Conversions
-
కాక రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’
కొచ్చిన్/బళ్లారి/న్యూఢిల్లీ: బహుభాషా చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బలవంత మతమార్పిడికి గురై, ఐసిస్‌లో చేరిన కొందరు మహిళలే ఈ సినిమా ఇతివృత్తం. వారం క్రితం సినిమా ట్రయిలర్ రిలీజ్ నాటి నుంచే వివాదం రేగుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వం, విపుల్ షా నిర్మాతగా ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. కర్ణాటకలోని బళ్లారి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడం విశేషం. స్టేకు కేరళ హైకోర్టు నో ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. సినిమా ట్రయిలర్ ఒక వర్గానికి వ్యతిరేకంగా లేదని పేర్కొంది. ‘ది కేరళ స్టోరీ’లో కొన్ని అంశాలను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, కేరళ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉన్నందున విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘సన్యాసులు, క్రిస్టియన్ పూజారులు, ఇతరులను కూడా చెడ్డవారిగా చూపించిన ఘటనలు సినిమాల్లో అనేకం ఉన్నాయి. కొందరు మతబోధకులను చెడుగా చూపారనే కారణంతో సినిమాను నిషేధించలేం’అని పేర్కొంది. -
మతమార్పిళ్లకు రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: ‘‘మతమార్పిళ్లు చాలా సీరియస్ విషయం. దీనికి రాజకీయ రంగు పులమొద్దు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టేలా కేంద్ర రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎం షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ చేసిన వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ఇలా వాదించేందుకు మీకు వేరే కారణాలుండొచ్చు. అంతమాత్రాన కోర్టు విచారణను మరోలా మార్చుకునేందుకు ప్రయత్నించకండి. మీ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. దీన్ని రాజకీయం చేయకండి’’ అంటూ హితవు పలికింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోరింది. -
మత మార్పిడుల పర్యవసానం....?
సాక్షి, న్యూఢిల్లీ : చట్ట విరుద్ధమైన మత మార్పిడులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 24వ తేదీన తీసుకొచ్చిన కొత్త చట్టం పర్యవసానాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గత జూలై నెలలోనే పెళ్లి చేసుకున్న రషీద్ అలీ, పింకి డిసెంబర్ ఐదవ తేదీన తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకునేందుకు రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు వారిపై బజ్రంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా రషీద్ అలీని అరెస్ట్ చేసి జైలుకు పంపించి, పింకీ షెల్టర్ హోమ్‌కు పంపించారు. దాడిలో గాయపడిన కారణంగా షెల్టర్ హోమ్‌లో పింకీకి గర్భస్రావం అయింది. ‘నేను మేజర్‌ను నాకు 22 ఏళ్లు. నేను ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. గత జూలై 24వ తేదీన మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లై అయిదో నెల నడుస్తోంది. దయచేసి మమ్మల్ని వదిలి పెట్టండి’ అంటూ పింకీ ప్రాధేయ పడినా బజరంగ్ దళ్ కార్యకర్తలుగానీ, పోలీసులు వినిపించుకోలేదంటూ సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె దాడి వీడియోను సర్కులేట్ చేశారు. దేశంలో ఎప్పటి నుంచో దళితులు, వెనకబడిన వర్గాల మత మార్పిడులు కొనసాగుతున్నాయి. సమాజంలో దళితులను చిన్న చూపు చూస్తున్నందుకు నిరసనగా సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 1956లో ఓ దళిత బృందంతో కలసి బౌద్ధం మతంలోకి మారారు. తమిళనాడులో మారవ సామాజిక వర్గానికి చెందిన భూస్వాముల అణచివేతకు నిరసనగా 1981లో ఆ రాష్ట్రంలోని మీనాక్షిపురంలో వెయ్యి మంది దళితులు ఇస్లాం మతం పుచ్చుకున్నారు. 2002లో హర్యానాలోని జాజ్జర్లో చనిపోయిన ఆవును దాచారన్న కారణంగా ఐదుగురు దళితులపై జరిగిన దాడికి నిరసనగా వందలాది దళితులు బౌద్ధ మతంలోకి మారారు. గత అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో వాల్మీకి కులానికి చెందిన దళిత యువతిని అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు రేప్ చేసి, హత్య చేసినందుకు వాల్మీకి కులానికి చెందిన 200 మంది దళితులు బౌద్ధంలోకి మారారు. యూపీ తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇలాంటి మత మార్పిడులన్నీ చట్ట విరుద్ధం అవుతాయని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైతే చట్ట ప్రకారం గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని, అదే మతం మారితే పదేళ్లు జైలు శిక్ష వేయడం ఏమేరకు సముచితమని వారు ప్రశ్నిస్తున్నారు. Moradabad love jihad case: Woman says that she has suffered miscarriage. She wants her husband and brother-in-law to be released by @Uppolice @Benarasiyaa pic.twitter.com/xJ80d3kIrU — Kanwardeep singh (@KanwardeepsTOI) December 15, 2020 -
హాదియాకు బెదిరింపులు: మహిళా కమిషన్
కొచ్చి: కేరళలో బాలికల బలవంతపు మతమార్పిడులు ఆందోళనకరంగా మారిందని జాతీయ మహిళాకమిషన్ ఇంచార్జ్ చైర్మన్ రేఖా శర్మ ఆరోపించారు. కేరళలో హాదియా (24) అనే యువతి ‘లవ్ జిహాద్’లో చిక్కుకున్నాననడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ చైర్మన్ కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో బాధితురాలిని పరామర్శించారు. ‘హాదియా ఆరోగ్యం బాగుంది. ఇక్కడెవరూ ఆమెను కొట్టడం లేదు. సుప్రీంకోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉంది. కొందరు ఆమెను బెదిరిస్తున్నారు. కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది’ అని రేఖా శర్మ వెల్లడించారు. -
పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య
మథుర: దేశంలో పేదరికం వల్లే మతమార్పిడులు జరుగుతున్నాయని పూరి శంకరాచార్య స్వామి నిశ్ఛలానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. బృందావన్‌లోని ఆయన ఆశ్రమం చైతన్య విహార్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మతమార్పిళ్లను అరికట్టాలంటే పేదరికం, నిరక్షరాస్యతల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పేదరికం, అజ్ఞానం వల్లే హిందువులు మతం మారుతున్నారని ఆయన చెప్పారు. జీవితంలో అనేక బాధలు పడినవారు, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే మతం మారుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరగవలసిన అవసరం కూడా ఉందని శంకరాచార్య పేర్కొన్నారు. -
'మోదీ ఎందుకు సిగ్గుపడుతున్నారు?'
న్యూఢిల్లీ : మత మార్పిడిల అంశంపై రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రకటన చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలోకి రావాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభలో ప్రకటన చేసేందుకు ప్రధాని ఎందుకు సిగ్గుపడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మరో సభ్యుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. ఉభయసభల్లో లోక్‌సభ సవ్యంగా సాగుతోందని, రాజ్యసభలో గందరగోళానికి సభ్యుల అహంకారమే కారణమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సభ సద్దుమణగకపోవడంతో డిప్యూటీ చైర్మెన్ సభను వాయిదా వేశారు.