‘చంద్రన్న మజ్జిగ’పై కదిలిన అధికారులు
♦ హడావుడిగా సవరణ ఉత్తర్వులు
♦ హెరిటేజ్తోపాటు మరికొన్ని సంస్థలకు అవకాశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో హెరిటేజ్ డెయిరీతోపాటు విశాఖ డెయిరీ పెరుగును కూడా చలివేంద్రాల్లో పంపిణీ చేశామని కలెక్టర్ ఎంఎం నాయక్ పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హెరిటేజ్ లాభం కోసం చంద్రన్న మజ్జిగ’ అనే కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. విశాఖ డెయిరీ వారు విజయనగరం పట్టణంలో మాత్రమే పెరుగు సరఫరా చేయగలమని చెప్పడంతో మిగిలిన ప్రాంతాల్లో హెరిటేజ్ పెరుగు తీసుకుని మజ్జిగ చేసి అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. హెరిటేజ్ పెరుగును మాత్రమే అందించాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి మౌఖికంగా తమకు రాలేదని వెల్లడించారు.
చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీపై విజయనగరం జిల్లా అధికారులు హడావుడిగా సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. చలివేంద్రాలకు పెరుగు సరఫరా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి సొంత కంపెనీ హెరిటేజ్తోపాటు మరికొన్ని సంస్థలకు కల్పిస్తూ ఉత్తర్వులను మార్చారు. జిల్లాలోని 9 మండలాల్లో మజ్జిగ సరఫరా చేసేందుకు హెరిటేజ్ సంస్థ నుంచి పెరుగు కొనుగోలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ పేరిట డీఆర్వో మారిశెట్టి జితేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో తిరుమల, జెర్సీ, విశాఖ, హెరిటేజ్ సంస్థలతోపాటు రిజిస్టర్ అయిన కో-ఆపరేటివ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి గతంలో ప్రకటించిన ధరకే పెరుగు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.