నిర్లక్ష్యం వీడరా..! | Tungabhadra dam in spate, Hampi sinking | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వీడరా..!

Published Mon, Nov 24 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

నిర్లక్ష్యం వీడరా..!

నిర్లక్ష్యం వీడరా..!

* తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై పాలకుల అశ్రద్ధ
* పూడికతీత సాధ్యమేనంటున్న నిఫుణులు
* డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా మట్టి తొలగించే అవకాశం
* ఆ దిశగా శ్రద్ధ చూపని ఇరు రాష్ట్రాల పాలకులు

సాక్షి, బళ్లారి : తుంగభద్ర జలాశయంలో రోజురోజుకూ పూడిక పెరిగిపోతోంది. డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు నీటిమట్టం 132 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 100 టీఎంసీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు దామాషా ప్రకారం ఉన్న నీటి కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఇరు రాష్ట్రాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డ్యాం నిర్మాణాలు చేపట్టి 60 సంవత్సరాలు కావడంతో మిగిలిన డ్యాంల కంటే తుంగభద్రలో ఎక్కువ పూడిక చేరింది. డ్యాంలో పూడిక చేరిక వల్ల ఏటా అర టీఎంసీ నీటిని నిల్వ చేసే కెపాసిటీని జలాశయం కోల్పోతోంది.

దీంతో పూడికతీత అంశం రెండు, మూడు సంవత్సరాలుగా తెరపైకి వచ్చింది. పూడికతీత సాధ్యమని కొందని... కాదని మరికొందరు వాదిస్తున్నారు. పూడిక ద్వారా నష్టపోతున్న 32 టీఎంసీలు నీటిని మరో రకంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ డ్యాం ద్వారా కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లా, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల రైతులు లబ్ధిపొందుతున్నారు.

ఇలా ఇన్ని జిల్లాల రైతులకు జీవనోపాధి అయినా టీబీ డ్యాంను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆయా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారు. తుంగభద్ర పూడిక తీత సాధ్యం కాదని పైపైకి అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. లోతుగా అధ్యయనం చేస్తే పూడికతీత సాధ్యమని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
 
డ్రెజ్జింగ్ పద్ధతి అంటే..
1976వ సంవత్సరంలో డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ద్వారా భారత ప్రభుత్వం నదులు, డ్యాంలు, పెద్ద పెద్ద చెరువుల్లో పూడిపోయిన మట్టిని తొలగించేందుకు డ్రెజ్జింగ్ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా పూడిక తొలగిస్తున్నారు. డ్రెజ్జింగ్ పద్ధతి అంటే పెరుగును చిలికినట్లుగా భూమిలోని మట్టిని అత్యాధునిక యంత్రాలను డ్యాంలోకి వదిలి నీరు ఉన్నప్పుడు చిలికితే ఆ నీరు బయటకు వెళ్లినప్పుడు పూడిక  తొలుగుతుంది. డ్యాం నుంచి నీరు ఓవర్ ఫ్లో అవుతున్నప్పుడు గేట్లు ఎత్తి నది ద్వారా నీరు వదిలినప్పుడు డ్రెజ్జింగ్ పనులు చేపడితే  ఏటా కనీసం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేవిధంగా పూడిక తొలగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నీరు నిలిచిపోయినప్పుడు నదిలో ఉన్న తుంగభద్ర మట్టిని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు ఉపయోగించుకునేందుకు వీలు అవుతుంది. సారవంతమైన మట్టిని రైతులకు ఉపయోగపడటంతో పాటు తుంగభద్ర డ్యాంలో పూడికతీత సమస్య కూడా పరిష్కారం అవుతుంది.  ఒక టీసీఎం నీరు నిల్వ ఉండే మట్టిని పూడిక తీయాలంటే వేల కోట్లు ఖర్చు అవుతుంది. తుంగభద్రలో నీరు పూర్తిగా లేనప్పుడు మట్టిని తీసి పొలాల్లోకి వేయడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. అయితే డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా డ్యాం  గేట్లు ఎత్తినప్పుడు పూడికతీత సాధ్యమని భావిస్తున్నారు.
 
తుంగభద్ర డ్యాంలో ఏటా కనీసం రెండు నెలలు పాటు డ్యాం నుంచి గేట్లు ఎత్తి నీరు వదులుతుంటారు. ఈ నేపథ్యంలో డ్యాం గేట్లు ఎత్తినప్పుడు ప్రతిసారి డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా పూడిక తొలగిస్తే మరింత పూడిక చేరే ప్రమాదాన్ని అరికట్టడంతో పాటు పూడికను తొలగించే అవకాశం ఉంది. అయితే ఆ వైపుగా పాలకులు, అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
 
ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు..
తుంగభద్రలో పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడు ఇటీవల చర్చలు జరిపిన విషయం తెలిసిం దే. హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల ఆధునీకరణపై ప్రధానంగా చర్చించారు. లోతుగా అధ్యయనం చేయకుండా తుతూమంత్రంగా చర్చలు జరపడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇప్పటికైనా మేల్కొడి..
టీబీ డ్యాంలో  50 సంవత్సరాల్లో 32 టీఎంసీలు పూడిక చేరింది. పాలకులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే తుంగభద్ర డ్యాం ద్వారా సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడా లభించబోదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రులు తుంగభద్ర డ్యాంలోని పూడికను తొలగించేందుకు అవకాశంపై సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా సర్వే చేపట్టిన డ్రెజ్జింగ్ పద్ధతి ద్వారా పూడిక తొలగించేందుకు కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement