వాట్సాప్‌కు ఎదురుదెబ్బ
ప్రముఖ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందటి ప్రైవసీ పాలసీ ఆధారంగా 2016 సెప్టెంబర్ 25వరకు సేకరించిన యూజర్ల సమాచారాన్ని ఫేస్బుక్ లేదా మరే ఇతర కంపెనీకి షేరు చేయడానికి వీలులేదని హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జీ రోహిణి నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చాక వాట్సాప్‌ను వాడకూడదని నిర్ణయించుకున్న యూజర్ల డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని కూడా ఆదేశించింది.యూజర్లు కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చుకోవడానికి వాట్సాప్ 30 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గడువు సెప్టెంబర్ 25తో ముగియనుంది.
ఈ కొత్త ప్రైవసీ పాలసీ విధానం ద్వారా యూజర్ల సమాచారాన్ని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ షేరు చేయనుంది. ఫేస్‌బుక్‌తో తమ సమాచారాన్ని షేరు చేసుకోవడానికి ఇష్టపడని వారు అకౌంట్ డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నట్టు బెంచ్ సభ్యులు జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ తెలిపారు. అదేవిధంగా వాట్సాప్ లాంటి ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులను చట్టబద్ధమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డేటా షేరింగ్‌ను సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు కర్మాన్య సింగ్ సరీన్, శ్రేయ సేతీలు ఢిల్లీ హైకోర్టు గడపతొక్కారు. విద్యార్థుల ఫిర్యాదుపై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రతిభా ఎమ్ సింగ్ వాదనలు వినిపించారు.