వంటింటికి వన్నె
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వంట గదిలో వెండితో చేసిన పాత్రలు, గ్లాసులుండటం దర్పానికి సంకేతం. మరి నేడో.. వంట గదిలో విలువైన లోహపు సామగ్రిని పక్కకు తోస్తూ క్రిస్టల్ వేర్స్ రంగప్రవేశం చేశాయి. వీటిని బహుమతులుగానూ ఇవ్వటం స్టేటస్ సింబల్‌గా మారింది. దీంతో ప్రస్తుతం వంట గది మరింత వన్నెలద్దుకుంటోంది.
ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, ఇటలీ, రష్యాలకు చెందిన పలు భిన్నమైన క్రిస్టల్ వేర్స్‌ని అమ్మకానికి సిద్ధం చేశారు వ్యాపారులు. చెకోస్లోవియా, రష్యా కంపెనీలైతే ఇంటిని అలంకరించుకునే క్రిస్టల్ వస్తువులను తయారుచేస్తున్నాయి.
ఈ కంపెనీలు తయారుచేస్తున్న భారీ షాండ్లీయర్లు కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తున్నాయి కూడా.
- నాణ్యమైన క్రిస్టల్ వస్తువులపై గీతలు పడవు. కింద పడినా పగలవు. వీటిని అధికమైన రాపిడికి గురి చేసినప్పుడు వెంట్రుక వాసి పరిమాణంతో నిప్పు రవ్వలను వెదజల్లుతుంది. ఇవన్నీ క్రిస్టల్ ఉత్పత్తుల నాణ్యతకు పరీక్షలు. నాణ్యమైన క్రిస్టల్ వస్తువుల్ని కళాకారులు హస్త నైపుణ్యంతో రూపొందిస్తారు. వీటి తయారీలో రసాయనాలు, యంత్రాలు వాడరు.
- డిటర్జెంట్స్, ఆమ్లాలు, స్ప్రేలను క్రిస్టల్ వస్తువులపై ఉపయోగించరాదు. ఎందుకంటే రసాయనాలు క్రిస్టల్ వస్తువుల కాంతిని, పారదర్శకతను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటితో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. నిమ్మరసం తగలరాదు. కాలక్రమంలో క్రిస్టల్ వస్తువులు లేత గులాబీ రంగులోకి మారడాన్ని రోజ్ చిప్పింగ్ అంటారు. అయితే దీన్ని సులభంగా నివారించవచ్చు. క్రిస్టల్ వస్తువులను శుభ్రం చేసిన తర్వాత వాటిపై తడి లేకుండా మెత్తని గుడ్డతో తుడిస్తే మంచిది.