CP Anand
-
రంగారెడ్డిజిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్నేక్ గ్యాంగ్ సభ్యులకు శిక్షలు ఖరారు చేస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం గ్యాంగ్ కుటుంబసభ్యులు హల్చల్ చేశారు. కోర్టు హాలు బయటకు వచ్చిన సీపీ ఆనంద్‌ను గ్యాంగ్ కుటుంబసభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. 8 మంది నిందితుల్లో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఏ8 నిందితుడు అలీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. -
'55 యాంటీ చైన్ స్నాచర్ టీంల ఏర్పాటు'
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో 55 యాంటీ చైన్ స్నాచర్ల టీంలు ఏర్పాటు చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఆటోనగర్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ముఠా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆటోనగర్ దాడిలో ఒకరికి బుల్లెట్ గాయమైనట్టు అనుమానిస్తున్నామన్నారు. తమ సిబ్బందికి ట్రైనింగ్, ఫైరింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే చైన్ స్నాచర్లను పట్టుకుంటామని సీపీ ఆనంద్ వెల్లడించారు. -
చక్రబంధంలో పహాడీషరీఫ్
స్నేక్‌గ్యాంగ్ నిందితుడి ఇల్లు సోదా సెర్చ్‌లో పాల్గొన్న 412 మంది పోలీసులు అతడి ఆస్తులను చూసి ఆశ్చర్యపోయిన సీపీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: బుధవారం తెల్లవారుజాము... అందరు గాఢ నిద్రలో ఉన్నారు. సుమారు 412 మంది పోలీసు అధికారులు పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలను చుట్టుముట్టారు. ఏ గల్లీలో చూసిన బూట్ల చప్పుళ్లు, టార్చ్లైట్ల వెలుగులు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా నిర్వహించిన కార్డర్ సెర్చ్ అది. తెల్లవారు జాము 3 గంటలకు ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ నాలుగు గంటలపాటు సాగింది. సెర్చ్ మొదలైన 15 నిమిషాలకు బస్తీవాసులు మేల్కొన్నారు. ఏమైందోనని కంగారు పడ్డారు...అసలు విషయం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. రాజమహల్.... స్నేక్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌దయానీ నివాసంపై దాడి చేసిన పోలీసుల కళ్లు బైర్లుకమ్మాయి. రెండున్నర ఎకరాల విశాల ప్రదేశంలో ఫైసల్ దయానీ ఇల్లు ఉంది. ఇందులో గుర్రాలు, మేకలు, బాతులు, కొంగలకు ప్రత్యేక షెడ్డులు నిర్మించి ఉన్నాయి. పక్కనే దయానీ పేరుతో పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండడంతో కమిషనరే ఆశ్చర్యపోయారు. పనీపాట లేని వీరికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో ఎవరికి అంతుపట్టలేదు. రహస్య కోట మాదిరి తలపించే దాంట్లోనే బాకీదారులను కూడా బంధించి చితకబాదిన సంఘటనలు కూడా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. సెటిల్మెట్లకు ఇదే అడ్డాగా చేసుకున్నారని విచారణలో తేలింది. భూ కబ్జాలు, సెటిల్మెంట్ల ద్వారా ఆస్తులు సంపాదించారని పోలీసులు అంటున్నారు. -
ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టతకు చర్యలు
భాగ్యనగర్‌కాలనీ: ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా సాగుతుందని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కూకట్‌పల్లిలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు ఉప కమిషనర్, ట్రాఫిక్ కూకట్పల్లి డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ భవనాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ట్రాఫిక్‌పై అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో రెండు జోన్లుగా విభజించినట్టు చెప్పారు. ఈ భవన నిర్మాణానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రూ.6 లక్షలు విరాళం ఇవ్వగా మిగతా డబ్బును పోలీస్ వ్యవస్థ వెచ్చించిందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిచవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం.రామ్మోహన్రావు, కూకట్పల్లి ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పి.సంతోష్‌కుమార్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, కూకట్పల్లి, బాలానగర్ ఏసీపీలు సాయిమనోహర్, నంద్యాల నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.