స్విచ్ ఆన్‌చేసి నీటిని విడుదల చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా, ఎమ్మెల్యే తదితరులు
కరీంనగర్: రాష్ట్రం ప్రస్తుతం రూ.7లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పులను సాకుగా చూపి హామీలను విస్మరించమని, ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దిగువ మానేరు జలా శయం నుంచి ఆయకట్టుకు ఆదివారం సాయంత్రం కాకతీయకాలువ ద్వారా నీటిని కలెక్టర్ పమేలా సత్పతి, ఈఎన్సీ శంకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి విడుదల చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. యాసంగి పంటలకు ఎల్‌ఎండీ నుంచి సూర్యాపేట వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఎల్‌ఎండీ, మిడ్ మానేరులో తాగునీటి కోసం 15టీఎంసీలు నిల్వ చేసి మిగతా 29 టీఎంసీలు ఆయకట్టుకు విడుదల చేస్తామని వెల్లడించారు. రైతులు నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో అభయహస్తం దరఖాస్తులపై సమీక్ష చేశారు. అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తామన్నారు.
ప్రజలు గత నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని మార్చి తాము చెబితే వినాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని మంత్రి అన్నారు. తప్పకుండా ప్రజల సూచనలు, సలహాలు, ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు ఆరుకోట్ల ఉచిత బస్సు టిక్కెట్లు మహిళలు వినియోగించుకున్నారని తెలిపా రు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్‌ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, తహసీల్దార్ కనుకయ్య, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, ఎస్‌ఎల్‌గౌడ్, శ్రీగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిగురుమామిడిలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్‌కుమార్ కూతురు సిరివైష్ణవ్య చేత కేక్‌కట్ చేయించారు.
బొకేలు వద్దు.. నోట్‌బుక్స్‌తో రండి!
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు తనవద్దకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలతో కాకుండా నోట్‌బుక్స్, పుస్తకాలు తీసుకురావాలని సూచించారు. అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, వాటిని విద్యార్థులకు, చిన్నారులకు చేరవేస్తానని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ఇళ్లపట్టాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అ ప్రక్రియ రద్దు చేశామని తెలిపారు. అర్హుల జాబితాను పారదర్శకంగా తయారు చేసి ఇస్తే, వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
బాధ్యతతో 2024కు స్వాగతం..
కాంగ్రెస్ పార్టీకి 2023 శుభ సంవత్సరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీసిన వైనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కోరుకొన్న ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు.
స్వేచ్చగా జీవించే విధంగా, తమ సమస్యలు చెప్పుకొనే విధంగా, తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ దిశగా ప్రజలు రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చారని అన్నారు. 2024 సంవత్సరం తమకు బాధ్యతతో కూడిన సంవత్సరమని, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే సంవత్సరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment