విద్య, వైద్య రంగాల చుక్కాని
సందర్భం
మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నేతలలో క్యాస్ట్రో ఒకరు. గుర్తించడమే కాదు చిత్తశుద్ధితో ఆ రంగ అభివృద్ధికి పనిచేసిన నేత. అందరికీ వైద్యం.. నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు.
ప్రపంచ పటంలో అంగుళం స్థలం కూడా తీసుకోని అతి చిన్న దేశం క్యూబా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించింది. 50 ఏళ్లపాటు అమెరికా పక్కలో బల్లెంలా నిలిచింది. సైనిక బల గంతో గెలవాలని చూస్తే రెట్టిం చిన బలంతో నిటారుగా నిలి చింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాలతో మట్టు పెట్టాలని చూస్తే కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని ప్రయ త్నిస్తే వటవృక్షంలా విస్తరించింది. ఇంత చిన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది? సైనిక పహారాలతోనా, ఫిరంగుల మోతలతోనా? ఎలా సంభవమైంది?
ఇనుప సంకెళ్ళతో ఎంతోకాలం ఏ దేశం మనలేదు. భుజబలంతో ఏ రాజ్యం దీర్ఘకాల సుఖసంతోషాలను కొని తీసుకురాలేదు. క్యూబా చిన్నదేశమైనా అమెరికాలాంటి అగ్రరాజ్యం కబళించ లేకపోవడానికి కారణం మనిషి అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన వికాసం. ప్రజల బాగో గులు పట్టించుకొని వాటికే పట్టంకడితే చీమంత దేశాన్నయినా గద్దలాంటి పెద్ద దేశం ఏమీ చేయలేదని క్యూబా నిరూ పించి చూపించింది. తమ యోగక్షేమాలు చూసిన నాయకుడిని పరాయిదేశం తుద ముట్టించాలని చూస్తే ప్రజలు రక్షక కవ చంగా నిలవడంతో చిన్న దేశాల ఆత్మవి శ్వాసానికి పెద్ద సంకేతంగా మిగిలిపోయింది.
ఫిడెల్ క్యాస్ట్రో చతురంగ బలంలోను, చతుర్విధ కుయుక్తులతో ఐదు దశాబ్దాల పాటు నెట్టుకురాలేదు. మనిషి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని కల్పించేం దుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానవ వికాసానికి ప్రాతిపదికగా నిలిచే ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి శత విధాలా పనిచేశారు. ఆరోగ్య పరిరక్షణ, విద్యారంగాలపై ధనం, సమయం వెచ్చించి లాటిన్ అమెరికా దేశాలలోనే గొప్ప విజయాలు సాధించారు. అవసరంలో ఉన్న దేశాలకు నిష్ణాతులైన వైద్యులను పంపే ప్రాణదాతగా క్యూబాను క్యాస్ట్రో నిలిపారు. మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నాయకులలో కాస్ట్రో ఒకరు. ప్రపంచమంతా వైద్యరంగం వ్యాపారమయమైంది. ప్రభు త్వాలు ఎంత నియంత్రించినా కట్టడి చేయలేక పోయాయి. కానీ ఫిడెల్ క్యాస్ట్రో వైద్య రంగాన్ని పరిరక్షించుకున్నారు. అందరికీ వైద్యం అందించారు. అదీ నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ఒక వెనుకబడిన చిన్నదేశం వైద్య విద్యారంగంలో ప్రగతి సాధించి ఇతర దేశాలకు సైతం వైద్యులను పంపే స్థాయికి చేరడం ప్రపంచదేశాల ప్రశంసలందుకుంది.
విద్యకు, వైద్యానికి గల పరస్పర సంబంధాన్ని ఫిడెల్ క్యాస్ట్రో అర్థం చేసుకున్న తీరు అమోఘం. క్యూబాలో పిల్ల లకు మంచి చదువు ఇచ్చారు. చదువుకొని కళాశాల ప్రాంగ ణాలు దాటి వచ్చిన తర్వాత ఉపయోగపడాల్సిన రంగా లను గుర్తించారు. ఏయే వృత్తుల్లో నిపుణులు అవసరమో అంచనావేసి ఆ రంగాలకు తగిన కోర్సులనే చేయించారు. ముఖ్యంగా సమాజంలో వైద్యుల అవసరాన్ని గుర్తించి వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలను ప్రతిభా వంతులుగా తయారుచేయడానికి తరగతిలో ఉపాధ్యాయ బోధన, పటిష్ట విద్యా విధానంతోపాటు తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు పోషకాహారాన్ని ధనిక, పేద తారత మ్యాలు లేకుండా అందేలా చూడటంతో క్యూబా విద్యా ప్రమాణాలు గొప్పగా పెరిగాయి. 1970 దశకంలోనే క్యూబా సంపూర్ణ అక్షరాస్యతతోపాటు అధిక శాతం పట్ట భద్రులుగల దేశంగా గుర్తింపు పొందింది. 1980వ దశకం ప్రారంభంలోనే 90 శాతం మంది విద్యావంతులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన చేయగలిగిన దేశంగా ప్రశంసలందుకున్నది. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో అనుసరించిన పంథా ఇతర చిన్న చిన్న దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. పోలండ్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, సింగపూర్ దేశాలు విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చి క్యూబా తరహా విజయాల కోసం ప్రయ త్నిస్తున్నాయి.
క్యూబా ప్రజల అభ్యున్నతికి, వికా సానికి ఫిడెల్ క్యాస్ట్రో చేసిన కృషి కార ణంగానే బాహ్య శక్తులు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. క్యూబాను చావుదెబ్బ కొట్టాలని అమెరికా ఎన్ని విధాలుగా ప్రయ త్నాలు చేసినా క్యూబా ప్రతిసారీ రెట్టింపు శక్తితో లేచి నిలబడేది. పంచదార, పొగాకు, కాఫీ తదితర ఉత్పత్తులకు క్యూబా పెట్టింది పేరు. ఇతర దేశాలలో వీటికి మంచి గిరాకీ ఉండేది. కానీ వాటిని మరే దేశాలు కొనకుండా అమెరికా ఆంక్షలు విధిం చేది. అయితే నాటి సోవియట్ యూనియన్ కొండంత అండగా నిలిచేది. క్యూబా ఉత్పత్తులను తీసుకొని ఆ దేశా నికి పెట్రోల్ ఇచ్చేది. అమెరికా ఆర్థికంగాను, సైనికంగానూ క్యూబాను తొక్కేయాలని ప్రయత్నించినా ఫిడెల్ క్యాస్ట్రో తన దేశ ప్రజల అండదండలతోనే నిలబడగలిగారు. సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు క్యూబాకు క్లిష్ట పరి స్థితులు ఎదురయ్యాయి. క్యాస్ట్రోకు ప్రజలు మళ్ళీ అండగా నిలబడ్డారు. అప్పటి వరకు క్యూబా ఉత్పత్తులు తీసుకున్న సోవియట్ నుంచి సహాయం లేకపోవడంతో క్యూబా ఇక అంతమై పోయినట్టేనని అమెరికా భావించింది. అయితే క్యాస్ట్రో ఆదాయ వనరుల పెంపుదలకు పర్యాటక రంగాన్ని ఎంచుకొని వృద్ధి చేశారు. అందమైన కరీబియన్ దీవుల్లో భాగమెన క్యూబాలో పర్యాటక రంగం పుంజుకుంది.
తుపాకీ గొట్టంతోనో, సైనిక పదఘట్టనలతోనో ఏ నేతా దీర్ఘకాలం నిలవలేడు. జన హృదయ వీధుల్లో స్థానం సంపాదించిన వారే నాలుగు కాలాలపాటు మనగలుగు తారు. మానవ వికాస రంగాలను గుర్తించి వాటి అభివృ ద్ధికి, క్యూబా పురోభివృద్ధికి పాటుపడినందువల్లనే ఫిడెల్ క్యాస్ట్రో తిరుగులేని నాయకుడయ్యాడు. చిన్న దేశాల స్వాభి మానానికి చిహ్నంగా నిలిచాడు.
చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు