం దక్కని పలు ఉప కులాలను గుర్తించే ప్రక్రయను పార్టీపరంగా చేపట్టనున్నట్టు రాజు చెప్పారు. చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయనున్నామన్నారు. జీఎస్టీ పరిహారం మరో మూడేళ్లు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రస్ ఆర్థిక రంగ ప్యానల్ కన్వీనర్ చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ‘‘మోదీ సర్కారు పాలనలో ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటు కింది చూపే చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగాయి. పెట్రో ధరల పెరుగుదల తదితరాలు సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. జీఎస్టీ చట్టాలను మోదీ స్కరారు పేలవంగా రూపొందించి, అన్యాయంగా అమలు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారింది. తక్షణ పరిష్కార చర్యలు అవసరం’’ అని డిమాండ్ చేశారు. అన్ని అంశాల పైనా ఆర్థిక ప్యానల్ చర్చించినట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలూ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి.వాటిని ఎదుర్కొనే మార్గాలపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేక సమస్య మరింత తీవ్రతరమవుతోంది. కేవలం గత 7 నెలల్లో 22 బిలియన్ డాలర్లు దేశం నుండి బయటికి వెళ్లిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 36 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. వీటిపై అంశాలవారీగా కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశ్రమ, వ్యాపారం, వాణిజ్య రంగాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కాంగ్రెస్ విశ్వసిస్తోందని చెప్పారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రియాంక? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు సమాచారం. మరోవైపు, రాహుల్ ఇష్టపడని పక్షంలో ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని చింతన్ శిబిర్ వద్ద పలువురు నేతలు కోరారు. శనివారమంతా నేతలు దీనిపై జోరుగా చర్చించుకున్నారు. త్వరలో జన్ అభియాన్2 ఏఐసీసీ నేతలతో సోనియా చర్చలు కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు జన్ జాగరణ్ అభియాన్ రెండో దశ నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. చింతన్ శిబిర్‌లో భాగంగా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జన్ జాగరణ్ అభియాన్‌తో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలు కోరారు. ఈ భేటీలో వచ్చిన ప్రతిపాదనలపై ఆదివారం చింతన్ శిబిర్ మూడో రోజు సీడబ్ల్యూసీ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జన్ జాగరణ్ అభియాన్ తొలి దశను 2021 నవంబర్ 14–29 మధ్య దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టడం తెలిసిందే. -
మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణచివేస్తోంది: సోనియా గాంధీ
ఉదయ్‌పూర్: మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఉదయ్‌పూర్(రాజస్థాన్) వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ ప్రారంభోపన్యాసంతో ఆమె ప్రారంభించారు. దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోంది. గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను బీజేపీ క్రూరంగా అణిచివేస్తోంది. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను చర్చించుకోవడానికి 'నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్' ఒక అవకాశం కల్పిస్తుందని పార్టీ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ అన్నారు. నిరంతరం భయపెట్టడం, అభద్రతతో దేశ ప్రజలను బతికేలా చేయడం, మన సమాజంలో అంతర్భాగమైన , మన గణతంత్ర సమాన పౌరులైన మైనార్టీలను బలిపశువులను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా హింసించడం చేస్తోందంటూ బీజేపీపై సోనియా చింతన్ శిబిర్ వేదికగా మండిపడ్డారు. చదవండి: ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం? -
Congress Chintan Shivir: ప్రారంభమైన కాంగ్రెస్ చింతన్ శిబిర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. కాంగ్రెస్‌లో భారీ మార్పులను తేనున్నట్లు ఆశిస్తున్న ఈ శిబిర్.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతోంది. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15వ తేదీన రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ శిబిర్‌లో మిషన్ 2024 కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్ సిధ్దం చేయనున్నారు. అంతేకాదు యాభై ఏళ్లలోబడిన వాళ్లకు సీడబ్ల్యూసీ సహా అన్నింటా ప్రాధాన్యంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చే అంశంపైనా ప్రధానంగా చర్చ జరగనుంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ కీలక సంస్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో రెండో వ్యక్తికి టికెట్ రావాలంటే ఐదేళ్లకు పైగా పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని రూల్. అంతేకాదు పార్టీ పదవిలో ఐదేళ్లకు మించి కొనసాగరాదని నిబంధనపై సంకేతాలు ఇచ్చారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అజయ్ మాకెన్. నిబంధనల నుంచి గాంధీ కుటుంబానికి వెసులు బాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.