వృద్ధిబాటలో ఉన్నది మనమే
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా భారత్లో వేగంగా అభివృద్ధి
♦ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇవే చెబుతున్నాయి
♦ దయానంద్ సరస్వతి జయంతి కార్యక్రమంలో మోదీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే భారత్ మాత్రమే తమ ప్రభుత్వ విధానాల కారణంగానే అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకెళ్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సహా అందరూ ఇదే చెబుతున్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే కేవలం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పెద్ద ఆర్థిక దేశాల్లోకెల్లా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా నిలిచినట్లు ప్రపంచ దేశాల ప్రజలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.
1875లో ఆర్య సమాజ్ను స్థాపించిన స్వామి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ముద్ర పథకం ద్వారా 2 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందారని, రూ. లక్ష కోట్లకుపైగా ఆర్థిక తోడ్పాటు అందించామన్నారు. 21వ శతాబ్దం విజ్ఞాన శకమని...విజ్ఞాన రంగంలో భారత్ యావత్ ప్రపంచానికి సారథ్యం వహించిందని గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం ఉండగా తాము వ్యక్తిగత రంగాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఉద్యోగాలు కోరుకునే వారిలా కాకుండా ఉద్యోగాలిచ్చేలా ఎదిగేందుకు స్వీయ సమృద్ధి, స్వీయ ఉపాధి సాధించాలన్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని...అందువల్ల దేశాభివృద్ధికి యువత శక్తిని ఉపయోగించుకోవడంపై దృష్టిసారించామన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టి దాని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని తెలిపారు.