సాక్షి, ముంబై: అంచనాలకనుగుణంగానే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. మెరుగైన ఫలితాలు, బోనస్‌కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి సోమవారం టీసీఎస్ స్టాక్ మరింత పుంజుకుంది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్‌లో టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ మరో సరికొత్త రికార్డును సాధించింది. 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించి టాప్‌లో నిలిచింది. టీసీఎస్ షేరు 4శాతం ఎగిసి 6.75 లక్షల కోట్లను అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. గ్లోబల్‌గా 64వ కంపెనీగా అవతరించింది.
సోమవారం నాటి ట్రేడింగ్‌లో 100 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించిన టీసీఎస్ షేరు ధర 3500 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.దీనిపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 100 బిలియన్ డాలర్ల కంపెనీల్లో టాటా గ్రూపు కంపెనీ(టీసీఎస్) చేరడం చాలా సంతోషించదగ్గ విషయమంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు టీసీఎస్ బిగ్ రన్‌కు ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాగా క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల్లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి 6904 కోట్ల రూపాయలను సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment