చీకటి అధ్యాయం
స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా అందరూ పరిగణించే ఎమర్జెన్సీ విధించి నేటితో నాలుగు దశాబ్దాలు పూర్తవుతుంది. 1975 జూన్ 25 అర్ధరాత్రి వేళ... అందరూ ఆదమరిచి నిదురిస్తున్నవేళ రాజ్యం హఠాత్తుగా విరుచుకుపడిన సందర్భమది. అప్పుడు దేశమే పెద్ద జైలయింది. 21 నెలలపాటు నిరంకుశత్వమే రాజ్యమేలింది. ప్రశ్నిస్తే సహించలేకపోయారు. ఇదేం అన్యాయమని నిలదీస్తే భరించలేకపోయారు. దేన్నీ వదల్లేదు. ఎవరినీ మినహాయించలేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ వేటాడి, వెంటాడారు. ఇప్పుడే మాట్లాడి పంపిస్తామని నమ్మబలికి ఎందరెందరినో ఆచూకీ దొరక్కుండా పొట్టనబెట్టుకున్నారు. తల్లికి బిడ్డనూ... భార్యకు భర్తనూ...పిల్లలకు తల్లిదండ్రుల్నీ కాకుండాచేశారు. లేకుండా చేశారు. ఆర్తనాదాలన్నీ అరణ్యరోదనలయ్యాయి.
ప్రతిపక్షాన్ని ఖైదు చేశారు. న్యాయవ్యవస్థను లొంగదీసుకున్నారు. పత్రికల కుత్తుకలపై ఆంక్షల బయొనెట్ పెట్టి కళ్లతో చూస్తున్నది కాదు...తాము చెప్పిందే రాయాలన్నారు. చెప్పిన మాట వినని పాత్రికేయులను చీకటి కొట్టాల్లోకి నెట్టారు. బహుశా హిట్లర్ కాలంనాటి జర్మనీ అలాంటి దుర్మార్గాన్నీ, దౌష్ట్యాన్నీ చవిచూసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకునే భారత్‌కు అలాంటి దురవస్థ వస్తుందని మన జాతీయోద్యమ నాయకులుగానీ, రాజ్యాంగ నిర్మాతలుగానీ కలలో కూడా అనుకుని ఉండరు. అన్ని విలువలకూ మంగళం పాడి... అధికారాన్ని అంటి పెట్టుకుని ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే దుర్మార్గమైన పాలకులు సమీప భవిష్యత్తులోనే దాపురిస్తారని అంచనావేసి ఉండరు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీయే అలాంటి పనికి పూనుకుంటారని అసలే అనుకుని ఉండరు.
అవినీతి పద్ధతులు అవలంబించినందువల్ల లోక్‌సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరేళ్లపాటు పోటీకి అనర్హురాలని అల్హాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇందిర అభద్రతాభావానికి లోనయ్యారు. ఒకపక్క లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజాందోళన రోజురోజుకూ విస్తరించడం...హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వె ళ్తే అక్కడ సైతం బేషరతు స్టే లభించకపోవడంతో గద్దెను అంటిపెట్టుకుని ఉండటానికి ఎమర్జెన్సీ విధింపే పరిష్కారంగా ఆమె భావించారు. లాంఛనప్రాయమైన కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తీసుకోకుండా... ఆంతరంగిక కల్లోల పరిస్థితులవల్ల దేశ భద్రతకు ముప్పుకలిగిందన్న తప్పుడు కారణాలు చూపి ఆనాటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో ఎమర్జెన్సీ విధింపు ఉత్తర్వులపై సంతకం చేయించారు. ఆ క్షణం నుంచి దేశవ్యాప్తంగా సాగించిన తమ అకృత్యాలు వెల్లడికాకుండా ఉండటం కోసం పత్రికలపై ఆంక్షలు విధించారు. అందుకోసం ఒక ప్రత్యేక చట్టమే తెచ్చారు. న్యాయవ్యవస్థను సైతం అదుపులోనికి తెచ్చుకున్నారు. ‘అంకితభావంతో కూడిన న్యాయవ్యవస్థ’ పేరిట అంతకు చాన్నాళ్లముందే మొదలెట్టిన ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయడం మొదలెట్టారు. ఎమర్జెన్సీలో పౌర హక్కులు సస్పెండైనాయి గనుక పౌరుల ప్రాణానికీ, స్వేచ్ఛకూ పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు పౌరులు కోల్పోయినట్టేనని వెన్నెముక లేని ‘న్యాయం’ నిస్సిగ్గుగా ప్రకటించింది. బెంచ్‌లోని ఒకే ఒక న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా...‘అయితే రాజ్యానికి పౌరుల ప్రాణాలు తీసే హక్కు కూడా ఉందంటారా’ అని విచారణ సందర్భంగా ప్రశ్నిస్తే ‘అవును...చట్టవిరుద్ధంగా ప్రాణాలు తీసినా కోర్టులేమీ చేయలేవు’ అని ఆనాటి అటార్నీ జనరల్ నిరేన్ డే తలపొగరుతో జవాబిచ్చాడు.
నలభైయ్యేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూస్తే ఆశానిరాశలు రెండూ కలుగుతాయి. అనేక కులాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలున్నా ప్రజలంతా ఒక్కటై లాకప్ హింసకూ, చీకటి నిర్బంధానికీ, తుపాకులకూ వెరవకుండా పోరాడిన సందర్భాలు ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో కనిపిస్తాయి. రచయితలు, కవులు, కళాకారులు తమకు తోచిన పద్ధతుల్లో నిరంకుశత్వాన్ని ఎదిరించారు. ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధాన్ని ఎదుర్కొనని పార్టీగానీ, సంస్థగానీ లేదు. సిద్ధాంతపరంగా ఉత్తర, దక్షిణాలుగా ఉండే జాతీయవాదులు, సీపీఎం నేతలు, విప్లవకారులు... అందరూ జైళ్లకెళ్లారు. ఆ సమయంలో లక్షన్నరమందిపైగా జైలుపాలయ్యారని ఒక అంచనా. సోషలిస్టు సిద్ధాంతాలను ఆచరించే కన్నడ సినీ నటి స్నేహలతారెడ్డి నిర్బంధంలో తీవ్ర అనారోగ్యంపాలై కన్నుమూశారు. అయితే, అలా పోరాడినవారిలో చాలామంది అనంతరకాలంలో పాలకులుగా మారాక తామూ అవే పోకడలనే ప్రదర్శించారు.
ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. అప్పుడు నియంత, ఆమె మద్దతుదార్లు ఒకపక్కనుంటే...మిగిలినవారంతా వేరొక వైపున్నారు. ఇప్పుడు అన్నిచోట్లా అలాంటివారు విస్తరించారు. సిద్ధాంతాలు, విలువల ప్రమేయం లేకుండా...అధికారమే పరమావధిగా ఏ పార్టీలోకైనా ఎవరైనా వెళ్తున్నారు. ప్రజాస్వామ్యానికి శత్రువు అనేక రూపాల్లో... ఏకకాలంలో అనేకచోట్ల ఉంటున్న వైనం ఇప్పుడు కనబడుతోంది. మీడియాను అదుపులో పెట్టుకునేందుకు పాలకులు సృజనాత్మక విధానాలు అవలంబిస్తున్నారు. సామాజిక మాధ్యమాల గొంతు నులిమే ఐటీ చట్టంలోని సెక్షన్ 66-ఏ చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే దాన్ని మరో రూపంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎవరినైనా, ఎంతకాలమైనా నిర్బంధించేందుకు వీలుకలిగించే నల్లచట్టాలు రూపొందాయి. ఏదేమైనా దేశ చరిత్రలో జాతీయోద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన సందర్భం ఎమర్జెన్సీలోనే కనబడుతుంది. అది ఏ తరానికైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం చెక్కుచెదరదన్న భరోసానిస్తుంది.