‘కాళేశ్వరా’నికి హాలిడే! | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరా’నికి హాలిడే!

Published Mon, Mar 4 2024 3:30 AM

holiday for kaleshwaram project: telangana - Sakshi

4 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై అధ్యయనం

సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన ఎన్డీఎస్‌ఏ 

సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని కమిటీకి మార్గదర్శకాలు.. 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు.. ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు 

అప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లే.. 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ అమిత్‌ మిత్తల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎన్డీఎస్‌ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. 

కమిటీలో కీలక విభాగాల నిపుణులు 
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త ఆర్‌.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ (గేట్స్‌)/ఎన్డీఎస్‌ఎఏ డైరెక్టర్‌ (విపత్తులు) రాహుల్‌ కుమార్‌సింగ్‌లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్‌ (టెక్నికల్‌) అమితాబ్‌ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. 

ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... 
గతేడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్‌ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్‌ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్‌ పైల్స్‌కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది.

మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్‌ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్‌ఏకు లేఖ రాసింది. డ్యామ్‌ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్‌లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్‌ఏ నిర్ణయం తీసుకుంది.  

బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్‌ఏ జారీ చేసిన విధివిధానాలు.. 
► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్‌ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. 
► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి.  

► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. 
► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) 
► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి.

Advertisement
Advertisement