సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు టోకరా వేస్తున్న కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రతిభ అలియాస్ గాయత్రి, ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉంటూ ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతుంది. తన ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్టు చేసి బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా వేస్తుంది.
జాబ్ కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగుల డాటాను సేకరిస్తున్న ఈ కి'లేడి'.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ తనను ఫోన్‌లో సంప్రదించిన వారిని నమ్మిస్తుంది. తొలుత కొంత సొమ్మును అడ్వాన్స్‌గా తీసుకొని, ఉద్యోగం కన్‌ఫర్మ్ అయ్యాక మొత్తం నగదును చెల్లించాల్సి ఉంటుందని షరతులు పెడుతుంది. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి, దాని ద్వారా నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు పంపిణీ చేస్తుంది. జాబ్ లెటర్ ఇచ్చిన తరువాత.. ఇక తమ పని అయిపోయిందంటూ మిగిలిన సొమ్మును వసూలు చేసి, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుంది.
ఇలా చాలా మంది అమాయకులకు బురడీ కొట్టించిన ఈ కిలేడి, చివరకు పోలీసులకు చిక్కింది. ఈమె చేతిలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బ్యాక్ డోర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.2,42,520లు కాజేసిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కి'లేడి' ఉచ్చులో చాలామంది అమాయకులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రతిభ అలియాస్ గాయత్రికి చెందిన ఈ నంబర్ల 781 4226842, 6363506954 ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు(9490617310)కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment