
సాక్షి, హైదరాబాద్ : ప్రేమను నిరాకరించి మరో యువకుడిని వివాహం చేసుకున్న యువతి పరువు ప్రతిష్టలను దిగజార్చేందుకు ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సందీప్ కుమార్ గుప్తా పెరుమల్ల తన పేరున నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అసభ్యకర సందేశాలు పోస్టు చేస్తున్నాడు.
అంతటితో ఆగకుండా తనతో పాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో (లోకోంటో, బ్లాగ్ స్పాట్)లో కాల్‌గర్ల్‌గా పోస్టు చేసి వేధిస్తున్నాడంటూ ఓ వివాహిత సోమవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు కాల్‌డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మియాపూర్‌లోని కూకట్‌పల్లి 16వ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment