హెచ్‌సీయూలో మత్తు దందా Hyderabad Police Warns University Students Involved In Drug Rackets | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో మత్తు దందా

Published Sun, Feb 27 2022 3:01 AM

Hyderabad Police Warns University Students Involved In Drug Rackets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా గుట్టును సిటీ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు రట్టు చేశారు. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్‌ పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి డార్క్‌నెట్‌ నుంచి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ (చిన్న టాబ్లెట్‌ మాదిరిగా ఉండే మత్తుపదార్థం) ఖరీదు చేసి విక్రయిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

హెచ్‌–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డార్క్‌నెట్‌పై నిఘాతో పట్టుకున్న తొలి కేసు ఇదేనని తెలిపారు. అరెస్టయిన, వాంటెడ్‌గా ఉన్న వారిలో యువతులూ ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. 

బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపు 
గాజులరామారానికి చెందిన విఘ్నేష్‌ హెచ్‌సీయూలో చదువుతున్నాడు. తన స్నేహితుల ద్వారా డార్క్‌నెట్‌పై పట్టు సంపాదించాడు. అందులోని గ్రూపుల్లో చేరి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ ఖరీదు చేస్తూ బిట్‌కాయిన్ల రూపంలో నగదు చెల్లిస్తున్నాడు. ఆ డ్రగ్‌ కొరియర్‌ ద్వారా ఇతడికి వచ్చి చేరుతోంది. జనవరిలో 20 బ్లాట్స్‌ కొన్న విఘ్నేష్‌ పది మంది స్నేహితులతో కలిసి రేవ్‌ పార్టీ నిర్వహించాడు.

అందులో ఇతడితో పాటు అనుదీప్, తేజస్వీ కుమార్‌ (ఐటీ ఉద్యోగులు), నిఖిల్‌ (జంషెడ్‌పూర్‌లో ఎంబీఏ విద్యార్థి), ప్రీతమ్‌ (ఇటీవలే అమెరికా వెళ్లాడు), వంశీ (హెచ్‌సీయూ విద్యార్థి), రాహుల్, తేజ, సుష్మ (బీటెక్‌ విద్యార్థులు), ఎలిజబెత్‌ (హెచ్‌సీయూ విద్యార్థిని) ఉన్నారు.  

రూ. 3 వేలకు విక్రయం 
ఇటీవల మరో పది బ్లాట్స్‌ ఖరీదు చేసిన విఘ్నేష్‌ వాటిని బీకాం విద్యార్థి నాగార్జున్‌రెడ్డికి విక్రయించాడు. ఇతడి నుంచి వీటిని ఐటీ ఉద్యోగి వనం సాయి బాలాజీతోపాటు డిగ్రీ విద్యార్థిని చైత్ర వర్మ ఖరీదు చేశారు. చైత్ర తానే వినియోగించగా... సాయి బాలాజీ మాత్రం ఐటీ ఉద్యోగి హేమంత్, తేజస్వీ కుమార్‌లకు విక్రయించి, కొంత వినియోగించాడు.

డార్క్‌ నెట్‌లో ఒక్కో బ్లాట్‌ను రూ.600 ఖరీదు చేస్తున్న విఘ్నేష్‌ ఇతరులకు రూ.3 వేలకు విక్రయిస్తున్నాడు. చిన్న టాబ్లెట్‌ మాదిరిగా ఉండే బ్లాట్స్‌ను వినియోగిస్తే దాదాపు ఆరు గంటలపాటు మత్తులో జోగుతారు. కొన్నాళ్లుగా వీరం తా ఈ డ్రగ్‌కు అలవాటుపడి బానిసలుగా మారా రు. ఈ డ్రగ్‌ను వీళ్లు తమ స్నేహితుల ఇళ్లలో జరిగే రేవ్‌ పార్టీల్లో లేదా కార్లలో సేవిస్తున్నారు. ఆపై పబ్స్‌కు వెళ్లి ట్రాన్స్‌ మ్యూజిక్‌ ఏర్పాటు చేయించుకుని మరో లోకంలో తేలుతున్నారు.  

వీరి వ్యవహారాలపై హెచ్‌–న్యూకు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలతో కూడిన బృందం వరుస దాడులు చేసింది. విఘ్నేష్, చైత్ర, నాగార్జున్‌రెడ్డి, హేమంత్, బాలాజీ, అనుదీప్, తేజస్విలను అరెస్టు చేసింది. వీరి నుంచి 19 బ్లాట్స్‌ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తోంది.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement