Delta canals
-
రబీకి సై..
అమలాపురం: చిన్నచిన్న ఇబ్బందులు మినహా.. ఖరీఫ్ సాగు దాదాపు ఆశాజనకంగానే ముగియడంతో.. రైతులు ఇక రబీ సాగు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గోదావరి డెల్టాలో రబీ సాగు ఆదివారం ఆరంభం కానుంది. ఈ ఏడాది సమృద్ధిగా సాగు నీరు ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం గోదావరిలో సహజ జలాలు తగ్గడం అధికారులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నా.. సీలేరు జలాలు కూడా తోడు కానుండడంతో రబీ సాగుకు ఢోకా ఉండదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగుకు వీలుగా అధికారులు గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నుంచి నీటి విడుదల పెంచనున్నారు. తూర్పు డెల్టాకు ఎక్కువగా, మధ్య డెల్టాలో కోతలు పూర్తి కానందున వారం రోజుల పాటు తక్కువగా నీరందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు డెల్టాలో ఇప్పటికే బోర్ల మీద కొంతమంది రైతులు రబీ నారుమడులు పోసుకున్నారు. ఇక్కడ వెదజల్లు సాగుకు అనుగుణంగా ఎక్కువ మంది రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రెండు డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలో మొత్తం 4,36,533 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. మొత్తం సాగు కాలంలో కనీసం 90 టీఎంసీల నీరు అవసరమన్నది అధికారుల అంచనా. ఇందులో సీలేరు పవర్ జనరేషన్, బైపాస్ పద్ధతిలో 47 టీఎంసీలు, సహజ జలాలు 46 టీఎంసీలు వస్తాయని లెక్కలు కట్టారు. మొత్తం 93 టీఎంసీల నీరు వస్తున్నందున సాగుకు ఢోకా ఉండదని భావించారు. ఈ ఉద్దేశంతోనే రబీ మొత్తం ఆయకట్టుకు గత నెల 7న కాకినాడలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో మంచి దిగుబడులు పొందిన రైతులు.. రబీలో కూడా అదే ఫలితాన్ని సాధిస్తే ఈ ఏడాది వ్యవసాయంలో లాభాలు చూసే అవకాశముంటుందన్న ఆశతో ఉన్నారు. డెల్టాలో రబీసాగుకు సిద్ధమవుతున్న సమయంలో గోదావరిలో సహజ జలాల తగ్గుదల రైతులను, అధికారులను ఆలోచనలో పడవేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి ఇన్‌ఫ్లో 8,221 క్యూసెక్కులు మాత్రమే. ఇదే సమయంలో పట్టిసీమ 12 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు 4,250 క్యూసెక్కుల నీటిని తోడారు. అంటే మొత్తం ఇన్‌ఫ్లో 12,471 క్యూసెక్కులన్న మాట. ఇందులో సీలేరు పవర్ జనరేషన్ ద్వారా 3,384 క్యూసెక్కులు వస్తోంది. దీనిని మినహాయిస్తే 9,087 క్యూసెక్కులు మాత్రమే గోదావరి సహజ జలాలు రావడం గమనార్హం. వచ్చిన నీటిలో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 400, మధ్య డెల్టాకు 800, పశ్చిమ డెల్టాకు 2,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 4,573 క్యూసెక్కుల మిగులు జలాలు వదులుతున్నారు. గోదావరి సహజ జలాలు 10 వేల క్యూసెక్కుల కన్నా తక్కువగా ఉండడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే వీటి రాక రెట్టింపు ఉంది. గత ఏడాది డిసెంబర్ రెండు, మూడు తేదీల్లో సహజ జలాలు 4,167 క్యూసెక్కులు మాత్రమే కావడం గమనార్హం. ఇది డిసెంబర్ 8 నాటికి సున్నాకు పడిపోయింది. తరువాత కొంతమేర పెరిగినా ఆశించిన స్థాయిలో సహజ జలాలు రాలేదు. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది నీటి రాక ఆశాజనకంగా ఉండడం అధికారుల్లో ధీమాను పెంచుతోంది. అయితే రైతులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం సాగు పూర్తి చేస్తే మంచిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ మొదటి వారానికి పూర్తి చేయాలని కోరుతున్నారు. ముందస్తు సాగు చేయాలి.. సహజ జలాలు తగ్గుతున్నా సాగుకు పూర్తిగా నీరు ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ రైతులు ముందుగా సాగు చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. మధ్య డెల్టాలో కోతలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున మరో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయలేం. ఇక్కడ ఖరీఫ్ ఆలస్యమైనా రబీకి రైతులు సన్నాహాలు చేసుకోవాలి. డిసెంబర్ నెలాఖరుకు నాట్లు పూర్తి చేసుకోవాలి. – ఎన్.కృష్ణారావు, ఎస్ఈ, గోదావరి ఇరిగేషన్ సర్కిల్, ధవళేశ్వరం -
తొమ్మిదేళ్లు.. సాగని పనులు
జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి సా..గుతూనే ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధునికీకరణ పనులకు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశాయి. దాదాపు పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రూ.200 కోట్ల మేర పనులు కూడా పూర్తికాలేదు. కాలువలు, డ్రెయిన్లలో మట్టిపూడికతీత పనులు, అవసరమైనచోట రక్షణ గోడలు నిర్మించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముఖ్యమైన స్లూయిజ్‌లు, లాకులు, రెగ్యులేటర్లు, అవుట్ పాల్ స్లూయిజ్‌ల వంటి నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు. దీంతో పాటు ప్రధాన లాకులు శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. నిడదవోలు: పశ్చిమడెల్టా పరిధిలో విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్‌తో పాటు ప్రధానంగా నరసాపురం కాలువ, బ్యాంకు కెనాల్, కాకరపర్రు కాలువ, గోస్తనీ నది అత్తిలి కాలువ, జంక్షన్ కాలువ, ఏలూరు కాలువ, ఉండి కాలువ, వీఅండ్ డబ్ల్యూ, ఓడబ్ల్యూ కాలువలపై 24 లాకులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నరసాపురం ప్రాంతంలో మాధవాయిపాలెం, నల్లీక్రిక్, దర్భరేవు, నక్కల డ్రైయిన్, అయితంపూడి, మార్టేరు, కవిటం, పెరవలి, మొగల్తూరు, సిద్దాంతం, కోడే రు, లక్ష్మీపురం, గుమ్మంపాడు లాకులు శిథి లావస్థకు చేరుకున్నాయి. దీంతో సాగునీటి విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటిలో పెరవలి, కవిటంలో లాకుల నిర్మాణ పనులు చేపట్టినా అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాకరపర్రు రెగ్యులేటర్ లక్షల ఎకరాలకు దిక్కు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను శివారులో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై 1874 కాటన్ దొర హయంలో నిర్మించిన కాకరపర్రు ప్రధాన రెగ్యులేటర్ (లాకులు) శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ నుంచి జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. దీనిని నిర్మించి సుమారు 143 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. పిల్లర్లు పటిష్టంగా ఉన్న రెగ్యులేటర్ యంత్ర సామగ్రి పూర్తిగా శిథిలమైంది. రెగ్యులేటర్‌కు ఉన్న 8 ఖానాల్లో తలుపులు, షట్టర్లు తుప్పుపట్టాయి. దీని ఫలితంగా సాగునీరు క్రమబద్ధీకరించడంలో సి బ్బంది అవస్థలు పడుతున్నారు. రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక్కోసారి వరదనీటిని నియంత్రించలేక పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. లీకేజీలతో నీరు వృథా అవుతోంది. వంతుల వారీ విధానం అమలు చేస్తున్నా దాళ్వాలో రైతులకు పూర్తిస్థాయిలో నీటి అవసరాలు తీరడం లేదు. పక్కనే గోస్తనీ నది కాలు వపై అదే సమయంలో నిర్మించిన స్లూయిజ్ కూ డా శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సా..గుతున్న నిర్మాణాలు 2012లో డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా కాకరపర్రు రెగ్యులేటర్, గోస్తనీ నది కాలువ స్లూయిజ్‌ల నిర్మాణానికి రూ.7.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదైనా కాలువలు కట్టే సమయంలోపు నిర్మాణాలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. పనులు ఆలస్యానికి కారణాలివే.. కాలువలు కట్టే సమయం సరిపోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్లు పెదవి విరుస్తున్నారు. ఏటా ఏప్రిల్, మేలో 45 రోజుల పాటు కాలువలకు నీటి విడుదల ఆపుతున్నారు. అయితే కాలువలో పూర్తిగా నీరు లేకుండా 35 రోజులు మాత్రమే ఉం టోంది. ఈ సమయం లాకుల నిర్మాణానికి సరిపోవడం లేదని, చేసిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పనుల్లో భాగంగా పెద్ద ప్రాజెక్టులను ప్రోగ్రెసివ్, ఐవీఆర్సీఎల్ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ముందుగా 10 శాతం అడ్వాన్సులుగా తీసుకుంటున్నా సకాలంలో పనులు పూర్తికావడం లేదు. దీంతో ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతోంది. 2008లో పనులు చేపట్టిన సమయంలో రూ.500 కోట్ల వ్యయం అంచనా వేయగా ప్రస్తుతం రూ.1,000 కోట్లకు చేరినట్టు తెలిసింది. పంట విరామానికి ససేమిరా పశ్చిమ డెల్టా పరిధిలో 5.30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. విజ్జేశ్వరం నుంచి జిల్లా శివారు భూములకు సాగునీరు పూర్తిస్థాయిలో చేరాలంటే ఆధునికీకరణ పనులు పూర్తిచేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2010లో ప్రభుత్వం రెండేళ్ల పంట విరామం ప్రకటించాలని ప్రతిపాదనలు తెచ్చినా ప్రజాప్రతినిధులు, రైతులు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి పంట విరామం ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టింది. -
శివారు కష్టాలపై దృష్టేదీ ?
అమలాపురం :ప్రస్తుతం డెల్టా కాలువలు గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయాయి. ఫలితంగా శివార్లకు నీరు సరిగా అందడం లేదు. ఒకవైపు సమయం మించిపోతున్నందున త్వరగా రబీ నాట్లు పూర్తి చేయాలని రైతులు పరుగులు పెడుతున్నా, జిల్లా అధికారయంత్రాంగం శివార్లకు నీరందించే ందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)ల పరిధిలో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతుంది. సాగు ఆరంభంలోనే 16 టీఎంసీల నీటి కొరత ఉందని, రైతులు నీటి వినియోగంలో పొదుపు పాటించాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తి చేయని చేలకు చివరిదశలో నీరివ్వడం కష్టమని చెప్పారు. డెల్టాలతోపాటు పీబీసీ ఆయకట్టుకు సాగునీరందించే మేజర్, మీడియం చానళ్లు, మైనర్ కాలువల నిడివి సుమారు 3,500 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. వీటిలో 60 శాతం కాలువలు గుర్రపుడెక్క, తూడుతో పూడుకుపోయాయి. గోదావరిలో నీటి ఎద్దడి వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీరందించే అవకాశం తక్కువ. దీనికి తోడు కాలువలు పూడుకుపోవడంతో ప్రవాహం వడి మరింత తగ్గి శివార్లకు చేరడం ఇబ్బందే. మెరక రైతులు మోటార్లతో తోడుకోవడం తప్ప నీరు బోదెల ద్వారా పారే అవకాశం లేదు. రబీలో ఒక్క రూపాయి వెచ్చించలేదు.. గోదావరి డెల్టాలో కాలువల్లో పేరుకుపోయే గుర్రపుడెక్క, తూడు, ఇతర అవ రోధాల తొలగింపు చాలా కీలకం. ఏటా ఖరీఫ్, రబీ సాగుకు ముందు వీటిని తొలగిస్తుంటారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు వీటి తొలగింపు పనులను సకాలంలో చేపట్టి, నిధులు మంజూరు చేసేవారు. వీటి గురించి ఆలోచించే తీరిక ఇప్పటి అధికారులకు లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ పనులు సకాలంలో చేయడం లేదు. శివార్లకు నీరందక పోవడానికి ఇది ఒక కారణం. ఏటా రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువా రూ.15 కోట్లతో ఈ పనులు చేసే అవకాశముంది. అయితే ఈ ఏడాది కనీసం రూ.రెండు కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఖరీఫ్‌లో అక్కడక్కడా గుర్రపుడెక్క తొలగించినా కీలకమైన రబీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నీటి ఎద్దడి నేపథ్యంలో ఇప్పుడే పనులు చేయాల్సి ఉంది. మారిన నిబంధనతో ముదిరిన అలసత్వం గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేసి ధ వళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోనే బిల్లు లు చేసేవారు. అయితే ప్రభుత్వం ఈ నిబంధన మా ర్చి నీటి తీరువా నిధులతో చేపట్టే పనులకు ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనుమ తి తప్పనిసరి చేసింది. నిధులు రాబట్టేందుకు అథారిటీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఒప్పించే తీరికా, ఓపికా లేని స్థానిక ఇరిగేషన్ అధికారులు దానిపై దృష్టిపెట్టడం లేదు. ఇదే సమయంలో నీటి సంఘా లు మనుగడలో లేకపోవడంతో నిధుల గురించి ఆరా తీసేవారు లేక చిన్నచిన్న పనులే పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు కాలువల్లో నీరు నిరాటంకంగా పారేలా చర్యలు తీసుకుని, రబీ సాగు సజావుగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.