‘దీపం’ లబ్ధిదారులపై అదనపు భారం
–కిరోసిన్ లీటరుపై రూ.4 వడ్డింపు
– జిల్లాలో 2.16 లక్షల దీపం కనెక్షన్లు
– లబ్ధిదారులపై నెలసరి రూ.8.64 లక్షల భారం
అనంతపురం అర్బన్ : దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులపై ప్రభుత్వం అ‘ధన’పు భారం మొపింది. దీపం కనెక్షన్ కలిగిన వారికి కిరోసిన్ లీటర్ ధరపై రూ.4 అదనంగా వడ్డించింది. ఇప్పటి వరకు లీటరు రూ.15 ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ.19కు పెంచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులపై నెలసరి రూ.8.64 లక్షలు భారం పడనుంది. బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన) కార్డు కలిగినప్రతి ఒక్కరూ దీపం కనెక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. జిల్లాలో బీపీఎల్ కార్డులు (తెల్ల) 11.28 లక్షలు ఉన్నాయి. వీటికి నెలసరి 14.85 లక్షల లీటర్ల కిరోసిన్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మొత్తం కార్డుల్లో దీపం గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు 2.16 లక్షల మంది ఉన్నారు.
కిరోసిన్ రద్దు దిశగా...
దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు భవిష్యత్తులో కిరోసిన్ పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. బీపీఎల్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ దీపం కనెక్షన్లు ఇవ్వాలని ఇప్పటికే జిల్లాలకు ప్రభుత్వం లక్ష్యం విధించింది. దీంతో అధికారులు ఏజెన్సీలపై ఒత్తిడి పెంచారు. లబ్ధిదారులను గుర్తించి నవంబరు 15లోగా ప్రతి గ్యాస్ ఏజెన్సీ 2 వేల దీపం కనెక్షన్లు ఇవ్వాలని, 2017 మార్చి నాటికి నిర్ధేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రక్రియ పూరై్తన తరువాత దీపం లబ్ధిదారులకు కిరోసిన్ రద్దు చేయవచ్చునని తెలిసింది.
–––––––––––––––––––––––––––––
ఇంకా ఉత్తర్వులు రాలేదు
దీపం కనెక్షన్లు కలిగిన లబ్ధిదారులకు లీటర్ కిరోసిన్ రూ.19కి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంకా రాలేదు.
– ప్రభాకర్‌రావు, జిల్లా సరఫరాల అధికారి