cyberabad cyber crime police
-
ఎంఎన్సీల్లో ఉద్యోగాలంటూ అమాయకులకు టోకరా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు టోకరా వేస్తున్న కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రతిభ అలియాస్ గాయత్రి, ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉంటూ ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతుంది. తన ఫోన్ నంబర్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్టు చేసి బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా వేస్తుంది. జాబ్ కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగుల డాటాను సేకరిస్తున్న ఈ కి'లేడి'.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ తనను ఫోన్లో సంప్రదించిన వారిని నమ్మిస్తుంది. తొలుత కొంత సొమ్మును అడ్వాన్స్‌గా తీసుకొని, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యాక మొత్తం నగదును చెల్లించాల్సి ఉంటుందని షరతులు పెడుతుంది. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి, దాని ద్వారా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తుంది. జాబ్ లెటర్ ఇచ్చిన తరువాత.. ఇక తమ పని అయిపోయిందంటూ మిగిలిన సొమ్మును వసూలు చేసి, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఇలా చాలా మంది అమాయకులకు బురడీ కొట్టించిన ఈ కిలేడి, చివరకు పోలీసులకు చిక్కింది. ఈమె చేతిలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బ్యాక్ డోర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.2,42,520లు కాజేసిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కి'లేడి' ఉచ్చులో చాలామంది అమాయకులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రతిభ అలియాస్ గాయత్రికి చెందిన ఈ నంబర్ల 781 4226842, 6363506954 ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు(9490617310)కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. -
'అడిగినంత ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేస్తా'
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ మైనర్‌ను వేధిస్తున్న నిజామాబాద్‌కు చెందిన యువకున్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న సందీప్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి వారితో ప్రొఫెషనల్ చాటింగ్ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికన్ మైనర్‌తో మాటలు కలిపి మభ్యపెట్టి అభ్యంతరకర ఫోటోలను సేకరించాడు. అనంతరం న్యూడ్ ఫోటోలు పంపాలని సందీప్ బ్లాక్ మెయిల్‌కు దిగాడు. (చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి బ్లాక్మెయిల్) ఆ తర్వాత తను అడిగినంత ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని బ్లాక్ చేయడంతో న్యూడ్ ఫోటోలను స్నేహితులకు పంపాడు. దీంతో భయపడిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని, దర్యాప్తును ముమ్మరం చేశారు. (బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు) -
‘ఇన్నోసెంట్’గా మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: ఇన్నోసెంట్..పేరులో అమాయకత్వం ఉన్నా మనిషి మాత్రం మాయ దారి మోసగాడే. ఫిషింగ్ మెయిల్స్ చేసి కంపెనీ వివరాలు, ఫోన్ నంబర్ తెలుసుకుని.. దాని ద్వారా సిమ్ స్వాప్ చేసి సైలెంట్‌గా కంపెనీల బ్యాంకు ఖాతాల్ని గుల్లచేసేస్తుందీ అ‘మాయ’క బృందం. కంపెనీల ఖాతాలో డబ్బుల్ని కొల్లగొట్టే ప్రణాళికను నైజీరియాలో వేసి కోల్‌కతా కేంద్రంగా అమలుచేసి తప్పించుకునే ఎబిగో ఇన్నోసెంట్ ముఠాను అంతే చాకచక్యంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కోల్‌కతాలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై శనివారం నగరానికి తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. సిమ్ స్వాపింగ్తో స్వాహా.. నైజీరియాకు చెందిన ఎబిగో ఇన్నోసెంట్ అలియాస్ జేమ్స్ కోల్‌కతాలో ఉన్న సమయంలో ఫుట్‌బాల్ ఆడేందుకు వచ్చిన మరో నైజీరియా వాసి ఒడాఫీ హెన్రీతో 2014లో పరిచయమేర్పడింది. వీరిద్దరూ కలసి సిమ్ స్వాపింగ్ ద్వారా చేసే మోసాలకు తెరదీశారు. డబ్బుల బదిలీకి నకిలీ పేర్లతో బ్యాంక్ ఖాతాలు సమకూర్చే కోల్‌కతాకు చెందిన సంతోశ్ బెనర్జీ, రిజిష్టర్డ్ సెల్‌నంబర్ వివరాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లు, చిరునామాలు సృష్టించి డూప్లికేట్ సిమ్ సంపాదించే రాజత్ కుందులను హెన్రీకి పరిచయం చేశాడు. అనంతరం నైజీరియాకు వెళ్లిపోయిన ఎబిగో ఇన్నోసెంట్ హ్యాకర్లు హ్యాక్ చేసిన కంపెనీ వివరాలను డార్క్‌నెట్‌లో కొనుగోలు చేశాడు. భారత్‌లోని కంపెనీల ఈ–మెయిల్స్‌కు ఫిషింగ్ మెయిల్స్ పంపించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల వివరాలు, రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, కంపెనీ పేరు, చిరునామాలను సేకరించి హెన్రీ, రాజత్ కుందు, సంతోశ్ బెనర్జీలకు చేరవేసేవాడు. మొబైల్ టెలికామ్ స్టోర్స్‌లో రాజత్ కుందు తనకు పరిచయమున్న వారి ద్వారా మొబైల్ నంబర్ వివరాలు తెలుసుకునేవాడు. కంపెనీకి చెందిన రబ్బర్ స్టాంప్‌ను తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోల్‌కతాకు చెందిన చందన్ వర్మకు ఇచ్చేవాడు. అతడు సంజీవ్ దాస్ అనే వ్యక్తితో కలిసి వెళ్లి బాధితుడి సిమ్‌కు నకిలీ సిమ్ తీసుకునేవాడు. అలసత్వంతో లక్షలు పోగొట్టుకున్నా.. 2017 జూన్ 17న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నా సెల్‌నంబర్ పనిచేయడం ఆగింది. ఎయిర్టెల్ కాల్‌సెంటర్‌కు కాల్ చేస్తే మీ నంబర్ పనిచేస్తుందని చెప్పారు. సోమవారం ఆ కంపెనీ మొబైల్ స్టోర్స్‌కు వెళితే మీ సిమ్ యాక్టివ్‌లోనే ఉంది. మీరు డూప్లికేట్ సిమ్ తీసుకున్నారా అని తిరిగి ప్రశ్నించారు. ఆధార్‌కార్డు, ఫింగర్ ప్రింట్ తీసుకొని మళ్లీ డూప్లికేట్ సిమ్ ఇచ్చారు. అయితే అప్పటికే నా సెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా రూ.24 లక్షల నగదు బదిలీలు కోల్‌కతాలోని బ్యాంక్‌లకు వెళ్లాయని తెలిసింది. సరైన తనిఖీ లేకుండా డూప్లికేట్ సిమ్ జారీ చేసిన సంస్థపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. –గిరి, సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారమే...పని కానిచ్చేస్తారు ఆయా టెలికం స్టోర్స్ నుంచి అసలు సిమ్ కార్డులకు డూప్లికేట్లను శనివారాల్లోనే పొంది సాయంత్రానికల్లా రాజత్ కుందుకు చేర్చేవారు. అతడు అదేరోజు దానిని యాక్టివ్ చేసేవాడు. దీంతో ఆ కంపెనీలకు చెందిన వారి సెల్ నంబర్ల సేవలు రాత్రి ఎనిమిది గంటల సమయంలో నిలిచేపోయేవి. సెల్ సిగ్నల్స్ సరిగా లేవని భావించిన కంపెనీ యజమానులు తిరిగి సోమవారం లోపు ఆయా టెలికం స్టోర్స్‌కు వెళ్లేలోపు వీరి బ్యాంక్ ఖాతాల నుంచి దశలవారీగా నగదు ఖాళీ అయిపోయేది. అనంతరం కొంత డబ్బును వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడంతో పాటు దుకాణాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలుచేసేవారు. వీటిని సంతోశ్ బెనర్జీ విక్రయించి నగదు రూపంలోకి మార్చి హెన్రీకి అప్పగించేవాడు. అనంతరం ఈ డబ్బుతో బట్టలు, వస్తువులు కొనుగోలు చేసి నైజీరియాలోని ఇన్నోసెంట్‌కు పంపేవారు. దొంగలు దొరికారిలా.. ఈ విధంగానే నగరంలో ఎలిమ్ కెమికల్స్, షాలోమ్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల నుంచి రూ. తొమ్మిది లక్షలు ఖాళీ కావడంతో చింతల్‌కు చెందిన వాటి యజమాని వెంకటకృష్ణ గతేడాది డిసెంబర్ 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంక్‌ఖాతా వివరాలతో పాటు సెల్‌నంబర్ల లోకేషన్ ఆధారంగా కోల్‌కతాలో ఉంటున్న ఆరుగురు నిందితులను అక్కడే అరెస్టు చేశారు. వీరి నుంచి 17 సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు పాస్‌పోర్టులు, డెబిట్‌కార్డులు, ఆధార్‌కార్డులు, లామినేషన్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు చెన్నై,కోల్‌కతా,అహ్మదాబాద్, ఢిల్లీలోని 11 పరిశ్రమలను చీటింగ్ చేసినట్టు విచారణలో తేలింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులు.. గతంలో నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.24 లక్షలు మోసం చేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల్లో ఒకడైన సంతోష్ బెనర్జీని 2015లో ఇటువంటి కేసులో జైపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ సజ్జనార్ అన్నారు. కాగా ఇందులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎబిగో ఇన్నోసెంట్‌ను పట్టుకునేందుకు నైజీరియాకు లేఖ రాస్తామని తెలిపారు. వెరిఫికేషన్ లేకుండా సిమ్ జారీ చేసిన సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కాల్‌గర్ల్ అని సోషల్ మీడియాలో పోస్టులు.. టెకీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమను నిరాకరించి మరో యువకుడిని వివాహం చేసుకున్న యువతి పరువు ప్రతిష్టలను దిగజార్చేందుకు ఆన్లైన్లో వేధింపులకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సందీప్ కుమార్ గుప్తా పెరుమల్ల తన పేరున నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అసభ్యకర సందేశాలు పోస్టు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో (లోకోంటో, బ్లాగ్ స్పాట్)లో కాల్‌గర్ల్‌గా పోస్టు చేసి వేధిస్తున్నాడంటూ ఓ వివాహిత సోమవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు కాల్‌డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మియాపూర్‌లోని కూకట్పల్లి 16వ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు
హైదరాబాద్: తాళి కట్టిన భర్తే విచక్షణ మరిచాడు. భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అతగాడు స్నేహితుడికి పంపిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్నఓ మహిళ తన భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పడకగదిలో సన్నివేశాలను తన భర్త ఆన్లైన్ ద్వారా చెన్నైలోని తన స్నేహితుడు శ్రీమన్కు పంపిస్తున్నట్లు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు. లాప్‌ట్యాప్‌తో పాటు అతడి ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కృష్ణ చైతన్య, శ్రీమన్ పరస్పరం తమ భార్యల న్యూడ్ ఫోటోలను స్కైప్ ద్వారా పంపుకునేవారిని వెల్లడించారు. కాగా కృష్ణచైతన్య ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడి ఫోన్లో వెతకగా, ఈ వీడియోలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే శ్రీమన్ కోసం పోలీసులు చెన్నై బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైబర్ పోకిరీకి అరదండాలు
హైదరాబాద్: అమెరికాలో పీహెచ్డీ చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వివాహితను ఆన్ లైన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్న సైబర్ పోకిరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితురాలు కేవలం ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణం స్పందించిన అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని కటకటాల్లోకి పంపడం విశేషం. మహారాష్ట్రలోని సాంఘ్లీ ప్రాంతానికి చెందిన వివాహిత 2007లో హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో (ఇఫ్లూ) ఫ్రెంచ్ భాషలో పీజీ చేశారు. ఆ సమయంలో రిఫరెన్స్ కోసం తరచూ ఇఫ్లూ లైబ్రరీకి వెళ్ళేవారు. అప్పట్లో ఉస్మానియాలో ఇంగ్లీష్‌లో ఎంఫిల్ చేస్తున్న వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన దేవతల మనోహర్ డేవిడ్ మాథ్యూస్ ఇఫ్లూ లైబ్రరీలో ఆమెను చూసి ఇతరుల ద్వారా పేరు తెలుసుకున్నాడు. కాగా సదరు మహిళకు అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్డీ (ఫ్రెంచ్ సాహిత్యం) చేసే అవకాశం రావడంతో అక్కడకు వెళ్ళారు. డేవిడ్ మాథ్యూస్ విద్యాభ్యాసం తర్వాత ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బోధకుడిగా చేరాడు. ఇఫ్లూ లైబ్రరీలో కనిపించిన ఆమె ఆపై కనిపించకపోవడంతో ఆమె కోసం ‘వెతకడం’ ప్రారంభించాడు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ లో ఆ వివాహిత పేరుతో భారీ సెర్చ్ చేసిన డేవిడ్ మాథ్యూస్ చివరకు ఆర్కూట్ ద్వారా ఆమె మెయిల్ ఐడీ తెలుసుకున్నాడు. దీనికి తన మెయిల్ ఐడీ నుంచి దాదాపు 200 అసభ్యకర, అభ్యంతరకర సందేశాలు పంపాడు. తనతో స్నేహం చేయాలని, హైదరాబాద్ వచ్చి సన్నిహితంగా ఉండాలని బెదిరించాడు. తాను వివాహితనని, తనకు స్నేహం చేసే ఆసక్తి లేదని ఆమె నుంచి బదులు రావడంతో డేవిడ్ మాథ్యూస్ మరింత రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఈ నెల ఏడున ఈ–మెయిల్ ద్వారా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సంయుక్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరామ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉంటున్న డేవిడ్ మాథ్యూస్ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ పోకిరి బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే 9490617347 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.