‘పంచకర్మ’తో కొవ్వుల నియంత్రణ నిజమే
ఆయుర్వేద చికిత్స ప్రక్రియతో రక్తంలోని మెటబొలైట్స్లో మార్పులు వస్తున్నాయని తద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణతోపాటు వాపు, గుండెజబ్బుల ప్రమాదం తగ్గడం వంటి సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రీయ ప్రయోగమొకటి స్పష్టం చేసింది. ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆయుర్వేద చికిత్స విధానాల్లో ‘పంచకర్మ’ ఒకటన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా రోగులకు శాఖాహారం మాత్రమే అందిస్తూ... రోజూ యోగా, ధ్యానం చేయిస్తూ, అప్పుడప్పుడు శరీరానికి మర్దన చేయిస్తారు. ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన దీపక్ చోప్రా ఇటీవల ఒక ప్రయోగం చేపట్టారు. ఇందులో భాగంగా 30-80 ఏళ్ల 119 మందిని ఎంపిక చేసి వారిలో సగం మందికి ఆరు రోజులపాటు పంచకర్మ క్రియను అందించారు. చికిత్సకు ముందు, తరువాత రక్తం తాలూకూ ప్లాస్మాను క్షుణ్ణంగా విశ్లేషించారు. పంచకర్మ చికిత్స అందుకున్న వారి రక్తంలో దాదాపు 12 ఫాస్పోలిపిడ్స్ గణనీయంగా తగ్గాయని, ఈ మార్పులు వారి కొలెస్ట్రాల్ మోతాదులకు విలోమానుపాతంలో ఉన్నట్లు గుర్తించామని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టీన్ తారా పీటర్సన్ తెలిపారు. ఈ ఫాస్పోలిపిడ్స్ కొలెస్ట్రాల్, వాపు నియంత్రణను ప్రభావితం చేస్తాయని, వీటిల్లో ఒక ఫాస్పోలిపిడ్ అధికమోతాదులో ఉండటం గుండెజబ్బులకు దారితీస్తుందని ఇప్పటికే గుర్తించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ప్రభావశీలతకు కారణాలను విశ్లేషిస్తామని క్రిస్టీన్ వివరించారు.