సీమాంధ్రలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
25 లోక్సభ స్థానాలకు 373, 175 అసెంబ్లీ స్థానాలకు 3,695 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు శనివారం సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు 373 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 3,695 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం (23వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంది. తర్వాత ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు బరిలో ఉన్నారో తేలిపోతుంది.
వచ్చే నెల 7న పోలింగ్ జరుగుతుంది. కాగా, లోక్సభ స్థానాల్లో విజయవాడ, నంద్యాలలో అత్యధికంగా 29 మంది చొప్పున నామినేషన్లు వేశారు. కడప జిల్లా రాజంపే ట లోక్సభకు అత్యల్పంగా 9 నామినేషన్లు దాఖల య్యాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 406 నామినేషన్లు దాఖలు కాగా, 9 నియోజకవర్గాలున్న విజయనగరం జిల్లాలో 124 మంది నామినేషన్లు వేశారు.