Dark Net
-
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
హెచ్‌సీయూలో మత్తు దందా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు రట్టు చేశారు. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి డార్క్‌నెట్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ (చిన్న టాబ్లెట్ మాదిరిగా ఉండే మత్తుపదార్థం) ఖరీదు చేసి విక్రయిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డార్క్‌నెట్‌పై నిఘాతో పట్టుకున్న తొలి కేసు ఇదేనని తెలిపారు. అరెస్టయిన, వాంటెడ్‌గా ఉన్న వారిలో యువతులూ ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. బిట్కాయిన్ల రూపంలో చెల్లింపు గాజులరామారానికి చెందిన విఘ్నేష్ హెచ్‌సీయూలో చదువుతున్నాడు. తన స్నేహితుల ద్వారా డార్క్‌నెట్‌పై పట్టు సంపాదించాడు. అందులోని గ్రూపుల్లో చేరి ఎల్ఎస్డీ బ్లాట్స్ ఖరీదు చేస్తూ బిట్కాయిన్ల రూపంలో నగదు చెల్లిస్తున్నాడు. ఆ డ్రగ్ కొరియర్ ద్వారా ఇతడికి వచ్చి చేరుతోంది. జనవరిలో 20 బ్లాట్స్ కొన్న విఘ్నేష్ పది మంది స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించాడు. అందులో ఇతడితో పాటు అనుదీప్, తేజస్వీ కుమార్ (ఐటీ ఉద్యోగులు), నిఖిల్ (జంషెడ్‌పూర్‌లో ఎంబీఏ విద్యార్థి), ప్రీతమ్ (ఇటీవలే అమెరికా వెళ్లాడు), వంశీ (హెచ్‌సీయూ విద్యార్థి), రాహుల్, తేజ, సుష్మ (బీటెక్ విద్యార్థులు), ఎలిజబెత్ (హెచ్‌సీయూ విద్యార్థిని) ఉన్నారు. రూ. 3 వేలకు విక్రయం ►ఇటీవల మరో పది బ్లాట్స్ ఖరీదు చేసిన విఘ్నేష్ వాటిని బీకాం విద్యార్థి నాగార్జున్‌రెడ్డికి విక్రయించాడు. ఇతడి నుంచి వీటిని ఐటీ ఉద్యోగి వనం సాయి బాలాజీతోపాటు డిగ్రీ విద్యార్థిని చైత్ర వర్మ ఖరీదు చేశారు. చైత్ర తానే వినియోగించగా... సాయి బాలాజీ మాత్రం ఐటీ ఉద్యోగి హేమంత్, తేజస్వీ కుమార్‌లకు విక్రయించి, కొంత వినియోగించాడు. ►డార్క్ నెట్లో ఒక్కో బ్లాట్ను రూ.600 ఖరీదు చేస్తున్న విఘ్నేష్ ఇతరులకు రూ.3 వేలకు విక్రయిస్తున్నాడు. చిన్న టాబ్లెట్ మాదిరిగా ఉండే బ్లాట్స్ను వినియోగిస్తే దాదాపు ఆరు గంటలపాటు మత్తులో జోగుతారు. కొన్నాళ్లుగా వీరం తా ఈ డ్రగ్‌కు అలవాటుపడి బానిసలుగా మారా రు. ఈ డ్రగ్‌ను వీళ్లు తమ స్నేహితుల ఇళ్లలో జరిగే రేవ్ పార్టీల్లో లేదా కార్లలో సేవిస్తున్నారు. ఆపై పబ్స్‌కు వెళ్లి ట్రాన్స్ మ్యూజిక్ ఏర్పాటు చేయించుకుని మరో లోకంలో తేలుతున్నారు. ►వీరి వ్యవహారాలపై హెచ్–న్యూకు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలతో కూడిన బృందం వరుస దాడులు చేసింది. విఘ్నేష్, చైత్ర, నాగార్జున్‌రెడ్డి, హేమంత్, బాలాజీ, అనుదీప్, తేజస్విలను అరెస్టు చేసింది. వీరి నుంచి 19 బ్లాట్స్ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తోంది. -
డేంజరస్ ‘డార్క్ నెట్’
* ఉగ్రమూకలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆధారాలు * ‘తమ వారికి’ మాత్రమే కనిపించేలా ఆన్లైన్లో మరో ప్రపంచం * దీని ద్వారానే సాంకేతిక నిపుణులు, విద్యావంతులకు వల * దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న నిఘా వర్గాలు * అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఈ-మెయిల్, ఫేస్బుక్, ట్విటర్.. ఇవన్నీ ఇంటర్నెట్లో మనందరికీ కనిపించేవే. కంప్యూటర్లలో సాధారణంగా వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు, సోషల్ మీడియా అందరికీ తెలిసినవే. ఉగ్ర మూకలు వీటి ద్వారా సమాచార మార్పిడి చేసినా, సంప్రదింపులు జరిపినా నిఘా వర్గాలు గుర్తించి కుట్రలు భగ్నం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముష్కర మూకలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో పట్టులేని ‘డార్క్ నెట్’లో విస్తరిస్తున్నాయి. దీంతో ఎలాంటి నిఘాకూ చిక్కకుండా, ‘తమ వారికి’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా ఉగ్రమూకలు ఆన్లైన్లో మరో ప్రపంచాన్ని వినియోగిస్తున్నాయి. దీన్నే సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ నెట్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, విద్యాధికుల్నీ తమ వైపు ఆకర్షిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) తరహా ఉగ్రవాద సంస్థలు ఈ నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం రూ. 1.5 కోట్లతో అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. వీటితో డార్క్ నెట్‌కు చెక్ పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. టెయిల్స్ ఆపరేషన్ సిస్టంతో.. ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. అందులో వెబ్సైట్లను చూడటం, యాక్సెస్ చేయడం కుదరదు. ఈ జగత్తులో అడుగు పెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న ముష్కర మూకలు యథేచ్ఛగా సమాచార మార్పిడి చేసుకుంటున్నాయన్నది నిఘా వర్గాలు గుర్తించిన అంశం. సాధారణ వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా పనిచేయడానికి వాటికి ఇంటర్నెట్లో ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాలి. అయితే నిఘా వర్గాలు ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? నిర్వహిస్తున్నది ఎవరు? తదితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు లేకపోవడం అసాంఘిక శక్తులకు కలసి వస్తున్న అంశం. ఫలితాలిస్తున్న ‘చక్రవ్యూహ్’.. ఆన్లైన్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తూ భారీ రిక్రూట్మెంట్, భావజాల ప్రచారం చేస్తున్న ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్ర సంస్థల్ని అడ్డుకోవడానికి కేంద్రం ఆధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) ‘ఆపరేషన్ చక్రవ్యూహ్’ పేరుతో సాంకేతిక నిఘాను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎస్ సానుభూతిపరులు, భారత్‌ను వదిలి సిరియా వెళ్లాలని యత్నించిన వ్యక్తుల్ని గుర్తించి, అదుపు చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక సర్వర్లు, సామాజిక మాధ్యమాల్లోని అకౌంట్లపై అనునిత్యం కన్నేసి ఉంచుతున్న ఎన్టీఆర్వో ఆయా పోలీసు, నిఘా వర్గాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ స్పెషల్ టీమ్ ఎన్టీఆర్వోతో కలసి పనిచేస్తోందని తెలిసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పట్టుబడిన ఐఎస్ సానుభూతిపరులు, ఇతర ఉగ్రవాదులను గుర్తించడంతో ‘చక్రవ్యూహ్’ పాత్ర కీలకమని రాష్ట్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.