'బాబుది కండువాలు మార్చే సంస్కృతి'
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరానికి విచ్చేసిన నారాయణ విలేకర్లతో మాట్లాడారు. రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేసి చంద్రబాబు తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. కండువాలు మార్చే సంస్కృతి చంద్రబాబు నాయుడిదే అంటూ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.
అలాగే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహార శైలిపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని నారాయణ ఖండించారు. ఉద్యోగుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని ఈ సందర్బంగా కేసీఆర్‌కు హితవు పలికారు. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేసి ప్రాజెక్టులకు నీరందించాలని నారాయణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.