* ముగ్గురు మావోలు, ఇద్దరు కమాండెంట్లు మృతి?
* అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన కోబ్రా, సీఆర్‌పీఎఫ్
దుమ్ముగూడెం: సరిహద్దు అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు ఠాణా పరిధి బొట్టెం తోగులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను మరవకముందే ఆ పక్కనే ఉన్న సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని కిష్టారం పోలీస్‌స్టేషన్ అటవీ ప్రాంతంలోని దుబ్బమరకలో గురువారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగింది. ఇందులో కమాండెంట్లు ఫటేష్‌సింగ్ (సిటీ 208 కోబ్రా), యంఎస్ లంజు (సిటీ 208 కోబ్రా), లక్ష్మణ్‌కుర్తి (సిటీ208 కోబ్రా) మృతి చెందారు. కాగా, హెడ్ కానిస్టేబుల్ సంతోష్, కానిస్టేబుల్ సోనారాయ్‌లతో సహా 14 మందికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది.
అయితే, ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన వారిని కిష్టారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి వైద్య సేవలందిస్తున్నారు. వైద్యులను హెలికాప్టర్ ద్వారా కిష్టారానికి తరలించి వారికి అవసరమైన మందులను సరఫరా చేసినట్లు సమాచారం. మృతిచెందిన ఇద్దరు కమాండోల మృతదేహాలు శుక్రవారం సాయంత్రం వరకు దుబ్బమరక అటవీ ప్రాంతంలోనే ఉండగా, వాటిని తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మరికొందరు జవాన్లు కూడా మృతిచెందినట్లు తెలుస్తున్నప్పటికీ పోలీసులు ధ్రువీకరించడం లేదు.
ఎన్‌కౌంటర్ దట్టమైన అటవీప్రాంతంలో జరగడంతో మావోయిస్టుల మృతదేహాలతో పాటు, పోలీసులకు సంబంధించిన తుపాకులను మిగిలిన మావోయిస్టులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు అక్కడున్న జవాన్లను మెరుగైన వైద్యం కోసం సుకుమా తరలించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. గాయాలైన జవాన్ల వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
చుట్టుముట్టిన సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు
ఎదురు కాల్పుల అనంతరం యలమగుంట, చింతగుప్ప, బెర్జి తదితర ప్రాంతాల నుంచి సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు అటవీప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులు అధిక సంఖ్యలో ఉండడంతోపాటు ఆ ప్రాంతాలు వారికి కంచుకోట కావడంతో పలు జాగ్రత్తలు తీసుకుని కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల రహస్య ప్రదేశాలను ఛేదించే దిశగా వారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
రామన్న నేతృత్వంలోనే దాడులు
మావోయిస్టు అగ్రనేత రామన్న, సంతోష్‌ల నేతృత్వంలోనే పోలీసులపై మావోయిస్టులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. బొట్టెంతోగు ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో రామన్న సన్నిహితుడైన లచ్చన్న చనిపోవడంతో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయంపై దుబ్బమరక అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో మావోయిస్టులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలోనే అటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఒకరి చేతిలో ఒకరు మృతి చెందడంతో ఇరువర్గాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
దద్దరిల్లిన దుబ్బమరక
Published Sat, Mar 5 2016 2:34 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement