వాళ్లు లేకుంటేనే ఢిల్లీకి మంచిది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: హస్తినలోని కేజ్రీవాల్ సర్కార్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మళ్లీ ఘర్షణ మొదలైంది. ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్ (డానిక్స్) అధికారుల విషయంలో మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విరుచుపడ్డారు. ఐఏఎస్ అధికారులు బీజేపీకి 'బీ టీమ్'లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇటు ప్రధాన కార్యాలయంతో టచ్లో ఉంటూనే అటు డానిక్స్ అధికారుల అసోసియేషన్ సమావేశంలోనూ పాల్గొంటున్నారని మండిపడ్డారు.
డానిక్స్ అధికారులైన సుభాష్ చంద్ర, యశ్పాల్ గార్గ్లను కేజ్రీవాల్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జైళ్లశాఖ సిబ్బంది జీతాలు పెంచుతూ ఢిల్లీ కేబినెట్ జారీచేసిన పత్రాలపై వారు సంతకాలు చేయడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్రం స్పష్టం చేయడంతో వివాదం రాజుకుంది. మరోవైపు సహచర అధికారుల సస్పెన్షన్ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు గురువారం మూకుమ్మడిగా సామూహిక సెలవు పెట్టారు. శుక్రవారం (జనవరి 1) నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న సరి-బేసి నెంబర్ప్లేట్ల పథకం నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున సెలవుపై వెళ్లడం కేజ్రీవాల్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందిస్తూ ' ఆ అధికారులు దీర్ఘకాలపు సెలవుపై వెళితే ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ప్రభుత్వం వారికి వేతన సెలవు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల పరిపాలన నిజాయితీగా, సమర్థంగా సాగుతుంది' అని పేర్కొన్నారు.