creates history
-
మనీషా కిక్ కొడితే...
పంజాబ్ రాష్ట్రం హొషియార్పూర్ జిల్లాలోని ముగొవాల్ గ్రామం...ఆ ఊర్లో ఒక రోజు ఒక టీనేజ్ అమ్మాయి ఫుట్‌బాల్‌తో డ్రిబ్లింగ్ చేస్తూ మైదానంలో కనిపించింది. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఆ గ్రామానికి ఇది కూడా ఒక వార్తగా మారింది! అమ్మాయిలు ఆటలు ఆడటమే ఎక్కువ అనుకుంటే అందులోనూ ఫుట్‌బాల్ ఆడటం వారిని సహజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించినట్లుగానే అందరినుంచీ విమర్శలూ వచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఎవ్వరీ మాటా వినలేదు, తన ఆటనూ మార్చుకోలేదు. ఆ తర్వాత మైదానంలోనే సత్తా చాటి అనూహ్య వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు భారత్ తరఫున చాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన తొలి మహిళగా ఘనతకెక్కింది. 21 ఏళ్ల ఆ ప్లేయర్ పేరే మనీషా కల్యాణ్. పాఠశాలలో ఉన్నప్పుడు చాలా మందిలాగే మనీషా రన్నింగ్ రేస్‌లలో పాల్గొంది. స్కూల్లోనే కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఒక రోజు మనీషాలోని వేగాన్ని, ఆమె కాళ్ల కదలికలను గుర్తించిన కోచ్ ఆమె ఫుట్బాల్కైతే సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. మనీషాకు కూడా వ్యక్తిగత క్రీడలకంటే టీమ్ గేమ్‌లంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో వెంటనే ఓకే అనేసింది. అయితే వీరిద్దరు కూడా ఊర్లో వచ్చే అభ్యంతరాల గురించి అసలు ఆలోచించలేకపోయారు. చిన్నపాటి దుకాణం నడుపుకునే తండ్రికి ఆటలపై ఎలాంటి అవగాహన లేకపోగా, అసలు మనకెందుకీ తంటా అన్నట్లుగా పెద్దగా ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే కోచ్ అన్ని విషయాల్లో సరైన మార్గదర్శిగా నిలవడం మనీషాను ముందుకు వెళ్లేలా చేయగలిగింది. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ / ఫార్వర్డ్‌గా మైదానంలో మనీషా తన ముద్ర చూపించగలిగింది. 2021–22లో భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఆమెకే దక్కింది. వేగంగా దూసుకెళ్లి... 13 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ వైపు మళ్లిన ఈ అమ్మాయి నాలుగేళ్లు తిరిగే సరికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. వేర్వేరు వయో విభాగాల సెలక్షన్స్‌లో రాణించడంతో మనీషాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 2018లో దక్షిణాఫ్రికాలో జరిగిన ‘బ్రిక్స్’ దేశాల అండర్–17 ఫుట్‌బాల్ కప్‌తో తొలిసారి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే మనీషా కల నెరవేరింది. ఆ తర్వాత 2019 ఏఎఫ్సీ అండర్–19 చాంపియన్‌షిప్ ఆమె కెరీర్లో మరో మలుపు. భారత జట్టు పాకిస్తాన్‌ను 18–0తో చిత్తు చేసిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’తో చెలరేగిన మనీషా థాయిలాండ్‌పై భారత్ విజయం సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్ టీమ్‌కు కూడా ఎంపికై మనీషా సంచలనం సృష్టించింది. 2019 ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీషా అరంగేట్రం చేసింది. గత ఏడాది ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బ్రెజిల్‌పై సాధించిన గోల్ ఆమెను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. క్లబ్ తరఫున ఆడుతూ... ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే అవకాశం రావడం కూడా ఆటగాళ్లకు వరంలాంటిదే. మనీషా ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ క్లబ్ ‘గోకులమ్ కేరళ’ ఆమెను జట్టులోకి తీసుకుంది. ఆ జట్టు వరుస విజయాలతో టైటిల్ గెలవడంలో భాగం కావడంతో పాటు ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ ఉమెన్స్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో గోకులమ్ టీమ్ తరఫున ఆడుతూ ఉజ్బెకిస్తాన్ క్లబ్ బున్యోడ్కర్ ఎఫ్‌సీపై చేసిన గోల్‌తో మనీషా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ టోర్నీలో ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడే అదే ఆమెకు యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించింది. భారత మహిళల ఫుట్‌బాల్‌లో దిగ్గజంలాంటి బాలాదేవిని అభిమానించే మనీషా ఆమె తరహాలో మరింత పైకి ఎదగాలని పట్టుదలగా ఉంది. యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్‌లో ఆడిన తొలి భారత మహిళగా మనీషా నిలిచింది. ‘అపోలాన్ లేడీస్ ఎఫ్‌సీ’ టీమ్ తరఫున గురువారం ఆమె అరంగేట్రం చేసింది. ఎస్‌ఎఫ్‌కే రిగాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 60వ నిమిషంలో మరిలెనా జార్జియాకు సబ్‌స్టిట్యూట్‌గా మనీషా మైదానంలోకి దిగింది. అపోలాన్ టీమ్‌తో ఆమె రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
మహిళా క్రికెట్లో పెను సంచలనం
డబ్లిన్: రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న మహిళా క్రికెట్లో పెనుసంచలనం నమోదయింది. ఐర్లాండ్ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు 490 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కివీస్ మహిళల జట్టు నిలిచింది. శుక్రవారం ఆతిథ్య ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఓపెనర్లు కళ్లు చెదిరే రీతిలో శుభారంభం అందించారు. కెప్టెన్ సుజయ్ బేట్స్ 151(94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లు), జెస్సీ వాట్కిన్(62)లు చెలరేగడంతో పాటు.. మాడీ గ్రీన్ 121(77 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్), అమెలియా కెర్(81) మెరుపులు మెరిపియ్యడంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. దీంతో 1997లో పాకిస్తాన్‌పై కివీస్ సాధించిన 455 పరుగుల రికార్డును తాజాగా అదే జట్టు చెరిపివేసి కొత్త చరిత్రను లిఖించింది. ఇక పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ చేసిన 444 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కావడం గమనార్హం. -
ఇది ఆరంభం మాత్రమే..బిగ్ రన్ ముందుంది
సాక్షి, ముంబై: అంచనాలకనుగుణంగానే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. మెరుగైన ఫలితాలు, బోనస్కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి సోమవారం టీసీఎస్ స్టాక్ మరింత పుంజుకుంది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ మరో సరికొత్త రికార్డును సాధించింది. 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించి టాప్‌లో నిలిచింది. టీసీఎస్ షేరు 4శాతం ఎగిసి 6.75 లక్షల కోట్లను అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. గ్లోబల్‌గా 64వ కంపెనీగా అవతరించింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 100 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించిన టీసీఎస్ షేరు ధర 3500 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.దీనిపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 100 బిలియన్ డాలర్ల కంపెనీల్లో టాటా గ్రూపు కంపెనీ(టీసీఎస్) చేరడం చాలా సంతోషించదగ్గ విషయమంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు టీసీఎస్ బిగ్ రన్‌కు ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాగా క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల్లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి 6904 కోట్ల రూపాయలను సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. -
సత్తాచాటిన తెలంగాణ క్రీడాకారులు
తెలంగాణ స్విమ్మింగ్ బృందం చరిత్ర సృష్టించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో నిర్వహించిన గ్లెన్ మార్క్ 43వ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నాలుగు జాతీయ పతకాలను తెలంగాణ జట్టు సాధించింది. తొలిసారిగా బాలికల విభాగంలో ఈ ఏడాది పతకం సాధించారు. గత ఏడాది బాలుర విభాగంలో పతకం సాధించిన విషయం తెలిసిందే. ట్రిణా తనుజ్ 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణపతకం, 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించారు. 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల విభాగంలో గోలి జాహ్నవి కాంస్య పతకాలు వచ్చాయి. జియాన్ స్పోర్ట్జ్ క్లబ్ కోచ్ జాన్ సిద్దిఖీ వద్ద శిక్షణ పొందిన తెలంగాణ బృందంలో జి. చంద్రిక, ఎం. ఇష్వి, దిషా, శ్రీజ, నటాషా, జి.జాహ్నవి, ట్రిణా తనుజ్, సూర్యాన్షు, సాయిరామ్, శివరామ, రుతిక్, సాయినిహార్ తదితరులున్నారు. ఆటగాళ్ల తాజా ర్యాంకుల వివరాలు: ► రుతిక్ 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో 8వ ర్యాంకు, ఫ్రీ స్టైల్ విభాగంలో 4 వ ర్యాంకు ► సూర్యాన్షు 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో 6వ ర్యాంకు, 100 మీటర్ల బటర్ ఫ్లై స్ట్రోక్ విభాగంలో 8వ ర్యాంకు ► శ్రీజ 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 7వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు ► నటాషా 50 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 5వ ర్యాంకు, 100 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకు, 200 మీటర్ల బ్రిస్ట్ స్ట్రోక్ విభాగంలో 6వ ర్యాంకులు సాధించారు.