సహకార సంఘాలు బలోపేతం కావాలి
Published Tue, Sep 20 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
ఒంగోలు : సహకార సంఘాలు బలోపేతం కావాలని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పీడీసీసీ బ్యాంకు సమావేశమందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 67 ప్రాథమిక సహకార సంఘాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుకు రూ. 6 లక్షల ప్రోత్సాహకాన్ని ఆయన ఈ సందర్భంగా అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సహకార సంఘాల పరిస్థితిపై సర్వే జరుగుతుందన్నారు. సంఘాలు కేవలం రుణాలపైనే ఆ«ధారపడకుండా ధాన్యం, కందుల కొనుగోలు, ఇతరత్రా వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి సహకార సంఘం కేవలం మూడు నెలలపాటు కష్టపడి ధాన్యం కొనుగోలు ద్వారా కోటిరూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, ప్రకాశం జిల్లాలో రావినూతల సొసైటీ చేపడుతున్న వ్యాపారాలను పరిశీలించేందుకు జిల్లాలోని పలు సంఘాలు కూడా సందర్శిస్తున్నాయన్నారు. లేని పక్షంలో మండలానికో సొసైటీ కాదు.. చివరకు నియోజకవర్గానికి ఒక సహకార కేంద్రం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. జిల్లా సహకారశాఖ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ కేరళలో ఒక్కో సొసైటీ సీఈవో రూ. 70 వేలకుపైగా జీతం తీసుకుంటున్నారంటే అందుకు కారణం వారు చేపట్టిన వ్యాపారా«భివృద్ధే అన్నారు. కనుక జిల్లాలోని సహకార సంఘాల సీఈఓలు కూడా వారి పరిధిలోని ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తూ వ్యాపారాన్ని పెంచుకోవాలని, తద్వారా వారు కూడా ఆకాశమే హద్దుగా జీతాలు తీసుకునే సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.
డీఆర్ ఓఎస్‌డీ శీతారామయ్య మాట్లాడుతూ జిల్లాలో 35 సంఘాలు బలహీనంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వాటిని బలోపేతం చేసేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పడిందన్నారు. కొన్ని సంఘాలు జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల రూ. 4 కోట్లకుపైగా రుణాలు పేరుకుపోయాయని, వాటికి ఇక ప్రభుత్వం నుంచి రుణమాఫీ వర్తించే అవకాశమే లేదని న్యాయ పరమైన చర్యలతో వసూలుకు సిద్ధం కావాలని సూచించారు. ఓఎస్‌డీ రావెళ్ల మోహన్‌రావు మాట్లాడుతూ ఐసీడీపీ ద్వారా రూ. 17 కోట్ల ఆర్థిక సాయాన్ని పొంది సకాలంలో వినియోగించుకున్న 67 సంఘాలకు రూ. 6 లక్షల ఇన్సెంటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో కుంభా రాఘవయ్య, డీఆర్ ఇందిరాదేవి, ఐసీడీపీ సీపీవో సుబ్బారావులు పాల్గొని పలు సూచనలు చేశారు.
Advertisement