Dental medical
-
జీవో 42 రద్దు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ వైద్య విద్య కోర్సులకు 2017–18 నుంచి 2019–20 బ్లాక్ పీరియడ్ కాలానికి ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 15న జారీ చేసిన జీవో 42ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) నిర్ణ యించిన ఫీజులను, ప్రభుత్వానికి పంపుతూ ఇచ్చిన కమ్యూనికేషన్‌ను రద్దు చేసింది. హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఫీజులను నిర్ణయించ లేదని ఆక్షేపించింది. ఫీజుల నిర్ణయం విషయంలో ఆయా కాలేజీలు లేవనెత్తే అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని తామిచ్చిన ఆదేశా లను పట్టించుకోలేదంది. అలాగే ఒక్కో కాలేజీకి సంబంధించి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆదేశాలను కూడా ఏపీహెచ్‌ఈఆర్ ఎంసీ బేఖాతరు చేసిందని హైకోర్టు ఆక్షేపించింది. జీవో 42 ఆధారంగా ఫీజు ఖరారు చేసిన విద్యా సంస్థల్లో తిరిగి ఫీజులను నిర్ణయించి నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫీజుల విషయంలో ఏవైనా ఆధారా లను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటే, ఆ ఆధారాలను సంబంధిత కాలేజీ ముందు ఉంచి వారి వాదనలు వినాలంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ప్రతి కాలేజీ విషయంలో వేర్వేరుగా తగిన కారణాలతో లిఖితపూర్వకంగా ఉత్తర్వులివ్వా లంది. కమిషన్ తన ఫీజుల ఖరారు ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపాలంది. ఆ ఉత్తర్వులు అందు కున్న వారంలోపు ఆ ఫీజును ప్రభుత్వం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రశాంతంగా సీఈటీ
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) మొదటి రోజైన గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక ఎగ్జామినేషన్ బోర్డు (కేఈఏ) పోలీసు శాఖతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధి వరకూ 144 సెక్షన్ విధించారు. కేంద్రాలకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కాగా, మొదటిరోజు జీవశాస్త్రం, గణింతం విషయాల్లో పరీక్ష జరిగింది. నేడు (శుక్రవారం) భౌతిక, రసాయన శాస్త్రాల్లో పరీక్ష జరగనుంది. ఈ ఏడాది సీఈటీ కోసం బెంగళూరులోని 70 కేంద్రాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలను కేఈఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.