Construction of Dam
-
‘కాళేశ్వరా’నికి హాలిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కమిటీలో కీలక విభాగాల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (గేట్స్)/ఎన్డీఎస్ఎఏ డైరెక్టర్ (విపత్తులు) రాహుల్ కుమార్‌సింగ్‌లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్ పైల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్ఏ జారీ చేసిన విధివిధానాలు.. ► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. ► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి. ► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. ► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) ► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి. -
నిర్లక్ష్యం వీడరా..!
* తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై పాలకుల అశ్రద్ధ * పూడికతీత సాధ్యమేనంటున్న నిఫుణులు * డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా మట్టి తొలగించే అవకాశం * ఆ దిశగా శ్రద్ధ చూపని ఇరు రాష్ట్రాల పాలకులు సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయంలో రోజురోజుకూ పూడిక పెరిగిపోతోంది. డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు నీటిమట్టం 132 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు దామాషా ప్రకారం ఉన్న నీటి కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఇరు రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డ్యాం నిర్మాణాలు చేపట్టి 60 సంవత్సరాలు కావడంతో మిగిలిన డ్యాంల కంటే తుంగభద్రలో ఎక్కువ పూడిక చేరింది. డ్యాంలో పూడిక చేరిక వల్ల ఏటా అర టీఎంసీ నీటిని నిల్వ చేసే కెపాసిటీని జలాశయం కోల్పోతోంది. దీంతో పూడికతీత అంశం రెండు, మూడు సంవత్సరాలుగా తెరపైకి వచ్చింది. పూడికతీత సాధ్యమని కొందని... కాదని మరికొందరు వాదిస్తున్నారు. పూడిక ద్వారా నష్టపోతున్న 32 టీఎంసీలు నీటిని మరో రకంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ డ్యాం ద్వారా కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల రైతులు లబ్ధిపొందుతున్నారు. ఇలా ఇన్ని జిల్లాల రైతులకు జీవనోపాధి అయినా టీబీ డ్యాంను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆయా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారు. తుంగభద్ర పూడిక తీత సాధ్యం కాదని పైపైకి అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. లోతుగా అధ్యయనం చేస్తే పూడికతీత సాధ్యమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. డ్రెజ్జింగ్ పద్ధతి అంటే.. 1976వ సంవత్సరంలో డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ద్వారా భారత ప్రభుత్వం నదులు, డ్యాంలు, పెద్ద పెద్ద చెరువుల్లో పూడిపోయిన మట్టిని తొలగించేందుకు డ్రెజ్జింగ్ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా పూడిక తొలగిస్తున్నారు. డ్రెజ్జింగ్ పద్ధతి అంటే పెరుగును చిలికినట్లుగా భూమిలోని మట్టిని అత్యాధునిక యంత్రాలను డ్యాంలోకి వదిలి నీరు ఉన్నప్పుడు చిలికితే ఆ నీరు బయటకు వెళ్లినప్పుడు పూడిక తొలుగుతుంది. డ్యాం నుంచి నీరు ఓవర్ ఫ్లో అవుతున్నప్పుడు గేట్లు ఎత్తి నది ద్వారా నీరు వదిలినప్పుడు డ్రెజ్జింగ్ పనులు చేపడితే ఏటా కనీసం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేవిధంగా పూడిక తొలగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు నిలిచిపోయినప్పుడు నదిలో ఉన్న తుంగభద్ర మట్టిని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు ఉపయోగించుకునేందుకు వీలు అవుతుంది. సారవంతమైన మట్టిని రైతులకు ఉపయోగపడటంతో పాటు తుంగభద్ర డ్యాంలో పూడికతీత సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఒక టీసీఎం నీరు నిల్వ ఉండే మట్టిని పూడిక తీయాలంటే వేల కోట్లు ఖర్చు అవుతుంది. తుంగభద్రలో నీరు పూర్తిగా లేనప్పుడు మట్టిని తీసి పొలాల్లోకి వేయడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. అయితే డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా డ్యాం గేట్లు ఎత్తినప్పుడు పూడికతీత సాధ్యమని భావిస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో ఏటా కనీసం రెండు నెలలు పాటు డ్యాం నుంచి గేట్లు ఎత్తి నీరు వదులుతుంటారు. ఈ నేపథ్యంలో డ్యాం గేట్లు ఎత్తినప్పుడు ప్రతిసారి డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా పూడిక తొలగిస్తే మరింత పూడిక చేరే ప్రమాదాన్ని అరికట్టడంతో పాటు పూడికను తొలగించే అవకాశం ఉంది. అయితే ఆ వైపుగా పాలకులు, అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు.. తుంగభద్రలో పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడు ఇటీవల చర్చలు జరిపిన విషయం తెలిసిం దే. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ఆధునీకరణపై ప్రధానంగా చర్చించారు. లోతుగా అధ్యయనం చేయకుండా తుతూమంత్రంగా చర్చలు జరపడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొడి.. టీబీ డ్యాంలో 50 సంవత్సరాల్లో 32 టీఎంసీలు పూడిక చేరింది. పాలకులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తుంగభద్ర డ్యాం ద్వారా సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడా లభించబోదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రులు తుంగభద్ర డ్యాంలోని పూడికను తొలగించేందుకు అవకాశంపై సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా సర్వే చేపట్టిన డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా పూడిక తొలగించేందుకు కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నేడు డెల్టా బంద్
సాక్షి, చెన్నై: కావేరి నదిలో డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ శనివారం డెల్టా బంద్‌కు అన్నదాతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. బంద్ విజయవంతం లక్ష్యంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఐదు వందల చోట్ల నిరసనలకు ఏర్పాట్లు చేశారు. పదిహేను రైల్వే స్టేషన్ల ముట్టడికి సిద్ధమయ్యారు. మెట్టూరు డ్యాంకు కావేరి జలాల్ని రానివ్వకుండా చేయడం లక్ష్యంగా కర్ణాటక కుట్రలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వివాదం చేస్తూ వచ్చిన కర్ణాటక పాలకు లు తాజాగా, చుక్కు నీరు తమిళనాడులోకి రాకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. 48 టీఎంసీల సామర్థ్యంతో రెండు డ్యాంలను తమిళనాడుకు సమీపంలోని కర్ణాటక భూ భాగంలో నిర్మిం చేందుకు సన్నద్ధమయ్యూరు. ఈ డ్యాం నిర్మాణం జరిగిన పక్షంలో డెల్టా జిల్లా లు కరువుతో తల్లడిల్లాల్సిందే. ఈ పను ల్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రానికి లేఖాస్త్రంతో సరిపెట్టింది. అయి తే అన్నదాతల్లో ఆగ్రహ జ్వాల బయలుదేరింది. కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కును పరిరక్షించుకోవడం లక్ష్యంగా పోరు బాటకు సిద్ధమైంది. నేడు బంద్: కర్ణాటక ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని, కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ శనివారం నుంచి అన్నదాతలు పోరు బాట చేపట్టనున్నారు. ఇందులోభాగంగా తొలి విడత నిరసనగా డెల్టా బంద్‌కు పిలుపు నిచ్చారు. తిరువారూర్, తంజావూరు , నాగపట్నం జిల్లాల్లో భారీ నిరసనలకు నిర్ణయించారు. ఇందుకు మద్దతు వెల్లువెత్తుతోంది. డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, ఎంఎంకేలతో పాటు చిన్నాచితకా పార్టీలు, త్వరలో పార్టీ పెట్టనున్న జికే.వాసన్ మద్దతు ప్రకటించారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు తాము సైతం అని మద్దతు ప్రకటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నిరసనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల్లో భారీ బలగాల్ని రంగంలోకి దించారు. ఐదు వందల చోట్ల నిరసనలు: బంద్ విజయవంతం లక్ష్యంగా అన్ని పార్టీలు, సంఘాలు ఉరకలు తీస్తున్నాయి. దీంతో ఆ మూడు జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప, వాణిజ్య సమూదాయాలు, అన్ని రకాలు దుకాణాలు మూత బడనున్నాయి. అలాగే, ప్రైవేటు బస్సులు, లారీలు, ఇతర వాహన యాజమాన్యాలు సైతం బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. తమ భవిష్యత్తు లక్ష్యం గా శనివారం ఎలాంటి సేవలు ఉండబోవని, అన్ని బంద్ అని ప్రజాసంఘాలు ప్రకటించాయి. ఈ విషయంగా ఈ బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘం నాయకుడు పీఆర్ పాండి మనోజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తమ బంద్‌కు మద్దతు వెల్లువెత్తుతోందన్నారు. ఉదయం ఆరు గంట ల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ప్రాంతాలు నిర్మానుష్యం కానున్నాయని, ప్రజాపయోగ సేవలు బంద్ కాబోతున్నాయని వివరించారు. ఐదు వందల ప్రదేశాల్లో రాస్తారోకోలకు నిర్ణయించామని తెలిపారు. తంజావూరు, పాపనాశం, మైలాడుతురై,నాగపట్నం, మన్నార్‌కుడి, నీడా మంగళం తదితర పదిహేను రైల్వే స్టేషన్లను మట్టుడించనున్నామని రైళ్ల సేవల్ని అడ్డుకోనున్నామని ప్రకటించారు. తంజావూరులో జరిగే రైల్‌రోకోకు ఎండీఎంకే నేత వైగో, మైలాడుతురైలో వాణిజ్య సంఘం నేత వెల్లయ్యన్ నేతృత్వం వహించనున్నారని తెలిపారు.