Dana Majhi
-
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
కలహండి : సరిగ్గా ఏడాది క్రితం ఓ వ్యక్తి చనిపోయిన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కూతురితో కలిసి 10 కిలో మీటర్లు పైగా నడిచిన ఒడిశా వ్యక్తి కథనం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆంబులెన్స్‌ను నిరాకరించగా.. దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబ పెద్ద దనా మాఝీ అలా చేశాడంటూ చెప్పుకున్నాం. కానీ, అదే దనా మాఝీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీస్తే విస్తూ పోవాల్సిందే. మళ్లీ పెళ్లి చేసుకున్న ఆయన ప్రధాన మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన కింద ఓ ఇంటిని కట్టేసుకున్నాడు. పలువురు దాతలు అందించిన సహకారంతో ఇప్పుడు అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. అందులో బహ్రైన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీపా అందించిన 9 లక్షల సాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేని అతను ఫిక్స్డ్ డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేశాడు. భువనేశ్వర్‌లో అతని ముగ్గురి కూతుళ్లకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తోంది. గతేడాది ఆగష్టు లో అతని ఉదంతం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 16 నెలల తర్వాత తన భార్య శవంతో నడిచిన అదే రోడ్డుపై 65 వేలు పెట్టి బైక్‌ను కొని నడిపి మరోసారి ధనా మాఝీ వార్తల్లోకెక్కాడు. మొత్తానికి ఆ ఘటన తన లైఫ్‌ను మార్చేసి లక్షాధికారిని చేసిందంటూ మాఝీ ఆనందంగా చెబుతున్నాడు. -
భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం
భువనేశ్వర్: అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన 'భార్య శవాన్ని మోస్తూ 10 కిలోమీటర్ల నడక' ఉదంతంలో 'అసలు నిజం ఇదీ..' అంటూ ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక సమాధానం సంచలనంగా మారింది. కలహండి జిల్లాలో ఆగస్టులో చోటుచేసకున్న ఈ సంఘటనలో భార్య శవాన్ని మోసుకెళ్లిన దనా మాంఝి ఏ ఒక్కరినీ సహాయం అడగలేదని, చనిపోయినట్లు అధికారికంగా నిర్ధారించకముందే చెప్పాపెట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లాడని ప్రభుత్వం పేర్కొంది. (చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..) ఆసుపత్రిలోని ఇతర రోగులు, ప్రత్యక్ష సాక్షల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఒక రిపోర్టును తయారుచేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అతాను సబ్యసాచి ఆ రిపోర్టును శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. మాంఝి వ్యవహారంపై ప్రభుత్వ స్పందన కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ కు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో.. దనా మాంఝి తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లు ఆసుపత్రికి సిబ్బందికి చెప్పలేదని, ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానో లేక రెడ్ క్రాస్ నిధి ద్వారానో సహాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (నిర్దయ భారతం) మరణ ధృవీకరణ జరగకముందే, హడావిడిగా మాంఝీ తన భార్యను తీసుకెళ్లడం వల్లే ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కిందని, ఒకరు భుజాలపై శవాన్ని మోసుకెళుతున్నాడన్న సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపామని వైద్యాధికారి నివేదికలో తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్టాఫ్ నర్స్ రాజేంద్ర రాణాను డిస్మిస్ చేయగా, సెక్యూరిటీ సంస్థకు తాఖీదులిచ్చామని పేర్కొన్నారు. పేదరికంలో మగ్గిపోతున్న మాంఝి కుటుంబానికి పలు స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ప్రకటించాయి. -
నిర్దయ భారతం
కుజ గ్రహాన్ని పరిశోధించేందుకు రాకెట్‌ను ప్రయోగించిన ఖ్యాతి మనది. ప్రపంచ దిగ్గజ దేశాలతో పోటీపడుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. అయినా.. నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో కునారిల్లుతున్నాం. అమాయకత్వం.. కడుపేదరికంతో మన దేశ గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారనడానికి ఈ చిత్రం ప్రత్యక్ష నిదర్శనం. ఒడిశాలోని కలహండి జిల్లాలో భార్య శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన ఓ భర్త వార్తకు సంబంధించిన ఫొటోను చూసి నెటిజన్ల హృదయం ఆర్ద్రమైంది. ఆ భర్త నడిచిన తీరును భారతదేశ పటంలా చిత్రించి ఓ నెటిజన్ తన వేదనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇపుడు ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతూ.. మన దేశ విధానాలను ప్రశ్నిస్తోంది. -
చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..
-
చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..
భువనేశ్వర్: చనిపోయిన తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు వాహనం అందుబాటులో లేక ఓ వ్యక్తి భుజాన వేసుకొని ఆస్పత్రి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఊరుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. వివరాల్లోకి వెళితే మేఘారా అనే గ్రామంలో దనమాజి(42), అమాంగ్ దేయి గిరిజన దంపతులు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. ఇటీవల ఆ వ్యాధి ముదరడంతో చికిత్స కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భవానిపాట్నా ప్రభుత్వ ఆస్పత్రికొచ్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలువిడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం. కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి సహకరించలేదు. దీంతో తన భార్య మృతదేహాన్ని కొన్ని దుస్తుల్లో చుట్టి భుజాన వేసుకొని 60 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి కూతురుతో సహా బయలుదేరాడు. అలా పది కిలో మీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగితా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.