గడువు పెంపు!
అమలాపురం :గోదావరి డెల్టా పంట కాలువల మూసివేత గడువు పెంచనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 31 నుంచి కాలువలు మూసివేయాల్సి ఉంది. కానీ డెల్టాలో రబీ సాగు ఆలస్యం అవుతున్నందున ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈమేరకు గడువు పెంచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని తూర్పు, మధ్యడెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ) పరిధిలోని సుమారు 3.30 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. గోదావరిలో నీటి ఎద్దడి ఉన్నందున డిసెంబరు 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని, మార్చి 31 నాటికి కాలువలు మూసివేస్తామని అధికారులు తొలి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇలా చేస్తేనే డెల్టా ఆధునికీకరణ పనులు ఎంతోకొంత పూర్తవుతాయని వారంటున్నారు.
రబీ సాగుకు ముందు కాకినాడలో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఇందుకు తగినట్టుగా ఈ నెల 31 నాటికి కాలువలు మూసివేయాలని ఇటీవల కాకినాడలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఇరిగేషన్ శాఖ సమావేశంలో నిర్ణయించారు. అయితే డెల్టాలో ఫిబ్రవరి మొదటివారంలో కూడా నాట్లు పడినందున కాలువలకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకూ సాగునీరు ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తూ ‘అసాధ్యమని తెలిసి కూడా అదేపాట’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఏప్రిల్ 10 వరకూ - మిగతా 2లోఠ
డెల్టా కాలువలకు నీరు ఇవ్వక తప్పదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సీలేరు పవర్ జనరేషన్ ద్వారా వస్తున్న నీటినే కాకుండా బైపాస్ పద్ధతిలో మరో 15 రోజుల పాటు అదనపు నీటిని రప్పించాలని శుక్రవారం నిర్ణయించారు. అంటే ఈ నెల 28 వరకూ బైపాస్ పద్ధతిలో నీరందుతుందన్నమాట. సీలేరు నుంచి వదిలే నీరు ధవళేశ్వరం బ్యారేజికి చేరేసరికి వారం రోజులు పడుతోంది. అంటే బైపాస్ పద్ధతిలో ఏప్రిల్ 5 వరకూ బ్యారేజికి నీరు వస్తుంది. కోతలకు వారం రోజుల ముందు నుంచి పొలానికి నీరు పెట్టకుండా ఆరబెట్టే అకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 10 వరకూ సాగునీరు పంపిణీ చేయాలని, తద్వారా రబీ సాగుకు పూర్తిగా నీరందించినట్టవుతుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగానే మార్చి 31 నాటికి కాలువలు మూసివేయాలని నిర్ణయించారు. అయితే బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో నిరుత్సాహం చోటుచేసుకుంది. ఈ నిధులతో కాలువలపై చిన్నచిన్న మరమ్మతులు మినహా భారీ పనులు చేసే అవకాశం లేదు. నిధులు తక్కువగా కేటాయించడం కూడా కాలువల మూసివేత గడువు పెంచడానికి కారణమైంది.