crossfiring
-
మహారాష్ట్రలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు సీనియర్ నేత సహా ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఛత్తీస్‌గఢ్– మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధింటొలా ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు వారిపైకి కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో కసన్సూర్ దళం డిప్యూటీ కమాండర్ దుర్గేశ్ వట్టి, మరో గుర్తు తెలియని మావోయిస్టు చనిపోయారు. -
బ్యాంకుల దోపిడీకి విఫలయత్నం
రియో డీ జనీరో: బ్రెజిల్లో బ్యాంకుల లూటీకి దొంగల ముఠా చేసిన యత్నం విఫలమయింది. ఈ సందర్భంగా ముఠా, పోలీసుల మధ్య∙కాల్పుల్లో ముఠా వద్ద బందీలుగా ఉన్నావారుసహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ఉన్నారు. బ్రెజిల్‌లోని మిలగ్రెస్ సిటీలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. సుమారు 30 మంది ఉన్న సాయుధ దొంగల ముఠా సభ్యులు రెండు బ్యాంకులున్న వీధికి అడ్డంగా ట్రక్కును ఆపారు. విషయం తెల్సుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. దొంగలకు, పోలీసులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వచ్చిన కారును దుండగులు అడ్డగించారు. అందులోని వారిని బందీలుగా ఉంచుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో బందీలుగా ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురూ చనిపోయారు. దుండగుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు పరారయ్యారు. బందీల మృతికి కారణం పోలీసులా లేక దుండగులా అన్నది విచారణలో తేలుతుందని సియారా రాష్ట్ర గవర్నర్ తెలిపారు. -
ఛత్తీస్‌లో ముగ్గురు నక్సల్స్ ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గత రాత్రి చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధి గట్టపాడ్, టోకన్పల్లి గ్రామాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగతా వారు పరారయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు తుపాకులు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉందని ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. -
దద్దరిల్లిన దుబ్బమరక
* ముగ్గురు మావోలు, ఇద్దరు కమాండెంట్లు మృతి? * అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన కోబ్రా, సీఆర్పీఎఫ్ దుమ్ముగూడెం: సరిహద్దు అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు ఠాణా పరిధి బొట్టెం తోగులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను మరవకముందే ఆ పక్కనే ఉన్న సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని కిష్టారం పోలీస్‌స్టేషన్ అటవీ ప్రాంతంలోని దుబ్బమరకలో గురువారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగింది. ఇందులో కమాండెంట్లు ఫటేష్సింగ్ (సిటీ 208 కోబ్రా), యంఎస్ లంజు (సిటీ 208 కోబ్రా), లక్ష్మణ్కుర్తి (సిటీ208 కోబ్రా) మృతి చెందారు. కాగా, హెడ్ కానిస్టేబుల్ సంతోష్, కానిస్టేబుల్ సోనారాయ్లతో సహా 14 మందికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే, ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో గాయపడిన వారిని కిష్టారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి వైద్య సేవలందిస్తున్నారు. వైద్యులను హెలికాప్టర్ ద్వారా కిష్టారానికి తరలించి వారికి అవసరమైన మందులను సరఫరా చేసినట్లు సమాచారం. మృతిచెందిన ఇద్దరు కమాండోల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం వరకు దుబ్బమరక అటవీ ప్రాంతంలోనే ఉండగా, వాటిని తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మరికొందరు జవాన్లు కూడా మృతిచెందినట్లు తెలుస్తున్నప్పటికీ పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఎన్కౌంటర్ దట్టమైన అటవీప్రాంతంలో జరగడంతో మావోయిస్టుల మృతదేహాలతో పాటు, పోలీసులకు సంబంధించిన తుపాకులను మిగిలిన మావోయిస్టులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు అక్కడున్న జవాన్లను మెరుగైన వైద్యం కోసం సుకుమా తరలించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. గాయాలైన జవాన్ల వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు ఎదురు కాల్పుల అనంతరం యలమగుంట, చింతగుప్ప, బెర్జి తదితర ప్రాంతాల నుంచి సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు అటవీప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులు అధిక సంఖ్యలో ఉండడంతోపాటు ఆ ప్రాంతాలు వారికి కంచుకోట కావడంతో పలు జాగ్రత్తలు తీసుకుని కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల రహస్య ప్రదేశాలను ఛేదించే దిశగా వారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రామన్న నేతృత్వంలోనే దాడులు మావోయిస్టు అగ్రనేత రామన్న, సంతోష్‌ల నేతృత్వంలోనే పోలీసులపై మావోయిస్టులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. బొట్టెంతోగు ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో రామన్న సన్నిహితుడైన లచ్చన్న చనిపోవడంతో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయంపై దుబ్బమరక అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో మావోయిస్టులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలోనే అటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఒకరి చేతిలో ఒకరు మృతి చెందడంతో ఇరువర్గాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. -
మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి
రాయ్ పూర్: ఎనిమిది నక్సల్ ను పోలీసులు మట్టుపెట్టిన గంటల వ్యవధిలోనే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈసారి మావోయిస్టులు భద్రతాబలగాలకు నష్టంచేశారు. నక్సల్స్ ఏరివేతలో భాంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సుక్మా జిల్లాలోని అటవీప్రాంతంలో గురువారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బమరక వద్ద ఒకరికొకరు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా-208 దళాలకు చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.