Counterpoint Research
-
స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్‌పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్‌ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
స్మార్ట్ టీవీల విక్రయాల్లో 38 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్మార్ట్ టీవీల షిప్మెంట్లు (విక్రయాలు/రవాణా) 38 శాతం పెరిగాయి. పండుగల సీజన్ కావడం, కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్కౌంట్ ఆఫర్లు ఈ వృద్ధికి కలిసొచ్చినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా 40 శాతంగా ఉంటే, చైనా బ్రాండ్ల వాటా 38 శాతంగా ఉంది. ఇక స్థానిక బ్రాండ్ల స్మార్ట్ టీవీల వాటా రెట్టింపై 22 శాతానికి చేరుకుంది. మొత్తం షిప్మెంట్లలో 32 నుంచి 42 అంగుళాల స్క్రీన్ టీవీల వాటా సగం మేర ఉంది. ఎల్ఈడీ డిస్ప్లేలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్క్రీన్లు సైతం క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కువ కంపెనీలు క్యూఎల్ఈడీ స్క్రీన్లతో విడుదలకు ఆసక్తి చూపిస్తున్నాయి. స్క్రీన్ తర్వాత కస్టమర్లు ఆడియోకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డాల్బీ ఆడియో ఫీచర్‌తో విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ టీవీల విక్రయాలు మొత్తం టీవీల్లో 93 శాతానికి చేరాయి. రూ.20వేల లోపు బడ్జెట్లో టీవీల విడుదలతో ఈ వాటా మరింత పెరుగుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆన్లైన్ చానళ్ల ద్వారా విక్రయాలు 35 శాతం పెరిగాయి. అన్ని ఈ కామర్స్ సంస్థలు పండుగల సీజన్లో ఆఫర్లను ఇవ్వడం ఇందుకు దోహదం చేసినట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. మొదటి స్థానంలో షావోమీ షావోమీ స్మార్ట్ టీవీ మార్కెట్లో 11 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శామ్ సంగ్ 10 శాతం, ఎల్జీ 9 శాతం వాటాతో ఉన్నాయి. వన్ ప్లస్ వార్షికంగా చూస్తే 89 శాతం వృద్ధితో తన మార్కెట్ వాటాను 8.5 శాతానికి పెంచుకుంది. దేశీ బ్రాండ్ వూ వాటా సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. ఎంతో పోటీ ఉన్న స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరిన్ని భారత బ్రాండ్లు ప్రవేశిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. సెప్టెంబర్ క్వార్టర్లో వన్ ప్లస్, వూ, టీసీఎల్ బ్రాండ్లు స్మార్ట్ టీవీ మార్కె ట్లో వేగవంతమైన వృద్ధిని చూపించాయి. -
భారత్‌లో..ఆపిల్,టెస్లాలకు బ్రేక్..ఈ ఏడాది లేనట్లే!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్రం తెచ్చిన 'లోకల్'ప్రతిపాదనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భారత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డ్రాగన్ కంట్రీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత్ పై ఆయన తీరు ఎలా ఉన్నా.. మనదేశంలో టెస్లా కార్ల తయారీ యూనిట్లను మొదలుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టెస్లా ఇండియాలో అడుగుపెట్టకపోతే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో సత్తా చాటేందుకు దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రముఖ ఆటోమోటీవ్ అండ్ డివైజ్ ఈకోసిస్టమ్ రీసెర్చ్ ఎనలిస్ట్ సౌమెన్ మండల్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌కు తెలిపారు.ఈ సందర్భంగా టెస్లాతో పాటు ఆపిల్ సైతం భారత్‌లో అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉత్పత్తులే ముందు.. ఆ తర్వాతే ఏదైనా భారత్‌లో టెస్లా కార్లను తొలత విక్రయించి.. ఆ తర్వాత తయారీ యూనిట్లు ప్రారంభిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. కానీ కేంద్రం దేశీయంగా టెస్లా కార్ల విక్రయం కంటే ఇక్కడ నిర్మించబోయే ఫ్యాక్టరీలపై స్పష్టత ఇవ్వాలని టెస్లాను కోరింది. టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ సైతం ముంబైలో ఫస్ట్ బ్రాండెడ్ రీటైయిల్ స్టోర్‌తో పాటు అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కానీ చిప్ షార్టేజ్ వల్ల సాధ్య పడలేదు. త్వరలో ఆపిల్, టెస్లా సమస్యలు ఓ కొల్లిక్కి వస్తాయని, వచ్చే ఏడాది నాటికి ఆ రెండు దిగ్గజ కంపెనీలు దేశీయ తయారీ యూనిట్లను ప్రారంభించనున్నట్లు ఎనలిస్ట్ సౌమెన్ మండల్ అన్నారు. ఇబ్బందుల్లో ఆటోమొబైల్ సంస్థలు.. మైక్రోచిప్ షార్టేజ్ వల్ల ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సౌమెన్ మండల్ చెప్పారు.ముఖ్యంగా స్టెల్లాంటిస్,వోక్స్వ్యాగన్, టయోటా,బీఎండబ్ల్యూ, ఫోర్డ్ కంపెనీలు కార్ల ఉత్పత్తుల్ని తగ్గించాయన్న సౌమెన్ మండల్..2023 నాటికి చిప్ షార్టేజ్ కొరత తగ్గిపోతుందని ఆటోమొబైల్ సంస్థలు భావిస్తున్నాయన్నారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం వచ్చే ఏడాదిలోపే చిప్ సమస్య తొలగిపోతుందనే ధీమాగా ఉన్నారని వెల్లడించారు. చదవండి: వీడే ఫ్యూచర్ ఎలన్‌మస్క్.. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓపెన్ లెటర్ -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
ఆ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోయిందట
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దిగ్గజ సంస్థలకు స్వర్గధామంలా విరాజిల్లుతున్న భారత మార్కెట్లో బడ్జెట్ ధరలస్మార్ట్‌ఫోన్ విక్రయాలు వెలవెలబోతున్నాయట.ఒకపుడు బడ్జెట్ ఫోన్లు, లేదా ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌గా పేరొందిన ఇండియాలో ఇపుడు ట్రెండ్ మారిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదించింది. ముఖ్యంగా రూ. 5వేల లోపు ఖరీదున్న మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది. నిజానికి ఈ సూచనలు 2018లోనే మొదలైనాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పరిశోధన తేల్చింది. 2018లో 25శాతం క్షీణించిన ఈ కేటగిరీ అమ్మకాలు 2019 లో 45 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఎంట్రీ లెవల్ కేటగిరీ రూ .5 వేల స్మార్ట్ఫోన్లలో లభించే మార్జిన్ కంటే దేశంలోని ఇంటీరియర్ పరికరాల ఖర్చు ఎక్కువ అవుతోందని తెలిపింది. అలాగే, ఈ ఫోన్ల డిమాండ్ కూడా గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. దీనికి తోడు ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు మారిపోవడం కూడా ఒక కారణం. అయితే దేశంలో ఇంకా 450 మిలియన్ల ఫీచర్ ఫోన్లు వినియోగంలో ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ అయ్యేందుకు చాలామంది వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు, భారతదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ల సగటు ధర క్రమంగా పెరుగుతోందని ఐడీసీ డేటా ద్వారా తెలుస్తోంది. ఇది 2018లో 159 డాలర్లు (సుమారు రూ. 11,350 ) నుండి 2019 లో 160 డార్లు (సుమారు రూ. 11,421) కు పెరిగింది. ప్రస్తుతం 170 డాలర్ల (సుమారు రూ. 12,135 ) స్థాయికి చేరింది. ఈ గణాంకాల ప్రకారం బట్టి చూస్తే ఎంట్రీ లెవల్లో ఎక్కువ ఫోన్లను విక్రయిస్తున్న ఏకైక ముఖ్యమైన బ్రాండ్ షావోమినే. -
పండుగ సీజన్ : స్మార్ట్‌ఫోన్ ధరలపై నిరాశ
న్యూఢిల్లీ : పండుగ సీజన్లో కస్టమర్లకు నిరాశ కలిగించే విషయం. టర్కీ సంక్షోభం రూపాయి విలువను భారీగా దెబ్బకొట్టగా.. ఇప్పుడు ఆ రూపాయి స్మార్ట్‌ఫోన్ ధరలపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి క్రాష్ అవడంతో, స్మార్ట్‌ఫోన్ కాంపోనెంట్ల ఇన్పుట్ వ్యయాలు 4 శాతం నుంచి 6 శాతం పెరుగుతున్నాయి. దీంతో హ్యాండ్సెట్ తయారీదారులు మొబైల్ ఫోన్ల ధరలను సెప్టెంబర్ మధ్య నుంచి పెంచనున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షీణించిన రూపాయి విలువ వద్ద కొత్త కాంట్రాక్ట్‌ల కోసం సంతకం చేసిన విక్రేతలు అత్యధిక మొత్తంలో నగదును కోల్పోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ధరల పెంపును చేపడతారని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. చైనీస్ ఆర్ఎన్బీతో కూడా రూపాయి విలువ 5.4 శాతం క్షీణించింది. ఇది కూడా స్మార్ట్‌ఫోన్ ధరలపై ప్రభావం చూపుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకులు చెప్పారు. కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను భారత్‌లో తయారీ చేస్తున్నాయి. కానీ చాలా బ్రాండ్లు బయట మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఎక్కువగా చైనా నుంచి వస్తున్నాయి. దీంతో రూపాయి క్షీణత వాటిపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ 70కి పడిపోవడం స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇండస్ట్రి ఇక ధరల పెంపును చేపట్టాల్సి ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహింద్రో అభిప్రాయపడ్డారు. అయితే డాలర్ విలువను ఎప్పడికప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతమైతే ఎలాంటి ధరల పెంపు ప్రణాళికను లేదని షావోమి తెలిపింది. ఒకవేళ రూపాయి 70 వద్దనే ఉంటే, ఫెస్టివల్ సమయంలో కొత్త ఉత్పత్తులపై ధరల పెంపును చేపడతామని పేర్కొంది. దిగ్గజ కంపెనీలు శాంసంగ్, ఒప్పో, వివో, లావా, కార్బన్, హెచ్ఎండీ, ఇంటెక్స్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు మాత్రం స్మార్ట్‌ఫోన్ ధరల పెంపుపై ఇంకా స్పందించలేదు. ఆగస్టు నుంచి అక్టోబర్ కాలం స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఎంతో ముఖ్యమైందని. అన్ని పండుగల సీజన్ అప్పుడే. మరి ఈసారి పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. -
గ్లోబల్‌గా కూడా జియోదే రాజ్యం..!
రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ తీసుకొచ్చిన జియోఫోన్ ఇటు భారత్‌లోనే కాక, అటు ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగించుకుంటోంది. 2018 తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియోఫోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 శాతం షేరుతో రిలయన్స్ జియోఫోన్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. జియోఫోన్ అనంతరం నోకియా హెచ్ఎండీ, ఇంటెల్, శాంసంగ్, టెక్నో కంపెనీలు నిలిచినట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. రిలయన్స్ జియోఫోన్ బలమైన షిప్మెంట్లతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో వార్షికంగా 38 శాతం వృద్ధి సాధించినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా హెచ్ఎండీ 14 శాతం మార్కెట్ షేరును సంపాదించుకోగా, ఇంటెల్ 13 శాతం, శాంసంగ్ 6 శాతం, టెక్నో 6 శాతం మార్కెట్ షేరును పొందినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ప్రతేడాది 50 కోట్ల ఫీచర్ ఫోన్లు విక్రయమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఫీచర్ ఫోన్లు అవసరం ఉందని ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఓ వైపు మొబైల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్నప్పటికీ, ఫీచర్ ఫోన్లు మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. 2018 తొలి త్రైమాసికంలో భారత్ ఒక్క దేశమే మొత్తం ఫీచర్ ఫోన్ షిప్మెంట్లలో సుమారు 43 శాతం స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది ఫీచర్ ఫోన్ కొనుగోలుదారులు డిజిటల్, ఎకనామిక్, అక్షరాస్యత వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం, ఖరీదైన స్మార్ట్ఫోన్లను, వాటి డేటా ప్లాన్లను అందిపుచ్చుకునే స్థాయి లేకపోవడమే ఫీచర్ ఫోన్ వృద్ధికి సహకరిస్తుందని రీసెర్చ్ సంస్థ తెలిపింది. మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌కు భారీ అవకాశాలున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
మళ్లీ టాప్ శాంసంగే..
ఇటీవల కాలంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పడిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో క్వార్టర్లోనూ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు క్షీణించాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించిన డేటాలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో గ్లోబల్ లీడర్‌గా శాంసంగ్ కంపెనీనే అగ్రస్థానంలో ఉందని, 78 మిలియన్ డివైజ్‌ల విక్రయాలతో, 21.7 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుందని తెలిసింది. గతేడాది ఇదే క్వార్టర్లో 80 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 2 శాతం మేర కంపెనీ విక్రయాలు పడిపోయాయి. అయినప్పటికీ శాంసంగ్ కంపెనీనే టాప్‌లో నిలిచినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 52.2 మిలియన్ డివైజ్ రవాణాతో 14.5 శాతం మార్కెట్ షేరును దక్కించుకుని ఆపిల్ రెండో స్థానంలో నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా వెల్లడించింది. టాప్-10 ప్లేయర్లే 76 శాతం మార్కెట్‌ను ఆక్రమించుకున్నాయని, మిగతా 600 బ్రాండులు మిగిలిన 24 శాతం మార్కెట్‌ను పొందినట్టు తెలిపింది. స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర పెరుగుతూ వస్తోందని, ఎమర్జింగ్ మార్కెట్లలో యూజర్లు ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ల నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లలోకి మరులుతున్నారని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్ చెప్పారు. అయితే అభివృద్ధి చెందిన మార్కెట్లో మాత్రం స్మార్ట్‌ఫోన్ డిమాండ్ మందగించినట్టు పేర్కొన్నారు. శాంసంగ్, ఆపిల్ తర్వాత హువావే 10.9 శాతం, షావోమి 7.5 శాతం, ఒప్పో 6.1 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. -
మరో సంచలనానికి జియో రెడీ
న్యూఢిల్లీ : సంచలనాలకు మారుపేరుగా రిలయన్స్ జియో మార్కెట్లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసులు, స్మార్ట్ఫోన్లు, 4జీ ఫీచర్ ఫోన్ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్)ను పెంచుకోవడం కోసం సిమ్ కార్డుతో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముఖేష్ అంబానీకి చెందిన ఈ కంపెనీ చర్చలు కూడా జరిపిందని తెలిసింది. బిల్ట్-ఇన్ సెల్యులార్ కనెక్షన్స్తో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను ఇది మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. క్వాల్కామ్ ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్ కోసం జియోతో కలిసి పనిచేస్తోంది. ‘జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారు’ అని క్వాల్కామ్ టెక్నాలజీస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ మిగ్యుల్ న్యున్స్ చెప్పారు. ఈ చీప్‌మేకర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) బ్రాండ్ స్మార్ట్రాన్‌తో కూడా పనిచేస్తోంది. సెల్యులార్ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. ఈ చర్చలను స్మార్ట్రాన్ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్కామ్ పనిచేస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్ జియో నిరాకరించింది. ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి తర్వాత డివైజ్‌లు, సెల్యులార్ కనెక్టెడ్ ల్యాప్‌టాప్‌లేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డివైజస్, ఎకోసిస్టమ్స్ రీసెర్చ్ డైరెక్టర్ నైల్ షా అన్నారు. కౌంటర్‌పాయింట్ డేటా ప్రకారం ప్రతేడాది భారత్‌లో 50 లక్షల ల్యాప్‌టాప్‌లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది. వీటిని సెల్యులార్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేస్తే, వీటి విలువ పెరిగి, ఈ రంగంలో వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. వైఫై హాట్స్పాట్లతో పోలిస్తే, సెల్యులార్ కనెక్టివిటీ ఎక్కువ భద్రంగా ఉంటుందని తెలిపారు. -
భారత్‌లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ఫోన్లివే!
షావోమి స్మార్ట్ఫోన్లు ఇటీవల స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రయానికి వచ్చిన ప్రతిసారి షావోమి ఫోన్లు సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. 10వేల రూపాయల కన్నా ధర తక్కువగా ఉన్న కేటగిరీలో షావోమి స్మార్ట్ఫోన్లు, శాంసంగ్‌ను బీట్ చేశాయి. బెస్ట్-సెల్లర్ స్లాటును దక్కించుకున్నాయి. 2017 రెండో క్వార్టర్లో భారత్‌లో రూ.10వేల కన్నా తక్కువున్న స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లలో షావోమి బెస్ట్ సెల్లర్‌గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. షావోమికు చెందిన రెడ్మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 7.2 శాతం మార్కెట్ షేరును, రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్ 4.5 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని తొలి రెండు స్థానాల్లో నిలవగా... వీటి తర్వాత 4.3 శాతం మార్కెట్ షేరుతో శాంసంగ్ గెలాక్సీ జే2 ఉన్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. రూ.10వేల ధర కలిగిన పోర్ట్‌ఫోలియోలో షావోమికి స్ట్రాంగ్ డిమాండ్ వస్తుందని, 2017 ప్రథమార్థంలో రెడ్మి నోట్ 4 టాప్ సెల్లింగ్ మోడల్‌గా చోటు దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్‌ను వేరే బ్రాండు అధిగమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బెస్ట్-సెల్లర్ స్లాటులో శాంసంగ్ మోడల్సే నిలిచాయని చెప్పారు. కానీ ఈసారి ట్రెండ్ రివర్స్ అయిందన్నారు. అయితే మొత్తంగా స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ల సరుకు రవాణాల్లో శాంసంగ్ కంపెనీనే మొదటి స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ కేటగిరీలో 25.4 శాతం మార్కెట్ షేరు ఉండగా.. స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో 24.1 శాతాన్ని దక్కించుకుంది.