ఆంధ్రా బ్యాంక్ సీఎండీగా రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు మూడున్నర నెలల విరామం తర్వాత ఆంధ్రాబ్యాంక్‌కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న సి.వి.ఆర్. రాజేంద్రన్‌ని సీఎండీగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే పుణేలోని ఆంధ్రా బ్యాంక్ కార్యాలయంలో రాజేంద్రన్ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. సీఎండీ హోదాలో ఆయన తొలిసారిగా శనివారం హైదరాబాద్ రానున్నట్లు ఆంధ్రాబ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు.
సీవీసీ అనుమతుల్లో జాప్యం...
రెండు నెలల క్రితమే రాజేంద్రన్ నియామకం ఖరారైనప్పటికీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నుంచి క్లియరెన్స్ రావడంలో ఆలస్యం జరిగింది. కార్పొరేషన్ బ్యాంక్‌లో కెరీర్ ప్రారంభించిన రాజేంద్రన్‌కి అంతర్జాతీయ బ్యాంకింగ్, ఇన్వెస్ట్, మర్చెంట్ బ్యాంకింగ్ రంగాల్లో విశేష అనుభవం ఉంది.