డేంజరస్ ‘డార్క్ నెట్’
* ఉగ్రమూకలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆధారాలు
* ‘తమ వారికి’ మాత్రమే కనిపించేలా ఆన్‌లైన్‌లో మరో ప్రపంచం
* దీని ద్వారానే సాంకేతిక నిపుణులు, విద్యావంతులకు వల
* దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న నిఘా వర్గాలు
* అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ట్విటర్.. ఇవన్నీ ఇంటర్నెట్‌లో మనందరికీ కనిపించేవే. కంప్యూటర్లలో సాధారణంగా వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా అందరికీ తెలిసినవే. ఉగ్ర మూకలు వీటి ద్వారా సమాచార మార్పిడి చేసినా, సంప్రదింపులు జరిపినా నిఘా వర్గాలు గుర్తించి కుట్రలు భగ్నం చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ముష్కర మూకలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో పట్టులేని ‘డార్క్ నెట్’లో విస్తరిస్తున్నాయి. దీంతో ఎలాంటి నిఘాకూ చిక్కకుండా, ‘తమ వారికి’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా ఉగ్రమూకలు ఆన్‌లైన్‌లో మరో ప్రపంచాన్ని వినియోగిస్తున్నాయి. దీన్నే సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ నెట్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, విద్యాధికుల్నీ తమ వైపు ఆకర్షిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్‌ఐఎస్) తరహా ఉగ్రవాద సంస్థలు ఈ నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం రూ. 1.5 కోట్లతో అత్యాధునిక హ్యాకింగ్ టూల్స్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. వీటితో డార్క్ నెట్‌కు చెక్ పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.
టెయిల్స్ ఆపరేషన్ సిస్టంతో..
ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. అందులో వెబ్‌సైట్లను చూడటం, యాక్సెస్ చేయడం కుదరదు. ఈ జగత్తులో అడుగు పెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్‌స్టాల్ అవుతుంది.
వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న ముష్కర మూకలు యథేచ్ఛగా సమాచార మార్పిడి చేసుకుంటున్నాయన్నది నిఘా వర్గాలు గుర్తించిన అంశం. సాధారణ వెబ్‌సైట్లతో పాటు సోషల్ మీడియా పనిచేయడానికి వాటికి ఇంటర్నెట్‌లో ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాలి. అయితే నిఘా వర్గాలు ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? నిర్వహిస్తున్నది ఎవరు? తదితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు లేకపోవడం అసాంఘిక శక్తులకు కలసి వస్తున్న అంశం.
ఫలితాలిస్తున్న ‘చక్రవ్యూహ్’..
ఆన్‌లైన్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తూ భారీ రిక్రూట్‌మెంట్, భావజాల ప్రచారం చేస్తున్న ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్ర సంస్థల్ని అడ్డుకోవడానికి కేంద్రం ఆధీనంలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) ‘ఆపరేషన్ చక్రవ్యూహ్’ పేరుతో సాంకేతిక నిఘాను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎస్ సానుభూతిపరులు, భారత్‌ను వదిలి సిరియా వెళ్లాలని యత్నించిన వ్యక్తుల్ని గుర్తించి, అదుపు చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది.
దేశవ్యాప్తంగా అనేక సర్వర్లు, సామాజిక మాధ్యమాల్లోని అకౌంట్లపై అనునిత్యం కన్నేసి ఉంచుతున్న ఎన్టీఆర్వో ఆయా పోలీసు, నిఘా వర్గాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఓ స్పెషల్ టీమ్ ఎన్టీఆర్వోతో కలసి పనిచేస్తోందని తెలిసింది. ఇటీవల దేశవ్యాప్తంగా పట్టుబడిన ఐఎస్ సానుభూతిపరులు, ఇతర ఉగ్రవాదులను గుర్తించడంతో ‘చక్రవ్యూహ్’ పాత్ర కీలకమని రాష్ట్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.