సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది.
ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు..
► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు.
► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.
► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది.
► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు.
► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి.
► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి.
► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు.
► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు.
► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది.
► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది.
► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది.
► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది.
► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది.
► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది.
► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం.
► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది.
► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది.
► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు.
► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది.
► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది.
► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment