చక్రబంధంలో పహాడీషరీఫ్
- స్నేక్‌గ్యాంగ్ నిందితుడి ఇల్లు సోదా
- సెర్చ్‌లో పాల్గొన్న 412 మంది పోలీసులు
- అతడి ఆస్తులను చూసి ఆశ్చర్యపోయిన సీపీ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: బుధవారం తెల్లవారుజాము... అందరు గాఢ నిద్రలో ఉన్నారు. సుమారు 412 మంది పోలీసు అధికారులు పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలను చుట్టుముట్టారు. ఏ గల్లీలో చూసిన బూట్ల చప్పుళ్లు, టార్చ్‌లైట్ల వెలుగులు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా నిర్వహించిన కార్డర్ సెర్చ్ అది. తెల్లవారు జాము 3 గంటలకు ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ నాలుగు గంటలపాటు సాగింది. సెర్చ్ మొదలైన 15 నిమిషాలకు బస్తీవాసులు మేల్కొన్నారు. ఏమైందోనని కంగారు పడ్డారు...అసలు విషయం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.
రాజమహల్.... స్నేక్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌దయానీ నివాసంపై దాడి చేసిన పోలీసుల కళ్లు బైర్లుకమ్మాయి. రెండున్నర ఎకరాల విశాల ప్రదేశంలో ఫైసల్ దయానీ ఇల్లు ఉంది. ఇందులో గుర్రాలు, మేకలు, బాతులు, కొంగలకు ప్రత్యేక షెడ్డులు నిర్మించి ఉన్నాయి. పక్కనే దయానీ పేరుతో పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండడంతో కమిషనరే ఆశ్చర్యపోయారు.
పనీపాట లేని వీరికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో ఎవరికి అంతుపట్టలేదు. రహస్య కోట మాదిరి తలపించే దాంట్లోనే బాకీదారులను కూడా బంధించి చితకబాదిన సంఘటనలు కూడా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. సెటిల్‌మెట్లకు ఇదే అడ్డాగా చేసుకున్నారని విచారణలో తేలింది. భూ కబ్జాలు, సెటిల్‌మెంట్ల ద్వారా ఆస్తులు సంపాదించారని పోలీసులు అంటున్నారు.