నీట్–పీజీ కౌన్సెలింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా నీట్–పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రస్తుత(2021–22) విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్/బీడీఎస్, ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీకి ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జూలై 29న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పలువురు ‘నీట్’ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీబీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర సర్కారు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ హాజరయ్యారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఇచ్చేవరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టబోమని వెల్లడించారు. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం ప్రకటించిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాతో చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. మెడికల్, డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లు, పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద ఉంటాయి. ఈ సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ ఉత్తర్వుల ప్రకారం నీట్–పీజీ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.