cooperatives societies
-
సహకార స్వర్ణయుగం రానుందా?!
ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ సమష్టి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామికంగా తామే నిర్వహించుకునే వ్యాపార, సేవా సంస్థలే సహకార సంఘాలు. వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా చేసే వ్యాపారానికి భిన్నమైనది సహకార వ్యవస్థ. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థల కేంద్రీకృత ఆధిపత్య లాభార్జన ధోరణికి భిన్నంగా సమష్టి ప్రయోజనాల కోసం నానాటికీ విస్తరిస్తున్న ఈ వికేంద్రీకృత వ్యవస్థకు స్వయంపాలన, స్వావలంబనలే మూలస్తంభాలు. కరోనా మహమ్మారి నేర్పిన కొన్ని గుణపాఠాల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార వ్యవస్థను మరింత విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది.(ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న 70వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా..) ఐక్యరాజ్యసమితి కూడా సహకార సంఘాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవలే తీర్మానం చేసింది. పుష్కర కాలం ముందు 2012లో కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుకోవటం విశేషం. స్కాట్లండ్‌లోని ఫెన్విక్లో కీ.శ. 1761 మార్చి 14న ఏర్పాటైన ఫెన్విక్ చేనేత కార్మికుల సహకార సంఘమే తొట్టతొలి కోఆపరేటివ్ సొసైటీ. ప్రపంచంలో కనీసం 12% మంది ప్రజలు సహకారులే. సుమారు 30 లక్షల సహకార సంఘాలు ప్రపంచ దేశాల్లో లాభం కోసం కాకుండా విలువల కోసం పనిచేస్తున్నాయి. భారతీయ సహకారోద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థ. దేశం వలస పాలనలో మగ్గిపోతున్న కాలంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసిన సర్ ఫ్రెడరిక్ నికల్సన్ మన దేశంలో సహకార వ్యవస్థకు బీజం వేశారు. మొట్టమొదటి సహకార సంఘం 1904లో ప్రస్తుతం తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుర్ అనే గ్రామంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలోని 8,54,355 సహకార సంఘాల్లో సుమారు 30 కోట్ల మంది సభ్యులున్నారు. మరో 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి చురుగ్గా చర్యలు చేపట్టింది. మన దేశంలో వ్యవసాయ రుణాలిచ్చే సొసైటీల సంఖ్యే ఎక్కువ. కింది స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలతో మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లో ఉంది. జిల్లా, రాష్ట్రస్థాయి సొసైటీల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు, సేవలు అందించే సొసైటీల(మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు) రిజిస్ట్రేషన్ కేంద్ర సహకార రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు కావటంతో ఈ రంగంలో సరికొత్త కదలిక చోటుచేసుకుంది. జాతీయ సహకార విధానం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్వం నుంచి ఉన్న వ్యవసాయం, హౌసింగ్, ఉద్యోగుల సహకార సంఘాలు వంటి సంప్రదాయ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యంగా యువతను భాగస్వాముల్ని చేసే విధంగా అనేక సేవా రంగాల్లో సొసైటీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంపొందించగల శక్తి సహకార రంగానికి ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ లక్ష్యాలతో మూడు వేర్వేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్రం ఇటీవలే నెలకొల్పింది. మొదటిది మన ఉత్పత్తులను విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతులను చేపట్టే లక్ష్యంతో ఏర్పాటైంది. సొసైటీల ద్వారా సర్టిఫైడ్/దేశీ విత్తనోత్పత్తి చేయటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయటమే లక్ష్యంగా రెండో సొసైటీ ఏర్పాటైంది. ఇక మూడోది మరింత ముఖ్యమైనది. వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేసే రైతుల సొసైటీలు, ఎఫ్పిఓల నుంచి సేకరించి భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్ ద్వారా, అవుట్లెట్ల ద్వారా దేశ విదేశాల్లో విక్రయించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. భారీ వాణిజ్య లక్ష్యాలతో పనిచేసే ఈ సొసైటీలకు వచ్చే లాభాల్లో సగాన్ని నేరుగా రైతులు, ఇతర ఉత్పత్తిదారులకు అందించబోతున్నారు. అనుకున్నట్లు యువతను సహకార వ్యాపార, సేవా రంగాల వైపు సమర్థవంతంగా ఆకర్షించగలిగితే భారతీయ సహకార రంగానికి స్వర్ణయుగం తధ్యమని చెప్పొచ్చు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!) -
సహకార సంఘాలు బలోపేతం కావాలి
ఒంగోలు : సహకార సంఘాలు బలోపేతం కావాలని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పీడీసీసీ బ్యాంకు సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 67 ప్రాథమిక సహకార సంఘాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుకు రూ. 6 లక్షల ప్రోత్సాహకాన్ని ఆయన ఈ సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సహకార సంఘాల పరిస్థితిపై సర్వే జరుగుతుందన్నారు. సంఘాలు కేవలం రుణాలపైనే ఆ«ధారపడకుండా ధాన్యం, కందుల కొనుగోలు, ఇతరత్రా వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి సహకార సంఘం కేవలం మూడు నెలలపాటు కష్టపడి ధాన్యం కొనుగోలు ద్వారా కోటిరూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, ప్రకాశం జిల్లాలో రావినూతల సొసైటీ చేపడుతున్న వ్యాపారాలను పరిశీలించేందుకు జిల్లాలోని పలు సంఘాలు కూడా సందర్శిస్తున్నాయన్నారు. లేని పక్షంలో మండలానికో సొసైటీ కాదు.. చివరకు నియోజకవర్గానికి ఒక సహకార కేంద్రం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జిల్లా సహకారశాఖ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ కేరళలో ఒక్కో సొసైటీ సీఈవో రూ. 70 వేలకుపైగా జీతం తీసుకుంటున్నారంటే అందుకు కారణం వారు చేపట్టిన వ్యాపారా«భివృద్ధే అన్నారు. కనుక జిల్లాలోని సహకార సంఘాల సీఈఓలు కూడా వారి పరిధిలోని ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తూ వ్యాపారాన్ని పెంచుకోవాలని, తద్వారా వారు కూడా ఆకాశమే హద్దుగా జీతాలు తీసుకునే సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. డీఆర్ ఓఎస్డీ శీతారామయ్య మాట్లాడుతూ జిల్లాలో 35 సంఘాలు బలహీనంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వాటిని బలోపేతం చేసేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పడిందన్నారు. కొన్ని సంఘాలు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల రూ. 4 కోట్లకుపైగా రుణాలు పేరుకుపోయాయని, వాటికి ఇక ప్రభుత్వం నుంచి రుణమాఫీ వర్తించే అవకాశమే లేదని న్యాయ పరమైన చర్యలతో వసూలుకు సిద్ధం కావాలని సూచించారు. ఓఎస్డీ రావెళ్ల మోహన్‌రావు మాట్లాడుతూ ఐసీడీపీ ద్వారా రూ. 17 కోట్ల ఆర్థిక సాయాన్ని పొంది సకాలంలో వినియోగించుకున్న 67 సంఘాలకు రూ. 6 లక్షల ఇన్సెంటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో కుంభా రాఘవయ్య, డీఆర్ ఇందిరాదేవి, ఐసీడీపీ సీపీవో సుబ్బారావులు పాల్గొని పలు సూచనలు చేశారు. -
సహకార సంఘాలు బలోపేతమవ్వాలి
కందుకూరు, న్యూస్‌లైన్: సహకార సంఘాలు బలోపేతమైనప్పుడే రైతులు, కూలీలకు ప్రయోజనాలు చేకూరుతాయని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన కందుకూరులోని నవారు కిష్టమ్మ ఫంక్షన్ హాల్లో 60వ అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సహకార వారోత్సవాలను నెహ్రూ పుట్టిన రోజున ఇక్కడ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో తుపానులతోపాటు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరికీ పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు 25 కేంద్రాలు: సబితారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి 25కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. అదనంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఇబ్రీహ ంపట్నం, తాండూరులో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లోగో ఆవిష్కరణ సహకార వారోత్సవాల లోగో, పుస్తకాన్ని మంత్రి వెంకటకృష్ణారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సహకారశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సహకార ఫ్యూరీఫైడ్ వాటర్ సరఫరా కేంద్రాన్ని ప్రారంభించి సహకార సంఘాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఎంవీ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ బుస్సు చెన్నకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్‌కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు వెదిరె నర్సింగంరెడ్డి, అంజయ్యయాదవ్, వైస్ చైర్మన్ ఎస్.ఎల్లారెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, హాకా డెరైక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర సహకార సంఘం యూనియన్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్లు అక్కి యాదయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య, మల్లేష్, రాములు, యాదమ్మ, లక్ష్మమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, నాయకులు ఈశ్వర్‌గౌడ్, ఆర్.ప్రభాకర్‌రెడ్డి, కురుణాకర్రెడ్డి, కృష్ణనాయక్, ఇజ్రాయిల్, శివమూర్తి, రైతులు పాల్గొన్నారు.