బ్యాంకుల ఏకీకరణతోసమస్యలు: మూడీస్
♦ సొంతంగా ఆర్థిక బలం లేదు
♦ దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం
♦ ప్రభుత్వ సహకారంతోనే విలీనం సాధ్యం
న్యూఢిల్లీ: ప్రస్తుత బలహీన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను ఏకీకరణ ద్వారా కుదించాలన్న ప్రయత్నాలు పలు సమస్యలకు దారి తీయనున్నట్టు రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ఫలితంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. 2012 నుంచి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని... ఆస్తుల నాణ్యత పరంగా చూస్తే చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) బ్యాలన్స్ షీట్ల క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. దీంతో సొంత ఆర్థిక వనరుల పరంగా చూస్తే ఏ బ్యాంకుకీ విలీన ప్రక్రియ చేపట్టేంత ఆర్థిక సామర్థ్యం లేదని పేర్కొంది. ఈ మేరకు మూడీస్ ‘భారత్లో బ్యాంకులు: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణతో సవాళ్లు’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.
ప్రభుత్వ సహకారంతోనే..: ప్రస్తుతం ఉన్న 27 పీఎస్బీలను విలీనాల ద్వారా 8 నుంచి 10కి కుదించాలన్నది ప్రభుత్వ ధ్యేయంగా మూడీస్ తెలిపింది. ప్రభుత్వం నుంచి గణనీయ స్థాయిలో సహకారం లభించకుంటే ఏకీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందకుండా పోతాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ విశ్లేషకుడు అల్కా అన్బరసు పేర్కొన్నారు. ‘క్రెడిట్ పరంగా చూస్తే ఏకీకరణ ప్రక్రియ బ్యాంకుల కొనుగోలు శక్తిని పటిష్ట పరుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఈ రంగంలో పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలకు ఏకీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లు విఘాతంగా మారతాయని విశ్లేషించింది. ‘ఇప్పటికే మొండి బకాయిల కారణంగా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు బుక్ విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. దీంతో విలీనాలకు అవసరమైన అదనపు నిధుల సాయాన్ని పొందే అవకాశాలను పరిమితం చేస్తుంది’ అని మూడీస్ వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మూలధన నిధుల రూపంలో సహకారం అవసరం అవుతుందని అభిప్రాయపడింది.
ఉద్యోగుల వైపు నుంచి సమస్యలు
బ్యాంకుల ఉద్యోగుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుండడం కూడా ఏకీకరణకు ప్రధాన సవాలుగా పేర్కొంది. దీనివల్ల ఏకీకరణ ప్రయత్నాలకు విఘాతం కలిగుతుందని... ఒకవేళ విలీనం చేసినా వేతనాల మధ్య తేడాలను పూడ్చేందుకు, ఇతర ప్రయోజనాల రూపంలో ఖర్చులు పెరిగిపోతాయని తెలిపింది.